Saturday, October 31, 2009

నోబెల్ యుద్ధ పురస్కారం

2009 సంవత్సరానికి నోబెల్ శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామాకు ఇస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో ఏ రంగంలోనూ పరిగణింపదగిన విజయాలేవీ లేకపోగా – పురస్కారానికి ఎంపిక గడువు తేదీకి పదకొండు రోజులుండగా మాత్రమే అధ్యక్షుడైన వ్యక్తిని , అధ్యక్షుడు కాకముందు అతనెవరోకూడా మెజారిటీ అమెరికా ప్రజలకే తెలియని వ్యక్తిని, పాకీస్తాను గ్రామాలపై బాంబులు వేసి, పౌరుల హత్యను “ అనుబంధ నష్టం “ గా కొట్టివేసిన వ్యక్తిని, ఈ పురస్కారానికి ఎంపిక చేయటం నోబుల్ శాంతి పురస్కారాలు సంకుచిత రాజకీయాలతో కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది.
పురస్కారాన్ని ప్రకటిస్తూ నోబుల్ కమిటీ “ అణ్వాయుధాలు లేని స్వచ్చా ప్రపంచమన్న ఒబామా దార్శినికత ”ను ప్రశంసించింది. అయితే ఈ ప్రకటన ఎంత వైవిద్యపూరితమంటే, ఒబామా అధ్యక్షుడైన తరునాత నిరాయుధీకరణపై రష్యాతో జరిపిన చర్చలు నిరాయుధీకరణం జరిగిన తర్వాత 1500 ఆణ్వాయుధాలు కలిగి ఉంటానని అమెరికా మంకు పట్టు పట్టినందువల్ల విఫలం అయ్యాయి.
పురస్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ శ్వేత సౌధంలోని గులాబి తోటలో విలేఖరుల సమావేశంలో ఒబామా " ఆశ్ఛర్య చకితుడిని మరింత వినమృడిని అయ్యానంటూ" అణ్వాయుధాలు లేని ప్రపంచమన్న తన లక్ష్యం తన జీవితకాలంలో నెరవేరదని అన్నాడు.

బాలగోపాల్ మృతికి సంతాపం

మానవ హక్కుల వేదిక నాయకుడు కె.బాలగోపాల్ హఠాన్మరణం దిగ్బ్రాంతిని కలిగించింది. ప్రస్తుత దోపిడీ సమాజంలో మార్పునాశించి రాజకీయాలు చేపట్టిన బాలగోపాల్ హక్కుల రంగాన్ని కార్యరంగంగా ఎంచుకొని పనిచేశారు. ప్రధానంగా బూటకపు ఎన్కౌంటరు హత్యలు , రాజ్యహింసలకు వ్యతిరేకంగా పనిచేశారు. కె. బాలగోపాల్ మృతికి “ జనశక్తి ” సంతాపాన్ని తెలుపుతున్నది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నది.