Thursday, November 26, 2009

నేపాల్ పరిస్తితుల గురించి కామ్రెడ్. ప్రచండ వివరణ

నేపాల్ లో నూతన రాజ్యాంగ నిర్ణాయ సభ ద్వారా , నూతన రాజ్యాంగాన్ని ఏర్పరచడం 12 అంశాల ఒప్పందపు లక్ష్యం. ఆ సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం ప్రధానాంశం. దీన్ని సాధించాము. రాజ్యాంగ నిర్ణాయ సభకు ఎన్నికలు జరిగాయి. సి.పి.యన్. (మావోయిస్టు) పెద్ద పార్టీగా వచ్చింది. మావోయిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే శాంతి ప్రక్రియని ముందుకు తీసుకుపోతూ , రాజ్యాంగాన్ని రచించే క్రమం సాగుతుండగా , ఆధిపత్యం ప్రజలదా లేదా సైన్యానిదా అన్న చర్చ తలయెత్తింది. ప్రభుత్వం తరఫున నేను జారీ చేసిన ఆజ్ఞలన్నిటినీ సైన్యాధిపతి ధిక్కరించాడు. కనుక సైన్యాధిపతిని తొలగించే నిర్ణయం తీసుకున్నాను. నేపాలీ కాంగ్రెస్, యు.ఎం.ఎల్ సైన్యాన్ని సమర్ధించాయి. దానితో పరిస్తితి మరింత క్లిష్టమైంది. భారత్ ను ఇంగ్లీషు వాళ్ళు పాలిస్తున్నప్పటినుండి నేపాల్ రాజకీయాలు భారత్ కేంద్రంగా సాగుతున్నాయి. బ్రిటన్ కు నేపాల్కు యుద్దం జరిగి 1815 లో సుగొలి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం తర్వాత నేపాల్ అర్ధవలస దేశం అయ్యింది. రాణాల వంశపాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం సాగినప్పుడు , త్రిభువన్ భారత్ లో తలదాచుకున్నాడు. భారత్ సహాయంతో ఢిల్లీ ఒప్పందం పేరిట రాణాలపాలన అంతంచేసి త్రిభువన్ రాజవడంతో షాల వంశపాలన మొదలైంది. నేపాలీ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు బి.పి.కొయిరాలా కొంత స్వేచ్ఛ గురించి మాట్లాడగానే అతడు తొలగించబడ్డాడు. దీనిలో రాజును భారత్ ప్రోత్సహించింది. నిరంకుశ పంచాయితీ వ్యవస్థ నేపాల్ లో మనగలగటానికి భారతమద్దతే కారణం. సి.పి.యన్. పోరాటంతో నేపాల్ ఆర్ధిక, సాంఘీక, రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది. మా పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడంతోనే సమస్య ముందుకొచ్చింది. నేపాల్ భారత్ ల మధ్య ఉన్న ఆర్ధిక, రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రిక సంబంధాలను పునర్నిర్వచించుకోవాలి. దురదృష్టవశాత్తు ఇది జరగలేదు. భారత్ ఆదేశాలను నేపాల్ అమలు చేయాలన్న భావాలు ఢిల్లీలో ఉన్నాయి.
పార్టీ యు.ఎం.ఎల్. దారిలోనే నడుస్తుందా.. లేక పార్లమెంటరీపంధాలో కూరుకుపోతుందా.. అనే అనుమానాలు చాలా మంది కామ్రెడ్సుకు కలిగాయి. సోషలిజం ,కమ్యూనిజాలను ఆదర్శంగా నిలుపుకొని ప్రజావిప్లవపంధాలో సాగుతున్నామని నేను వారికి వివరించాను. నా రాజీనామా తర్వాత ఎలాంటి పెడధోరణి లేదన్న విశ్వాసం కామ్రెడ్స్ కు కలిగింది. విదేశీశక్తుల ఆజ్ఞలకు లొంగిపోకుండా అభివృద్ధి నిరోధక శక్తులపై పోరాటం సాగించడానికి నేను రాజీనామా చేశాను. నా రాజీనామా తర్వాత పార్టీ ఐక్యత పెరగడమేకాకుండా ప్రజల్లో కూడ పార్టీ ప్రతిష్ఠ పెరిగింది. మనల్ని మధ్యతరగతి ప్రజలుకూడ విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రజావిముక్తి సైన్యం ప్రస్తుతం సైన్యశిబిరంలోనే ఉంది. ఆయుధాలు దానివద్దనే ఉన్నాయి. ఆయుధాగారపు తాళాలు దానివద్దనే ఉన్నాయి. కనుక అవి లొంగిపోలేదు. నిజానికి మేం బలపడ్డాం. మా స్థావర ప్రాంతాలు నిలిచేవున్నాయి. పార్టీ నిర్మాణం బలపడ్డది. వాస్తవానికి దేశమంతా మా స్థావర ప్రాంతమైంది. నేపాల్ ప్రజలు విజయం పొందుతారు.