Thursday, October 30, 2008

కోస్టల్ కారిడార్

నిర్వాసితులను మోసపుచ్చే వాదనలు :
వాన్ పిక్ పేరిట రైతాంగం భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం పూనుకుంది. గ్రామసభలు జరిపి ప్రజల ఆమోదం పొందిన తరువాత మాత్రమే ప్రాజక్టుల నిర్మాణం చేపట్టాలన్న రాజ్యాంగ చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘించి , భూములు వదులుకోవడానికి నిరాకరిస్తున్న రైతులపై నిర్భంధాన్ని ప్రయోగించడానికి పూనుకుంటుంది.
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి తులసిరెడ్డి వాన్ పిక్ ను వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులని , ప్రతిపక్షాలు రైతులను,మత్స్యకారులనూ రెచ్చగొడుతున్నాయని ఆరోపించాడు. ప్రభుత్వం 2008 మార్చి నెలలో 'రస్ ఆల్ ఖైమా' అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం మూడు నెలల్లో ఆర్ధికంగా లాభసాటి అవునా కాదా అనే (ఫీజిబిలిటి) రిపోర్టు అందజేయాలి. వాన్ పిక్ కోసం అవసరమైన సాంకేతికత, ఆర్ధిక స్థోమత వున్న ఏ విదేశీ సంస్థనైనా భాగస్వామిగా చేసుకునేందుకు రస్ ఆల్ ఖైమా కు అవకాశం ఇచ్చారు. మాట్రిక్స్ ఎన్ పోర్ట్ అన్న కంపెనీ ఇందులో భారత్ భాగస్వామి. విశాఖలో ప్రైవేటు కంపెనీల బాక్సైటు త్రవ్వకాలు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేయడానికి , ప్రభుత్వరంగ సంస్థే తవ్వుతున్నట్లు చూపి , రస్ ఆల్ ఖైమాకు ఇచ్చారు. బాక్సైట్, అల్యూమినియం రంగంలో రస్ ఆల్ ఖైమా లేదు. దీనిని శిఖండిగా పెట్టుకొని స్టెరిలైట్ కంపెనీ తవ్వకాలను చేపట్టింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలు మన దేశ వనరులను ( విద్యుత్తు,నీరు, ద్రవ్యం, ఖనిజాలు ) ఉపయోగించుకొని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాయి. ప్రదానంగా రసాయన పరిశ్రమలు. దేశీయ వనరులు విదేశీకంపెనీల లాభాలకు వాడబడతాయి. మనకు మిగిలేది ప్రమాదకర కాలుష్యము, జీవనోపాధి మృగ్యమైన జీవనాలు.

పారిశ్రామికీకరణ జరగరాదని ఎవరూ అనరు, ఇది ఎవరికోసం ఏవిధంగా జరగాలన్నది చర్చ. సామ్రాజ్యవాదులు సహాయం పేరిట రుణాలనిచ్చి, పారిశ్రామిక విధానాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ ఋణాల ఉచ్చులో కూరుకుపోయిన భారత పాలకులు ఋణాలను తిరిగి తీర్చాలంటే ఎగుమతులను పెంచి విదేశీమారక ద్రవ్యాన్నఆర్జించాలన్న ప్రపంచ బ్యాంకు సూత్రాలు అమలు జరుపు తున్నారు.దీనినే ఎగుమతి ఆధారిత అభివృద్ధి వ్యూహంగా పిలుస్తున్నారు.
కనుక ఇక్కడ దేశ ప్రజల అవసరాలను తీర్చే పరిశ్రమలు నిర్మించరు . విదేశీ మార్కెట్టులో అమ్ముడయ్యే సరుకుల ఉత్పత్తి కోసమే పరిశ్రమలు పెడతారు. అదీకూడా విదేశీ కంపెనీలే పెడతాయి. ప్రజల అవసరాలు తీర్చకపోయినా , రాయితీల పేరుతో ప్రజాధనాన్ని వారికి ధారపోస్తారు. నూతన ఆర్ధిక విధానాల సారాంశమంతా ఇదే.

Tuesday, October 7, 2008

బీహారు వరద బాధితులను ఆదుకుందాం

కోసీ నది ఉగ్ర రూపానికి ఉత్తర బీహార్ ప్రాంతం అతలాకుతలమైంది. హిమాలయాలనుండి ప్రవహించే గంగానది పరీవాహక నదులలో 3 ముఖ్యనదులైన కోసి, గండకి, భాగమతి నదులు మహా ప్రవాహ శక్తితో ప్రవహిస్తుంటాయి. వీటిలో కోసీ నది ఈశాన్య బీహారు ప్రాంత దుఃఖదాయని అన్నపేరు తెచ్చుకుంది. 1950ల ప్రాంతంలో నేపాల్ నుండి భారత్ లోకి ప్రవహించే కోసీ నదికి ఆనకట్టనూ, కరకట్టలను నిర్మించారు. ఆనాడు ప్రజలు “ సగం రొట్టెనైనా తింటాం కానీ కోసీ నది కరకట్టలను కట్టితీరుతాం “ అని నినాదం ఇస్తూ కరకట్టలను నిర్మించుకున్నారు. అయితే కోసీ ప్రాజక్టు కరకట్టలను పరిరక్షించి మారుతున్న ప్రవాహస్థితులను బట్టి కరకట్టలను అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యతవున్న బీహారు రాష్ట్రప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించిన ఫలితంగా ఈ సంవత్సరం ఆగష్టు 18 న కోసీ నది కరకట్టలపై గండిపడి మహోగ్ర రూపంతో బీహారు రాష్ట్రంపై విరుచుకు పడింది. ఈ పడిన గండి వెడల్పే రెండు కిలోమీటర్లు ఉంటుంది.
ఉధృతమైన కోసీ నది తాకిడికి ఉత్తర బీహారు జిల్లాలైన సుపాల్, మాధేవురా, అరారియా, సహర్ద జిల్లాలు తీవ్రంగానూ, ముజఫర్ పూర్, కథియార్, సీతామతి, భతల్ పూర్ తదితర మొత్తం 16 జిల్లాలు అతలాకుతలమైనాయి. మొత్తం 30 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులై కొంప, గోడు, చేనూ, చెలక వదిలిపెట్టి ప్రభుత్వ స్కూళ్ళూ, దేవాలయాల్లో తలదాచుకుంటున్నారు. వందలమంది వరదల ఉధృతికి మరణిచారు. ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయక సిబిరాలకు చేరినవారు త్రాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకక, పారిశుధ్య సమశ్యలతో అల్లాడుతున్నారు. కోసి నది కరకట్టకు పడ్డ ఈ గండిని పూడ్చడానికి నాలుగు నెలల నుండి ఆరు నెలల సమయం పడుతుందని నది ఉధృతిని గమనిస్తూన్న నిపుణులు వివరిస్తున్నారు. కనీసం పది లక్షలమంది అంతకాలం వరకు పునరావాస కేంద్రాలలోనే తలదాచుకోవలసి వస్తుందని పరిస్తితులు తెలియజేస్తున్నాయి.
భారతదేశంలో ఇప్పటిదాకా జరిగిన వైపరీత్యాలలో కనిపించిన వాస్తవమే మరోసారి ఇక్కడా కన్పిస్తుంది. అదేమంటే సాటిప్రజలు , మానవతావాదులు, ప్రజాతంత్రవాదులు స్పందించి, బాధితులను అక్కున చేర్చుకొని అందించిన సహాయమే బాధితులను నిలబెట్టిందికానీ ప్రభుత్వాలు విదిలించే నిర్లక్ష్యపూరిత అరకొర సహాయం కాదన్న వాస్తవం మరోసారి ఇక్కడ ధృవపడుతుంది.
బీహారు వరదబాదితుల సహాయార్ధం ‘ బీహారు వరద బాధితుల సహాయ కమిటీ ‘ ఏర్పడింది. ఈ కమిటీకి మందులు, బట్టలు, ఆహారం తదితర రూపాలలో సహాయం అందించవలసినదిగా యావత్తు ప్రజలకూ, మానవతావాదులకూ , సంస్ధలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
పాట్నా కేంద్ర వివరము:
Dr.ARAVIND SINHA,
Barh Parnagrik Pahal,
East & West Educational Society,
Arogya Mandir Complex,
Nala Road,
PATNA-800 004,
Ph: 09430060092.

ఆంధ్రప్రదేశ్ లో పాదార్ధిక, ఆర్ధిక సహాయం కోసం ఏర్పడిన కేంద్రం చిరునామా:
ఎస్. ఝాన్సీ,
ఆంద్రాబ్యాంకు బిల్డింగ్,
కృష్ణలంక,
విజయవాడ- 500 013.
సెల్ : 94403 19977