Wednesday, July 11, 2007

ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగుల మెరుపు సమ్మె

ఇండియన్ విమాన సంస్థ పేరిట ప్రభుత్వరంగ విమాన సంస్థగా వున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన 12,700 మంది ఉద్యోగులు జూన్ 13వ తేదీన హఠాత్తుగా మెరుపు సమ్మెకు దిగారు.
1997 నుండి తమకు చెల్లించకుండా బకాయిపడ్డ ఎరియర్స చెల్లింవుకోసం, వేతన సవరణలకోసం, ఎయిర్ ఇండియా విమానసంస్థ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రమోషన్లు యివ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్ లైన్సు సంస్థలు రెండింటిని విలీనం చేసే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించడం వలన తమ ప్రమోషన్ అవకాశాలు పోతాయని ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగులు సమ్మె చేశారు.
ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం తీవ్రంగా స్పందిచింది. సమ్మె నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి 27 మందిని సస్పెండు చేసింది. గతంలో ఇచ్చిన హామీల గురించి పునరాలోచించాలని ప్రకటించింది. లాకవుట్ చేయడానికి ప్రయత్నించింది. వివిధ కోర్టులనుండి సమ్మె చెయ్యకుండా ఉత్తర్వులు ఇప్పించడానికి ప్రయత్నించింది.
అయినా ఉద్యోగులు ఆ బెదిరింపులకు లొంగక తమ సమ్మెను కొనసాగించారు.
3 రోజుల తర్వాత ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో చర్చించి సమ్మె ఉపసంహరణకు ఒప్పించుకుంది. ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఇవ్వవలసిన పాత బకాయి 267 కోట్లు 2008 లోపు చెల్లించుటకు ఒప్పుకుంది. ప్రమోషను విషయంలో 9వ గ్రేడు ఉద్యోగులకు 6 సం. సర్వీసు వుంటే 12వ గ్రేడు కూ, 3 సం. సర్వీసు వుంటే 9 ఎ గ్రేడుకు ఉద్యోగులు ఎటువంటి పరీక్ష రాయకపోయినా ఇవ్వడానికి అంగీకరించింది. సస్పెండ్ చేసిన 27 మందిని తిరిగి పనిలోకితీసుకోవడానికి అంగీకరించింది.
సమ్మెకు నాయకత్వం వహించిన ఎయిర్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధసంస్థ కావడంవల్ల CPM నాయకులు కారత్ , ఏచూరి లు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి సమ్మె పరిష్కారానికి కృషి చేశారని పత్రికలు తెలియ జేస్తున్నాయి.
అయితే కార్మికులకు గత 10 సంవత్సరాలుగా రావలసిల బకాయిలు మొత్తం ఇప్పించలేకపోవడం వారి బలహీనత.

Sunday, June 10, 2007

నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?

మక్కామసీదుపై బాంబుదాడి నీచమైన చర్య

మక్కామసీదుపై శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో బాంబు పేలింది. మరొక బాంబు పేలకుండా ఉండిపోయింది. బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. మసీదులో ప్రార్ధనాసమయంలో పేలేలా బాంబును పెట్టటం నీచమైన చర్య . ప్రజలపట్లా, ప్రజాజీవితం పట్లా ఏమాత్రం బాధ్యత ఉన్నవారైతే ఇలాంటి నీచ చర్యలకు పాల్పడరు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది టెర్రరిష్టుల పనే అయితే అది ముస్లిములకు తీవ్ర క్షోభను కలిగించే చర్య అవటమేకాక ముస్లిములను రెండవశ్రేణి పౌరులుగా చిత్రిస్తున్న హిందూ మతోన్మాదశక్తులకూ, వారిని అనేక వేధింపులకూ బుజ్జగింపులకూ లోను చేస్తున్న దోపిడీ పాలకవర్గ శక్తులకూ తోడ్పడేదిగా వుంటుంది. ప్రజల ప్రాణాలకు హానికలిగించే ఈ పిరికి చర్యను జనశక్తి తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ నీచ చర్యకు పాల్పడినవారు ఆశించినది నెరవేరలేదనే చెప్పాలి. ఇది ఎలాంటి కలహాలకూ దారితీయలేదు. గతంలో గుంటూరులో మసీదు వద్ద బాంబు పేలినప్పుడుకూడా ఎలాంటి కలహాలకూ దారితీయలేదు.యువకులు కొంత ఆవేశం చెందినప్పటికీ పెద్దలు సర్దిచెప్పటంతో వెంటనే తగ్గారు. కాని ఇప్పుడు నిగ్రహం పాటించడంలో ప్రభుత్వ యంత్రాంగమే విఫలమైందని చెప్పవచ్చు. బాంబు ప్రేలుడుకంటే ఎక్కువమంది అమాయకులు కాల్పులలో మరణించడం, గాయపడటమే దీనికి తార్కాణం. అదే సమయంలో ఎం.ఆర్.పి.ఎస్. కార్యకర్తలపట్ల నిగ్రహం చూపిన ప్రభుత్వం ఆవేశపడిన ముస్లిం యువకుల పట్ల ఎందుకు నిగ్రహం చూపలేదన్నదే సమాధానం రాని ప్రశ్న.
24 గంటల్లో దోషులను పట్టుకుంటామన్న ప్రభుత్వం కోర్టులో నిరూపించగల సాక్షాలేమీ చూపకుండానే , నిఘావర్గాల కథనమంటూ ముస్లిం టెర్రరిష్టులు , ఐ ఎస్ ఐ ఏజంట్లు షాహెద్ దీనికి కారణమంటూ ప్రచారం చేస్తున్నది. టెర్రరిష్టులకు హైదరాబాదు అడ్డాగా మారినట్లు , ముస్లిం యువకులందరూ ఐ.ఎస్. ఐ. ఏజంట్లుగా మారినట్లు కథనాలు ప్రచారంలో పెడుతున్నది. పాకిస్తాన్ గూఢచారి సంస్ధకు బంగ్లాదేశ్ శిక్షణా స్తావరం ఎలా అయ్యిందో వివరించదు. అదే నిజమైతే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నిరసన తెలిపి . దౌత్యపర చర్యలెందుకు తీసుకోరో తెలియదు.
ఈ చర్య ఎవరు చేసినా , దాని పర్యావసానంగా ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని , మానసిక స్ధితిని వినియోగించుకోవటానికే పాలకులు పూనుకున్నారన్నది నిర్వివాదాంశం. ఆకుకు అందని పోకకు పొందని రకపు ప్రచారంతో ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచడం ద్వారా వారిని వంటరి చేయటం, ఇతర ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచటం ను దోపిడీ పాలకవర్గాలు కోరుకొంటున్నాయి. ఇన్నాళ్ళూ అదే చేస్తూ వస్తున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలను ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నాయి.మక్కామసీదు ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి దీనినే తెలుపుతుంది. ఈ దృక్కోణం నుంచే ఈ రకపు చర్యలు దోపిడీ వర్గాలకే తోడ్పడతాయని చెప్పాము.
ఇంతే కాదు. ఇలాంటి ఘటనలను అటు ముస్లింలలోనూ , ఇటు హిందువులూ, క్రైస్తవులూ ఇతర మతస్తులలోనూ ప్రజాస్వామిక శక్తుల గొంతు నొక్కడానికే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను విమర్శిస్తే టెర్రరిష్టులకు మద్దతిస్తున్నారంటూనూ, టెర్రరిష్టు చర్యలను విమర్శిస్తే మతోన్మాదులకు వత్తాసు అంటూనూ ప్రజాతంత్ర శక్తులను నిరంతరం వత్తిడికి లోను చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపునో , మతోన్మాదంవైపునో తప్ప మరో పక్షంవైపు, ప్రజాస్వామిక విలువలూ, ఆచరణవైపు పోరాదన్న నిరంకుశ అణచివేత దీనిలో ఇమిడివుంది.

Wednesday, April 25, 2007

కోతి గుండెకాయ

నానాటికీ విపరీతమౌతున్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొద్దిరోజులలో సాధారణ స్థాయికి వస్తాయని కొన్ని నెలల క్రితం ఆర్ధిక మంత్రి హామీ యిచ్చారు. కానీ ధరల పెరుగుదల అదుపులోకి రాలేదు. దీనితో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అయితే ఆచర్యలేమిటో చెప్పలేదు. ద్రవ్యోల్బణానికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికా డాలర్లను రిజర్వుబ్యాంకు కొనటం, రెండవది నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యం అనుమతించటం.
భారత దేశపు విదేశీ మారక నిల్వలను పెంచేందుకు దేశంలో డాలర్లను పెట్టుబడిగా తెస్తున్న వారి నుండి రిజర్వు బ్యాంకు డాలర్లను కొని వారికి రూపాయలు ఇస్తున్నది. ఇలా కొన్న డాలర్లను దేశంలో అమ్మితే దిగుమతులు చేసుకొనేవారు రూపాయలను ఇచ్చి డాలర్లను కొనుక్కుంటారు. అయితే విదేశీ మారక నిల్వలను పెంచాలి గనుక రిజర్వు బ్యాంకు డాలర్లను అమ్మటంలేదు. డాలర్లు కొనడానికి రూపాయలను ముద్రిస్తుంది. దీనితో దేశంలో సంపదల ఉత్పత్తి పెరగకుండానే రూపాయల చలామణీ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుంది. ఇదే ద్రవ్యోల్బణం. ఇది ధరల పెరుగుదలగా కనిపిస్తుంది.
ఈ ప్రాధమిక సూత్రం భారత ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ అమలు చేసేందుకు వారు సిద్ధంగా లేరు. దేశంలో ఉన్న డాలర్లను అమ్మితే చలామణిలో ఉన్న డాలర్లు పెరిగి డాలరు విలువ తగ్గుతుంది. అంటే డాలరు విలువ 44 రూపాయలనుండి 40 రూపాయలకు తగ్గుతుంది. విదేశాలకు సరుకులు ఎగుమతి చేసిన వ్యాపారులకు తక్కువ రూపాయలు వస్తాయి. వారికి లాభాలు తగ్గుతాయి. అందుకే ఇటీవల రూపాయి మారకపు విలువ కొద్దిగా పెరగ్గానే రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకోవాలంటూ వారు గగ్గోలు పెట్టారు. కనుక ఆ వ్యాపారుల లాభాల కోసం రిజర్వు బ్యాంకు రూపాయలు ముద్రిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చలామణిలోవున్న రూపాయలను తగ్గించటానికి ఇతర మార్గాలను రిజర్వు బ్యాంకు వెతికింది. దానికి వున్న మార్గం ఒక్కటే కాష్ రిజర్వు నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచింది. దీనివల్ల బ్యాంకులు తాము ఇచ్చే రుణాలను తగ్గిస్తాయి . దీని ద్వారా 15500 కోట్ల రూపాయలను చలామణి నుంచి వెలుపలకు తీయబూనుకుంది.దీనితో ష్టాక్ మార్కెట్టులోని షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే రిజర్వు బ్యాంకు ఈ విధానం కొంత కాలం సాగితే డిమాండు తగ్గి ధరలు తగ్గుతాయని అంటుంది. తన చర్యల ద్వారా రూపాయల చలామణీ తగ్గించిన రిజర్వు బాంకు కూలిన షేరు మార్కెట్టును నిలబెట్టేందుకు తీసుకున్న చర్యలకు ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా తెలియదు. ఏతావాతా ఆశించిన మేరకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.
టోకుధరల సూచి మార్చి నాటికి 6.5 శాతం కాగా చిల్లర ధరల సూచి 8 - 10 శాతం మథ్య పెరుగుతూ వస్తుంది. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణను వదిలేశారు. వీటి రవాణాపై ఆంక్షలు ఎత్తివేశారు. మార్కేట్టు యార్డులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తున్నారు. రైతుల సంక్షేమం పేరిట తీసుకుంటున్న శీతల గిడ్డంగులు, అడ్వాన్సులు , రుణాలు, మొదలగు అవకాశాలన్నీ దోపిడీ వర్గాలకే అందజేస్తున్నారు. వీటికి పరాకాష్టగా నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యాన్ని అనుమతించారు.ఈ చర్యల ఫలితంగా నిత్యావసర సరుకులన్నీ చట్టా వ్యాపారుల పరమయ్యాయి. నిల్వలు పెంచివేసి కృత్రిమంగా ధరలు పెంచివేస్తున్నారు. భవిష్య వాణిజ్యం వల్ల రేట్లు పెరిగి బడా వాణిజ్య వర్గాలు లాభ పడుతున్నాయే తప్ప రైతులకూ ,వినియోగదారులకూ వొరిగిందేమీ లేదు. ప్రదర్శనాత్మకంగా గోదాములపై దాడులు నిర్వహించటం వంటి చర్యల ద్వారా మధ్య తరహా వ్యాపారులను వేధించి - వారిని రంగం నుండి తప్పించే పనులు బడా వర్గాలకు తోడ్పడుతుందితప్ప సామాన్యుడి భారాన్ని తగ్గించదు.
నిత్యావసర వస్తువులు ప్రధానంగా వ్యవసాయ రంగం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి రేట్లు పెరిగితే వినియోగదారుదైన సామాన్యుడు నష్టపోతాడు; రేట్లు తగ్గితే ఉత్పత్తిదారుదైన రైతు నష్టపోతాడు. కనుక డిమాండు సప్లైల సమతుల్యత దెబ్బతినకుండా చూడడానికని చెప్పి ప్రభుత్వం తన నిష్క్రియతను సమర్ధించుకుంటున్నది.ప్రభుత్వం ఆర్ధిక సూత్రాలు వల్లెవేసి వాస్తవాన్ని దాచిపెట్ట జూస్తున్నది. కర్నూలులో టమోటాలకు అర్ధ రూపాయి కూడా రాక రైతులు అల్లాడుతున్నారు; కాగా విశాఖలో కేజీ 12 రూపాయలకు అమ్ముతున్నారు.ధాన్యం ,నూనె గింజలు, కూరగాయలు వంటి రైతు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.కాగా ధాన్యం ,పప్పులు, వంటనూనెలు,కూరగాయల రేట్లు మార్కెట్లో చుక్కలంటు తున్నాయి. ధరల పెరుగుదలకు సంస్కరణలనే ఆర్ధిక విధానాలే కారణం. రైతుల ,వినియోగదారుల సంక్షేమం గురించి ప్రభుత్వ వాదనలన్నీ మొసలి కన్నీరేనని పై వాస్తవాలు తెలియజేస్తున్నాయి . భార్య కోసం కోతి గుండెకాయను కొరిన మొసలిలాగే దోపిడీ వర్గాలకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం సామాన్యుని సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఇలాంటి ప్రభుత్వం నుండి ప్రజలకు ధరల తగ్గింపు వంటి ఉపశమన చర్యకూడా అందదనీ, ఈ దోపిడీ విధానాలను మార్చివేయగల ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప ఈ సమస్యల వలనుండి బయటపడలేము. అందుకోసం సంఘటిత పోరాటాలు సాగిద్దాం రండి.

Tuesday, April 24, 2007

దళితులకు పంగనామాలు పెట్టబూనుకొంటున్న దళిత గోవింద

కర్నూలు జిల్లా ఫాపిలిలో గణేశ నిమజ్జనం సందర్భంగా అగ్రవర్ణాలవారు దళిత యువకులను హత్య చేయూటం , ఖైర్లాంజీ (మహారాష్ట్ర)లో దళిత కుటుంబంపై అగ్రవర్ణాలవారు దాడిచేసి ముగ్గురు కుటుంబ సభ్యులను నానా చిత్ర హింసలు పెట్టి, వారిలో ఇద్దరు స్త్రీలను పాశవికంగా లైంగిక హింసకు - బలాత్కారానికి గురిచేసి ఆనక వారిని హత్యచేయడం, తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగానే గ్రామ సర్పంచులుగా ఎన్నికైన దళితులను ప్రమాణ స్వీకారం చేయకుండానే హతమార్చటం, కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బసవనజాగెవాది సమీపం లోని కడా కోల కుగ్రామంలోని చలువాది కులానికి చెందిన దళితులను చెరువులో నీరు వాదుకుంటున్నారన్న కారణంగా అగ్రవర్ణాలు వెలివేయడం, హర్యానా లోని కర్నాల్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో గ్రామ పంచాయితీ అనుమతి పొందిన దళితులు తమ స్వంత రవిదాస్ ఆలయాన్ని నిర్మించుకోబోగా , బ్రాహ్మలు దాన్ని అడ్డుకొని, విద్వంసం చేసి, రవిదాస్ విగ్రహాన్ని విరగ్గొట్టటమేకాక, దళితులను వెలివేయడం అన్నవి నిన్నటి వార్తలు కాగా ;
ఆంధ్ర ప్రదేశ్ వికారాబాద్ జిల్లాలోని ద్యాచారం గ్రామంలో, అనారోగ్యంపాలై రెండు రోజులు పనికి వెళ్ళలేనందుకు ఆగ్రహించిన బలిజ దొరలు దళిత పాలేరుల్ని చంపటం (21-12-06), దళిత మహిళల మరుగు దొడ్డి ఎదుట గల ప్రభుత్వ పోరంబోకులొ అగ్ర వర్ణాలవారు ఇల్లు కట్టుకోవడానికి అభ్యంతరం చెప్పి, కోర్టు ఇంజక్షను తెచ్చుకొన్న దళితుడు మచ్చుమర్రి.ధైన్యుడిని, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం లొని, బాచేపల్లి గ్రామంలో అగ్ర వర్ణాలకు చెందినవారు జీపుతో తొక్కించి హత్యచేయడం (25-12-06), బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తినటానికి తిండిలేక రైలుపట్టాల వెంబడి పెరిగిన ఆకులూ అలములూ తెచ్చుకుంటూ అదేసందర్భంలో ఒక అగ్రకులానికి చెందినవారింట్లో బచ్చలి కూర తుంచుకొని ఇంటికిపోయి ఇంటిల్లిపాదికీ ఆపూటఆహారం సమకూర్చే ప్రయత్నంలో ఉన్న పదేళ్ళ దళిత బాలిక ఖుష్బూను, అగ్ర వర్ణానికి చెందిన యజమాని పట్టుకొని కుడిచేతి ఐదు వేళ్ళనూ దారుణంగా నరికివేయడం (26-12-06), షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక మహిళ వంట వండిందనే కారణం చేత, మంచీర్యాల సమీపం లోని భీమిలి మండలం లోని క్రొత్తపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలోని బి.సి. విద్యార్ధులే 10 రోజులపాటు అన్నం ముట్టుకోకుండా వుండటం (2-1-2007), మెదక్ జిల్లా గజ్వేల్ తాలూకా లోని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో, మధ్యాహ్న భోజన పథకంలో దళిత స్త్రీలు వంట వండిన కారణంగా, ప్రాధమిక పాఠశాలలోని దళితేతరులు ఆభోజనాన్ని ముట్టకపోవడం (6-2-2007), మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చెర్ల మండలం ఆలోని పల్లెలో పీర్ల పండుగ సందర్భంగా డప్పుకొడుతున్న మాదిగల్లోని వకరికీ, గొల్ల ఎల్లయ్య అనే వ్యక్తికీ చిన్న వివాడం వచ్చి, అందుకు నిరసనగా డప్పులు చాలించి ఇంటికి వెళ్ళిన మాదిగలపై, అవమానంగా భావించిన పెత్తందార్లు దళిత వాడపై దాడి చేసి స్త్రీలతో సహా తీవ్రంగా కొట్టటం , దాడికి భయపడిన దళితులు వాడ వదిలిపెట్టి పారిపోవటం (30-1-2007), హర్యానాలోని కర్నాల్ జిల్లాలోగల సాల్వాన్ గ్రామంలో పోలీసుల సమక్షంలోనే రాజపుత్ యువకులు దళితవాడ పై దాడిచేసి నిప్పంటించి 24 ఇళ్ళను బూడిదపాలు చెయ్యటం (1-3-2007), ప్రకాశం జిల్లా గుడ్లూరు మందలంలోని అడివిరాజుపల్లె గ్రామంలో అరుగుపై కూర్చున్నారనే కారణంతో పెత్తందార్లు దళిత దంపతులను బండబూతులు తిట్టి, కొట్టటం (9-4-2007), మహారాష్ట్ర భంధరా జిల్లాలో వంచగాన్ గ్రామములో అప్పు ఇవ్వటానికి నిరాకరించిందని, ఇందూబాయి అనే దళిత మహిళను మరో కులానికి చెందిన వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడటం (10-4-2007), కర్ణాటకలోని మాండ్ల జిల్లాలోని కె.షేట్టహల్లి గ్రామంలో లోకపావని నదిలో ఒక దళిత యువకుడు ఈత కొట్టాడన్న కారణంచేత ఆగ్రహించిన అగ్రవర్ణస్తులైన వొక్కలిగ కులస్థులు దళితులపై దాడి చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడానికి దళిత వాడకు వొచ్చిన పోలీసులు సహితం దళితులపైనే హింసకు పాల్పడటం (13-4-07) అన్నవి నేటి వార్తలు. అమానవీయమైన ఈ అంటరానితనాన్ని సమాజం నుండి రూపు మాపాలని సంఘాన్ని సంస్కరించాలని అనాది కాలం నుండి ఎందరో సంఘసంస్క్ర్తలు కృషిసల్పుతూనేవున్నారు. ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుల కాలం నుండి , చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆలయ ప్రవేశం చేయించిన బ్రహ్మనాయుదు నుండి, గాంధీ,రఘుపతి వెంకట రత్నం నాయుడు, గోరా లాంటి ఎందరో కృషి చేశారు. కానీ అరికట్టలేక పోయారు. ప్రపంచీకరణ సాగుతున్న ఈ అధునాతన 21వ శతాబ్దంలో సైతం ,మానవ విజ్ఞానం ఎంత సాంకేతికంగా పెంపొందినా , హైందవ ధర్మానికి మూలస్థంభంగావున్న ఈ కులాచార మూఢత్వం తగ్గకపోగా పలు రూపాల్లో వెర్రితలలు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొరటుగా సూటిగా దర్శనమిచ్చే ఈ అంటరానితనపు కుల జాడ్యం పట్టణాల్లో , నగరాల్లో సున్నితమైన పరోక్షరూపాల్లో కొనసాగుతుంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్దదైన, ఇబ్బడి ముబ్బడి ఆదాయ వనరులుగల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కరుణాకరరెడ్డి నేతృత్వంలో 'దళిత గోవిందం' అనే 'హిందూ సమాజ సంస్కరణోద్యమం' అనే ఒక తతంగం ప్రారంభమైంది.ఇది తనసారధ్యంలో నిర్వహించ బడుతున్న 'హైందవ ధర్మ పరిరక్షణ ఉద్యమమని ' తామొక చారిత్రక అవసర కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని, హిందూ మతంలో కొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా,ఆధ్యాత్మిక రంగంలో కులతత్వాన్ని పెకలించడానికి తాము ఈ దళిత గోవిందాన్ని చేపట్టామని కరుణాకరరెడ్డి చెప్పుకుంటున్నాడు. అంటేకాక దళితులను ఆర్ధికంగా ఆదుకొనుటకు వందకోట్ల రూపాయలను వెచ్చించి దళితులపిల్లలకు కాన్శెప్టు స్కూళ్ళూ, 10 కోట్ల రూపాయలతో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. నిరంతర అవమానాలను అనుభవిస్తూ ,అత్యాచారాలకు గురౌతూ వాటిని భరించలేక తమను సాటిమనిషిగా కూడా చూడలేని 'హైందవ ధర్మ వ్యవస్థను ' ఈసడించుకుంటున్న దళితులు కొందరు అన్యమతాల్లోకి మారుతున్నారు. తమను అక్కున చేర్చుకుంటున్న ఇతర మతాల్లోకి మారుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలివేసిన విద్య, వైద్యం మొదలగునవి ఉచితంగా అందించే క్రైస్తవ మతంలోకి ఎక్కువగా చేరుతున్నారు. ఈ పరిణామం హిందూ మతనాయకత్వానికి పెద్ద నష్టంగా పరిణమించింది. ఈ ప్రమాదాన్ని గమనించి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారికి వైద్యం విద్య సౌకర్యాలు కల్పించి దళితులను అన్య మతాల్లోకి పోకుండానిలిపే ప్రయత్నాలు చేస్తూ, ఇతరులు కూడా అలాచేయాలని సూచించాడు. నేడు పేదలైనా , దళితులు ఎక్కువమంది ఉండతంవల్ల ,వారు హిందువులుగా వుంటే , వారినుండి మతసంస్థలకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగావుంతుందని అనగా హైందవధర్మ పరిరక్షణా, ఆదాయవనరుల పరిరక్షణా , ఒక్క దెబ్బకు రెందుపిట్టలు కొట్టాలనే ఎత్తుగడతో కరుణాకరరెడ్డి ఈ దళిత గోవిందాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తలకెత్తాడు.
దళిత గొవిందం పేరిట ,వేమూరు(గతంలో ఈ గ్రామం లోని రామాలయం లోకి దళితుల ప్రవేశాన్ని అగ్రవణస్తులు అడ్డుకొని,నిషేధించారు.)గ్రామంలోని దళిత వాడలోకి శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తీసుకు వెళ్ళి , అర్చకులతోసహా దళితవాడలోనే సహపంక్తి భోజనం చేసి , దళితవాడలోనే ఆ రాత్రికి విశ్రమించి, శ్రీనివాస కళ్యాణ తతంగాన్ని దళితవాడలోనే జరిపించటంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంతటి అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాల్లోని ఆచరణలోని లోపాలు ఈ దళిత గోవిందం అసలు స్వభావాన్ని దాచిపెట్టలేకపోతున్నాయి.
వేమూరు గ్రామంలో అగ్రవర్ణాలు వారు నివసించే వీధులను ఘనంగా అలంకరించుకున్నారు. దళితవాడలను కనీసంగా కూడా అలంకరించలేదు.వారు వేసుకున్న ముగ్గులతో సరిపెట్టారు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో అగ్రవర్ణాలవారి ప్రతి ఇంటిముందూ ఆపి, హారతులు ఇవ్వటం --దళితవాడలో దళిత కుటుంబాల వారి వద్ద నుండి అర్చకులు హారతి ,పూజా ద్రవ్యాలను స్వీకరించకపోవడం. దళితుల ఇళ్ళలో చేసిన వంటకాలుకాకుండా బయటినుండి ఇతరులచేత వండించుకొని దళిత వాడలో తినటం.కరుణాకరరెడ్డి ఆ దళిత వాడలో ఎంతగా తిరిగినా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళయినా ముట్టకపోవడం. ముళ్ళమీద నిల్చినట్లు ఆ దళిత వాడలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు గడిపి ఆనక ఇంటికి పోయాక తమనూ, తమ కొంపలనూ శుద్ధిచేసుకోవడం అన్న వైనాలు గమనిస్తే ఈ దళిత గోవిందంలోని బండారం ఆర్ధమవుతుంది.హిందూ ధర్మ పరిరక్షణ పేరిట , దళితులను భ్రమల్లో ముంచి దళితులను తమ వెనక ఉంచుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే పన్నాగమే ఈ దళిత గోవిందం తప్ప ,ఇది ఎంతమాత్రమూ హిందూ ధర్మము లోని ,మతములోని దురాచారాలను రూపుమాపే సంస్కరణోద్యమం కాదు.

Saturday, April 14, 2007

కేంద్ర బడ్జెట్టు దోపిడీ వర్గాలకు పెద్ద పీట

2007-08 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్టులో మంత్రి చిదంబరం చెప్పిన దానికంటే చెప్పకుండాఊరకున్నదే ఎక్కువగావుంది.2006-07 సంవత్సరపు ఆదాయ వ్యయాలూ, వాస్తవలోటు లను పేర్కొనలేదు. ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే అంశాలివి. ప్రణాళికా వ్యయం 205000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 435421 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటాల కొనుగోలుకు 40000కోట్లు. మొత్తం వ్యయం 680521 కోట్లు. రెవెన్యూ ఆదాయం 486422 కోట్లు, రెవెన్యూ వ్యయం 557000 కోట్లు వెరసి 71478 కోట్లు లోటు గా చూపించారు. అయితే రెవెన్యూ ఆదాయానికి వాస్తవఖర్చుకు మధ్యనున్న 194099 కొట్లకు సంబంధించి ఎలాంటి వివరణా ఇవ్వలేదు.
లోటును పూరించడానికి ప్రభుత్వానికి ఉన్న ఒకేమార్గం నోట్లు ముద్రించుకోవడమే.దీని వలన రూపాయి విలువ తగ్గుతుంది.దీనినే ద్రవ్యోల్బణం అంటారు.గత 60 ఏళ్ళుగా అమలుజరుగుతున్న లోటుబడ్జట్టు విధానం ధనికులను మరింత ధనికుల్ని చేసింది.పేదలను మరింత పేదలను చేసింది.ప్రజోపయోగకరమైన ఆస్తుల సృస్టికి పూనుకోలేదు.పైగా ప్రభుత్వ రంగ సంస్తల ఆస్తులు కారు చౌకగా అమ్మి గుత్తాధిపతులకు అప్పగించారు. ప్రజా ధనంతో తాము నిర్మిచవలసిన రోడ్లను ప్రైవేటు పరం చేసి,వారు టోలు గేటు రూపంలో ప్రజలను విపరీతంగా దోచుకు తినేందుకు వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు ఈ లిస్టులో చేరాయి.లోటు బడ్జెట్టుతో ప్రజాధనాన్ని సెజ్ లకు ప్రభుత్వం తరలిస్తుంది.అధికారంలోనూ,ప్రతిపక్షంలోనూ ఉన్నపార్లమెంటరీపార్టీలన్నీ సెజ్ లను వాటికి కేటాయించిన కంపెనీలే తమ స్వంత నిధులతో నిర్మిస్తాయని ,ప్రభుత్వ ధనాన్ని వాటికి ఇవ్వమని పదే పదే అంటున్నాయి. ఇది పచ్చి అబద్దం. వీటికి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. నష్టపరిహారం చెల్లిస్తుంది.దీనికి బడ్జట్టు నుండి నిధులు కేటాయిస్తుంది. ఇంతేకాక వీటికి ప్రభుత్వం అనేక పన్నులలో రాయతీలనిస్తుంది. అంటే ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని వదలుకొంటుంది.ఆ కంపెనీలకు ఆ మేరకు డబ్బులు మిగులుతాయి.ఇది ఏడాదికి ఒక లక్ష కోట్ల రూపాయలుంటుంది.ఇలా ప్రతి ఏడాదీ వుంటుంది.బడ్జెట్టులో ఆమేరకు ప్రతి యేడాదీ లోటు వుంటుంది.అంటే సెజ్ లకూ, వాటి యజమానుల లాభాలకూ బడ్జట్టు నుండి నిధులు తరలుతున్నాయి.ఈ దోపిడీలో పార్లమెంటూ,రాస్త్ర శాసనసభలూ ప్రత్యక్ష పాత్రను కలిగివున్నాయి.చిదంబరం దాచిపెట్టజూచింది ఈ అంశాన్నే.
పారిశ్రామిక రంగం 8 శాతం వృద్ధిరేటు సాధిస్తుండగా ,వ్యవసాయరంగం 2.3 శాతంతో వెనుకబడిపోయిందనీ ఆయన ఆందోళన చెందాడు.ఈ 'ఆందోళన ' వెనుక వ్యవసాయరంగాన్ని బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టాలన్న లక్ష్యం వుంది. లక్షలాది కోట్లు పారిశ్రామిక రంగానికి కట్టబెట్టినా పరిశ్రమలు మూతబడుతున్నాయి. జనాభాలో 5 శాతానికి కూడా ఇవి అందడం లేదు. పరిశ్రమలు మూతబడుతున్న, కార్మికుల ఉపాధి తగ్గుతున్నా ,కార్మికుల వేతనాలు తగ్గుతున్నా గుత్తాధిపతుల ఆస్తులూ,లాభాలు పెరిగిపోతున్నాయి. అదే వ్యవసాయ రంగానికొస్తే ,నీటిపారుదల లేదు; విద్యుత్తు సరఫరా లేదు; సంస్థాగతరుణాలు లేవు; గిట్టుబాటు ధర లేదు.ఈ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకొంటున్నది.వ్యవసాయాన్ని వెనుకబడినదిగా చిత్రించి , దానిని పరుగులెత్తించే పేరుతో బహుళజాతికంపెనీల పరం చెయ్యాడంకోసమే వ్యవసాయ రంగాన్ని నిందించ బూనుకున్నారు.