Saturday, June 20, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 11

లక్ష్యాత్మకవాదం యొక్క మరణం:
ప్రకృతి అంతా లక్ష్యాత్మకమైనది అన్నది లక్ష్యాత్మక వాదం యొక్క సారాంశం. అంతిమ లక్ష్యమే యదార్ధాన్ని (ప్రకృతి యొక్క) నిర్దేశిస్తుంది అని ఈ వాదం భావిస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రాసికి ప్రకృతి యొక్క భౌతిక అవగాహన, చారిత్రిక భౌతికవాద అవగాహనలు వదిలివేయరాని, అత్యావస్యకమైన పునాదులు అన్నది మార్క్స్ యొక్క నిశ్ఛితాభిప్రాయం. మానవ చరిత్ర, ప్రకృతి చరిత్ర అంతిమంగా ఒకే చారిత్రిక చట్టం క్రిందికి వస్తాయి. అందువలనే ఆయన ఒక దేవుని యొక్క పధకం ప్రకారం జరిగిన సృష్టి అన్న అన్ని రకాల భావనలకూ వ్యతిరేకంగా ఆయన పరిణామవాద దృక్ఫధాన్ని నిలకడగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఒకరకమైన ఆకస్మక, యాదృచ్చిక ఉత్పాదనానికి అనుగుణంగా ఈ ప్రపంచంలో ‘ ప్రాణం ’ ఆవిర్భవించిందని ఆయన దృఢంగా వాదించాడు. ఆయన ఏంగెల్స్ తో కలిసి జీవసంబంధమైన ఉనికిని గురించి లక్ష్యాత్మకవాద అంశాల పరిధిలో అర్ధం చేసుకోలేము అనీ ‘ జంతువులకూ, మొక్కలకూ మధ్యగల తీవ్రమైన పోటీ ’ అన్న అంశంలో జీవ రూపాల ఉనికి ముడిపడి ఉందనీ అటువంటి పోటీలోనే తెగలకు (జీవులకు) ప్రకృతికీ చెందిన సహజ పరిస్థితులకూ గల సంబంధం యొక్క భౌతిక కారణం ఉందనీ ఆయన వాదించాడు. చారిత్రిక భూగర్భ శాస్త్రాల నుండి పుట్టుకొచ్చిన ‘లోతైన కాలం’ అన్న అవగాహనను ఆయన ముందునుండీ అనుసరించాడు.
మార్క్స్ డార్విన్ యొక్క పరిణామవాద సిద్ధాంతాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. డార్విన్ యొక్క ’ జీవుల పుట్టుక ‘ గ్రంధాన్ని చదివిన అనంతరం మార్క్స్ ఫెర్డినాండ్ లూసే కు ఉత్తరం రాస్తూ ‘ మొట్టమొదటి సారి ఈ గ్రంధంలో ప్రకృతి శాస్త్రంలో లక్ష్యాత్మక వాదానికి చావుదెబ్బ కొట్టడం జరిగింది. దానియొక్క హేతుబద్ధమైన అర్ధాన్ని అనుభవవాదం ద్వారా వివరించడం జరిగింది ’ అని పెర్కొన్నాడు. అయితే డార్విన్ మాల్తూస్ ను స్పూర్తిగా తీసుకొని తన ‘ సహజ ఎంపిక ’ సిద్ధాంతాన్ని అభివృద్ధిచేయడం వలన ‘ క్రైస్తవ మత నైతికత ’ ప్రకృతి మత ధర్మశాస్త్రాలను, వర్గాలూ-ఆస్తిని విభజించే బూర్జువా సమర్ధనలనూ సమాదరించిన మాల్తూస్ సిద్ధాంతానికి, అనుకోకుండా డార్విన్ సామాజిక రంగంలో అర్హత కల్పించాడనీ, మార్క్స్ ఆయన్ని విమర్శించాడు. అందువల్లనే మార్క్స్ , ఏంగెల్స్ లు మానవజాతి స్వేశ్ఛను మరింత పెంపొందించడం కోసం భౌతికవాద/ మానవతావాద శాస్త్ర విజ్ఞానానికి కట్టుబడి వుంటూ అన్ని సందర్భాలలోనూ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని మాల్తూస్ సిద్ధాంతం లేదా సామాజిక డార్వినిజం అన్న సిద్ధాంతాలనుండి వేరుచేసి విడిగా చేయాలని కోరుకున్నారు. వర్గసంబంధాలను సమర్ధించేందుకు ఉద్దేశింపబడిన మాల్తూస్ యొక్క నైరూప్య జనాభా సిద్ధాంతం యొక్క స్థానంలో , మానవ జనాభా యొక్క అభివృద్ధిని, సమాజాల అభివృద్ధిని గురించి వాటికి సంబంధించిన అన్ని కోణాలను గురించి ఒక చారిత్రక, భౌతికవాద, శాస్త్రీయ అవగాహనను అభివృద్ది చేయడం కోసం మార్క్స్ ఎక్కువ మేరకు మానవతా జాతి ఉద్భవం , వారి నడవడిక సాంప్రదాయాల అధ్యయనం జరిపే నూతన శాస్త్రమయిన మానవ శాస్త్రం వైపుకు ప్రధానంగా తన దృష్టిని మళ్ళించాడు.

No comments: