Tuesday, January 20, 2009

కాశ్మీరు పై కామ్రేడ్ ఏ.కే.ఘోష్ ప్రశ్నలకు సమాధానం

తమ స్థాయి స్థితిని పరిష్కరించుకొనే అవకాశం ప్రజలకివ్వటమూ, ఐరాస లేదా దాని వెనుక నున్న ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదుల జోక్యాన్ని నివారించటమూ కాశ్మీరు సమస్య పరిష్కారానికి కేంద్ర అంశాలని మేము భావిస్తున్నాము.
భారత పాకీస్తానులు నిర్యుద్ధ ఒప్పందం పై సంతకాలు చెయ్యాలని , ఐరాస నుండి కాశ్మీరు సమస్యను ఉపసంహరించాలని , దేశం నుండి ఐరాస ప్రతినిధి వెళ్ళిపోవాలనీ , శాంతియుతంగానూ, ప్రజాస్వామ్యయుతంగానూ, కాశ్మీరు సమస్యకు పరిష్కారం కనుగొనాలనీ భారత కమ్యూనిష్యుపార్టీ కేంద్ర కమిటీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కాశ్మీరు సమస్య పరిష్కారాన్ని సరీగ్గానే చెప్పింది.
కాశ్మీరు సమస్య పరిష్కారంలో అమెరికా బ్రిటీషు సామ్రాజ్యవాదుల జోక్యానికి తగిన భూమిక నేర్పరస్తుంది గనుక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ ( జనాభిప్రాయసేకరణ ) ను సమర్ధించటం సరైంది కాదు.
కాశ్మీరు ప్రజల ప్రయోజనాలు , ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకుంటూ కాశ్మీరు భారత్లో చేరాలా లేక స్వతంత్రంగా ఉండాలా అన్నదానిని రాజ్యాంగ సభ నిర్ణయించాలనీ భారత కమ్యూనిష్టు పార్టీ అధికారికంగా ప్రకటించాలి. దీనితో పాటే భారత్ లో చేరే నిర్ణయాన్ని కాశ్మీరు ప్రజలూ, రాజ్యాంగ సభ తీసుకునే విధంగా భారత కమ్యూనిష్టు పార్టీ అన్ని చర్యలూ తీసుకోవాలి.
రాజ్యాంగ సభ సమావేశమవటానికి షరతుగా కాశ్మీరు నుండి భారత పాకీస్తాను సైన్యాలు వైదొలగాలన్న డిమాండును ప్రస్తుతానికి పెట్టరాదు.
కాశ్మీరు సమస్యపై కమ్యూనిష్టు పార్టీ తన వైఖరిని నిర్ణయించుకునే టప్పుడు , పాకీస్తాన్ పాలకుల వైఖరి కంటే షేక్ అబ్దుల్లా ,భారత ప్రభుత్వాల వైఖరి ప్రజాస్వామిక శిబిరానికి ఆమోదకరమన్న అంశాన్ని పరిగణన లోనికి తీసుకోవాలి. కాశ్మీరు పాకీస్తానులో చేరితే , అది కాశ్మీరు బానిసత్వానికి, ఈ ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాదం పెరగడానికి దారి తీస్తుంది.
సాయుధ బలంతో కాశ్మీరును కలిపేసుకునేందుకు పాకీస్తాను ప్రయత్నిస్తే , పాకీస్తానుకు భారత సైనిక సమాధానాన్ని పాకీస్తానుకు వ్యతిరేకంగా కాశ్మీరు విముక్తికి సైనిక సహాయంగా పేర్కొంటూ మద్దతు తెలపాలి.
-జె.స్టాలిన్
కేంద్ర కమిటీ కార్యదర్శి

Friday, January 16, 2009

1951లో భారత పాకీస్తాన్ సంబంధాల గురించి

కామ్రెడ్ స్టాలిన్ కు,
భారత పాకీస్తాన్ సంబంధాలను గురించి భారతదేశం నుండి ఏ.కే.ఘోష్ నుండి అక్టోబర్ 5వ తేదీన అందిన లేఖనూ, దానితోపాటు డాంగే నుండి రాజేశ్వరరావునుండి అందిన లేఖలను ఇంగ్లీషు లోకి తర్జుమా చేసి మీకు పంపిస్తున్నాను.
కాశ్మీరు సమస్యపై సిపిఐ విధానాన్ని ఏ.కే.ఘోష్ వివరించారు. పోలిట్ బ్యూరో , కేంద్రకమిటి సభ్యులలో ఉన్న భిన్నాభి ప్రాయాలను తెలిపారు. కాశ్మీరు సమస్య పై మన పార్టీ కేంద్ర కమిటీ అభిప్రాయాన్ని తెలుపమని కోరారు.
ఈ లేఖపై సూచనలను తరువాత పంపుతాను.
ఇట్లు,
ఆల్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ ( బోల్షివిక్ )
కేంద్ర కమిటీ విదేశాంగ విధాన కమీషన్ అధ్యక్షులు వి.గ్రిగోరియన్
5 అక్టోబరు 1951.
------------------------------------------

భారత- పాకిస్తాన్ సంబంధాల గురించి.
భారత- పాకిస్తాన్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో బాగా తీవ్రమయ్యాయి. ప్రస్తుతం తీవ్ర ప్రమాద స్థాయికి చేరాయి.
కాశ్మీరు సమస్య చుట్టూ ఘర్షణ పెరుగుతుంది. ఈ వివాదపు చరిత్రలోకి వెళ్ళి వివరించవలసిన అవసరం లేదు. ఒకరిపై మరొకరిని భారత్-పాకీస్తాన్లను సామ్రాజ్యవాదులెలా రెచ్చగొట్టారో కాశ్మీరు పై అదుపును పొంది, దానిని రష్యా చైనాలకు వ్యతిరేకంగా సైనిక స్థావరంగా వినియోగించుకొనేందుకు భారత- పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు ఎలా రేపెట్టారో తెలిసిన విషయమే.
మధ్యవర్తిత్వం నెరుపుతామన్న ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను భారత్ ఫిబ్రవరిలో తిరస్కరించిన విషయము తెలిసిందే. షేక్. అబ్దుల్లా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలో వయోజనులందరూ ఓటర్లుగా ఎన్నికల ద్వారా ఏర్పడే రాజ్యాంగ నిర్ణాయక సభ కాశ్మీరు ప్రభుత్వరూపాన్ని భారత- పాకిస్తాన్లలో దేనిలో చేరాలన్న అంశాన్నీ నిర్ణయిస్తుందని షేక్. అబ్దుల్లా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
వెనువెంటనే రాజ్యాంగ నిర్ణాయక సభ భారత ప్రభుత్వం చేతిలో పనిముట్టని , అది చేసే నిర్ణయాలన్నీ చట్ట విరుధ్ధమైనవిగా పరిగణిస్తామని పాకీస్తాన్ పాలకులు ప్రకటించారు. షేక్. అబ్దుల్లా రాజ్యాంగ సభను ఏర్పాటు చేయటాన్ని కాశ్మీరు ప్రజలపై దురాక్రమణ చర్యగా పరిగణిస్తామని, అన్నివిధాల దాన్ని ప్రతిఘటిస్తామని, “ స్వతంత్ర పాకీస్తాన్ “ప్రభుత్వపూ, పాకీస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగంలోని “ ప్రభుత్వపూ “ నాయకులు ప్రకటించారు.
ఇలాంటి హెచ్చరికలున్నప్పటికీ రాజ్యాంగ సభ ఏర్పాటుకు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికలు సెప్టెంబర్ లో జరుగవలసివుంది.
ఈ పరిస్తితులలో డాక్టర్. గ్రాహం ను , అతని బృందంలోని సైనికాధికారులను ,సలహాదారులనూ “ అతిధులుగా “ భారత ప్రభుత్వం ఆహ్వానించింది.
ఢిల్లీ, కరాచీ, సింగపూర్ లలో గ్రహం పర్యటించాడు. భారత పాకీస్తాన్ల మధ్య సైనిక ఉద్రిక్తత సృష్టించటంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. గ్రాహం రాక నాటినుండి పాకిస్తాన్ పాలకుల ప్రకటనలు మరింత శతృపూరితంగా ఉన్నాయి. పత్రికల్లో, రేడియోలో బహిరంగంగానే “ జీహాద్ ” ( ధర్మయుద్ధం ) పిలుపులి0చ్చారు. పాకిస్తాను సరిహద్దుల వద్ద కందకాలు త్రవ్వడం, నగరాలలో బ్లాక్ అవుట్లద్వారా యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టారు. భారత పత్రికల్లోని ఒక సెక్షను , అభివృద్ధి నిరోధక సంస్ధ హిందూ మహాసభలు కూడా పాకీస్తాన్ పై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఏమైనప్పటికీ యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ పూనుకోలేదు.
ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వానికి భారత ప్రభుత్వాన్ని బలవంతంగా ఒప్పించాలన్న లక్ష్యం తోనే పాకీస్తాన్ బెదిరింపుల విధానం సాగిందన్నది స్పష్టమే. ఈ అడుగు వేసే విధంగా పాకీస్తాను ను ఆంగ్లో-అమెరికా సామ్రాజ్యవాదులు నెట్టారు. విభజనరేఖకు ఇరువైపులా , తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంట భారత్ పాకీస్తానులు సాయుధబలగాలను మోహరించాయి. చాలా భాగంలో ఈ సాయుధ బలగాలు ఎదురు బొదురుగా నిలిచి ఉన్నాయి. పశ్చిమ సరిహద్దులో ఎక్కువగా సైనిక సమీకరణ జరిగింది.
ఇటీవల విడుదల చేసిన నెహ్రూ,లియాకత్ ఆలీఖాన్ ల మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలనుండి ఈ క్రింది విషయాలు స్పష్టమౌతున్నాయి :
1. భారత భూభాగం పై దాడి చెయ్యనని హామీ ఇవ్వటానికి పాకీస్తాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే కాశ్మీరు లోని ఏభాగాన్నయినా “ భారత భూభాగం ” గా గుర్తించేందుకు నిరాకరించింది.
2. కాశ్మీరును బలంతో ఆక్రమించే ఉద్దేశ్యం పాకీస్తానుకుందనటాన్ని ఇది తెలుపుతున్నట్లు భారత ప్రభుత్వం పరిగణించింది. ప్రస్తుతం భారత సాయుధబలగాల ఆధీనంలో ఉన్న కాశ్మీరు భాగం పై దాడి జరిగితే, దానిని భారత భూభాగంపై జరిగిన దాడిగా పరిగణించి , భారత-పాకీస్తాన్ సరిహద్దు వెంట మొత్తంగా యుద్ధం ప్రారంభిస్తానని భారత ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవంగా చూస్తే, యుద్ధం జరగబోదని నమ్మకంగా చెప్పవచ్చు. కానీ ఏహఠాత్పరిణామాలకైనా పార్టీ సిద్ధంగా ఉండి, ఈ సందర్భానికి తగిన విధానాన్ని రూపొందించుకొని వుండాలి.
ఈ క్రింది అంశాలపై పార్టీలో పూర్తి అంగీకారం ఉంది:
1. సహాయం కోసం తమ దరికి చేరే విధంగా భారత, పాకీస్తాన్ ల మధ్య సైనిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధానాన్ని సామ్రాజ్యవాదులు పాటిస్తున్నారు. దీనివల్ల ఈ దేశాలలో వారి ప్రభావం పెరుగుతుంది.
2. ఐ.రా.స. మధ్యవర్తిత్వాన్ని భారత్ తో బలవంతంగా ఒప్పించేందుకు సామ్రాజ్యవాదులు సృష్ఠించిన సైనిక ఉద్రిక్తతలను చల్లార్చేందుకు పార్టీ పోరాడాలి.
3. యుద్ధాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో సాగే ప్రచారాన్నంతటినీ వ్వతిరేకించడం పార్టీ కర్తవ్యంగా వుండాలి. సామ్రాజ్యవాదులే యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారనీ, చివరకీ వారే లాభపడతారనీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. యుద్ధమంటే ఇరుదేశాల ప్రజలకూ నష్టం.
4. కాశ్మీరు సమస్యను కాశ్మీరు ప్రజలు ప్రజాస్వామికంగా పరిష్కరించుకోవాలి. కాశ్మీరు సైనిక విభజనను అంతం చేయడానికి భారత పాకీస్తానులు అంగీకరించాలి. భారత లేక పాకీస్తానులో చేరేసమస్యను స్వేచ్ఛగా పరిష్కరించుకునే అవకాశాన్ని సంస్ధాన ప్రజలందరికీ ఇవ్వాలి.
ఈ మౌలిక అంశాలపై , అభిప్రాయాలలో ఐక్యత ఉన్నప్పటికీ , తక్షణమే తొలగించుకోవాల్సిన విభేదాలు ఇంకా ఉన్నాయి. ఈ క్రింది అంశాలపై విభేదాలు తలెత్తాయి.
కాశ్మీరు సమస్యపై సాయుధ ఘర్షణ జరిగితే మనమిచ్చే నినాదం ఎలావుండాలి ?
బెర్లిన్ ప్రకటనకనుగుణంగా , మొదటిగా బలాన్ని ప్రయోగించిన దేశాన్ని దురాక్రమణదారునిగా ప్రకటించాలని పోలిట్ బ్యూరోలోని మెజారిటి కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు : ఈ కామ్రెడ్ల ప్రకారం ఎక్కడైనా ( కాశ్మీరు తో సహా ) ఏదేశమైనా సాగించే దాడిని తిప్పికొట్టే హక్కు భారత్ కు ఉందని మనం ప్రకటించాలి. అయితే ఎట్టి పరిస్తితులలోను పాకీస్తాన్ భూభాగాన్ని భారత్ ఆక్రమించరాదు.
పోలిట్ బ్యూరోలోని ఒక సభ్యుడు , కేంద్ర కమిటీ లోని ఇద్దరు ఇలా అభిప్రాయపడ్డారు : దాడి జరిగితే భారత ఆత్మ రక్షణ అన్న నినాదం భారత్ లోని అభివృధ్ధి నిరోధక శక్తులకు ఉపయోగపడుతుంది ; నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించినట్లవుతుంది. మొదటిగా దాడి ఎవరు చేశారన్నది నిరూపించటం సాధ్యం కాదనీ, కనుక సామ్రాజ్యవాదుల పోటీలో భాగంగా ఇరు ప్రభుత్వవిధానాలనూ ఎండగట్టాలనీ , ఇక్కడకు మనం పరిమితమై ఉండాలనీ ఈ కామ్రెడ్లు గట్టిగా వాదించారు. భారత పాకీస్తాను ప్రభుత్వాలపట్ల వున్న విభిన్న అంచనాల నుండే పార్టీలో ఈ విభేదాలు పుట్టాయి.
ఇరు ప్రభుత్వాలూ సామ్రాజ్యవాదంతో షరీకయ్యేవే అయినప్పటికీ , పాకీస్తాన్ ప్రభత్వం ఎక్కువగా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రభావంలో వుందనీ, భారత పాకీస్తాను ప్రభుత్వాల విధానాలను సమానంగా చేసి చూడడం పొరపాటవుతుందనీ పోలిట్ బ్యూరోలోని మెజీరిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు. కాశ్మీరుకున్న వ్యూహాత్మక భౌగోళిక స్తానాన్ని దృష్టిలో పెట్టుకొని సామ్రాజ్యవాదులు ఐరాస వొప్పందం ద్వారా కాశ్మీరును పాకీస్తాన్లో కలపాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనీ, కాశ్మీరు భారత్ లో చేరేకంటే పాకీస్తాన్ లో చేరితే తమకెక్కువ అదుపు ఉంటుందని వారిలా చేస్తున్నారనీ పోలిట్ బ్యూరోలోని మెజారిటీ కామ్రెడ్లు వాదించారు. ఐరాస చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన వైఖరిని భారత్ పున:పరిశీలించేవిధంగా వత్తిడి చేసేందుకే యుద్ధోన్మాదం రెచ్చగొడుతున్నారని ఈ కామ్రెడ్లు వాదించారు. కాశ్మీరు పై పాకీస్తాను సాగించే దాడిని త్రిప్పికొట్టే హక్కు భారత ప్రభుత్వాని కుందని , పాకీస్తాను భూభాగాన్ని అది ఆక్రమించరాదని ఈ కామ్రెడ్ల వాదన.
అవకాశముంటే వీలైనంత త్వరలో ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని తెలుసుకో గోరుతున్నాము.
కాశ్మీరు సమస్యపైనే తగినంత స్పష్టతా , అభిప్రాయాల్లో ఐక్యతా లేవు. ఈ క్రింది ప్రశ్నలు మాముందున్నాయి.
1. కాశ్మీరు భారత్ లో చేరాలా లేక స్వతంత్ర దేశంగా ఉండాలా?
2. ఐక్య సంస్థానానికి స్వేశ్చగా ఎన్నికైన రాజ్యాంగ సభ సమావేశానికి ప్రాథమిక చర్యగా భారత పాకీస్తాన్లు తమ సాయుధ బలగాలను ఉపసంహరించాలని పార్టీ డిమాండ్ చెయ్యాలా?
3. కాశ్మీరు ప్రజల అభిష్టానికి అనుగుణంగా , శాంతియుతంగా , పరస్పర అంగీకారంతో భారత పాకీస్తాన్లు కాశ్మీరు సమస్యను పరిష్కరించాలని మనం ప్రకటించాలా ? లేక ఐదు పెద్ద దేశాల పర్యవేక్షణలో ప్లబిసైట్ నిర్వహించాలన్న డిమాండును ముందుకు తేవాలా?
కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉండాలని , దాని సార్వభౌమత్వానికి పొరుగు దేశాలైన భారత , పాకీస్తాన్, సోవియట్ యూనియన్ , చైనా, ఆఫ్ఘనిస్తాన్ లు హామీ యివ్వాలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. దీనికి స్వతంత్ర కాశ్మీరు అమెరికా సామ్రాజ్యవాదుల ప్రభావంలో పడుతుందన్న ఆలోచనతో పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభ్యంతరాలు తెలుపుతున్నారు.
కాశ్మీరు నుండి సాయుధబలగాలను భారత పాకీస్థాన్ లు ఉపసంహరించాలన్న డిమాండు ప్రస్తుత సమయంలో తగినది కాదని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ కామ్రెడ్లు అభిప్రాయపడ్డారు.
ఏ రూపంలోనూ ఐరాస మధ్యవర్తిత్వం లేకుండా కాశ్మీరు సమశ్యను భారత పాకీస్తాన్లు పరిష్కరించుకోవాలని పోలిట్ బ్యూరో లోని మెజారిటీ సభ్యుల అభిప్రాయం.
ఇట్లు,
అజయ్ కుమార్ ఘోష్
05-అక్టోబరు- 1951 .