Sunday, September 26, 2010

కాశ్మీర్ సమస్య

మరోసారి కాశ్మీరులో అల్లర్లు చెలరేగాయి. 7,8 సంవత్సరాల వయసు పిల్లలు కూడా పోలీసుల బులెట్లకు పిట్టల్లా రాలిపోతున్నారు. శ్రీనగర్, కుప్పారా, బారాముల్లా, పుల్వామా, అనంతనాగ్ పట్టణాలలోని వీధులన్నీ నిరసన తెలుపుతున్న ప్రజల రక్తంతో ఎరుపెక్కాయి.
2010 ఏప్రిల్ లో షోపియాన్ గ్రామంలోని ఇద్దరు మహిళల మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో కాశ్మీర్ లో ఈ నిరసన వెల్లువ మొదలైంది. సాయుధ పోలీసులు ఆ మహిళలపై అత్యాచారం చేసి , చంపి, ఆశవాలను నదిలో పారవేశారని తెలుసుకున్న ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకులైన యువకులను పోలీసులు చంపడం, దానికి నిరసనగా ప్రజలు వీధులలోకి రావడం, పోలీసులు మరికొంతమందిని కాల్చివేయడం , ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీధులలోకిరావడం అనేది అంతులేకుండా సాగుతుంది. కొన్ని నిర్ధిష్ఠ నేరాలపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు క్రమంగా కాశ్మీర్ అంతటా వ్యాపించి , సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను రద్దు చేయవలసినదిగానూ, సి.ఆర్.పి.ఎఫ్. దళాలను కాశ్మీరునుండి పంపి వేయాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఉద్యమం కాశ్మీరు ప్రజల స్వాతంత్ర్య పిపాసను తెలియజేస్తుంది.
మొదటగా ఇది ప్రజలలోని అన్ని వయసులవారినీ ఆకర్షించింది. యువకులు కీలకపాత్ర వహిస్తున్నారు. ఈ నిరసనలు రాజకీయ ఉద్యమ రూపంలో ఉంటున్నాయి. కర్ఫ్యూలను, బులెట్లను, నిర్భంధాలను ఎదిరిస్తూ ప్రజలు పోరాడుతున్నారు. ఇది తిరుగుబాటు స్వభావంతో ఉంది. గతంలో పోలీసులు ప్రజల ఇళ్ళపై దాడిచేసి , యువకులను తీసుకెళ్ళి కాల్చి చంపి, టెర్రరిష్టులు ఎన్ కౌంటర్ లో మరణంచారని ప్రకటించేవారు. కాని ఇప్పుడు ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా వేలసంఖ్యలో వీధులలోకి వస్తుండడం వల్ల పాత పధ్థ్ధతిలో కాల్చివేయడం పోలీసులకు సాధ్యపడడంలేదు.

Tuesday, June 8, 2010

కె.జి. బేసిన్ గ్యాసు ధర

ప్రజల పై భారం మోపి ఉన్నత వర్గాలకు లాభం
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు కేజి బేసిన్ నండి ఉత్పత్తి అవుతున్న సహజ వాయువుపై అంబానీ సోదరుల తగవును సుప్రిం కోర్టు తీర్చింది. జాతీయ అన్వేషణ ,లైసెన్సు విధానం పత్రాల ఆధారంగా గ్యాసు కేటాయింపు, ధర నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే నని తీర్పు ఇచ్చింది. గ్యాసు సరఫరా ధరకు సంబంధించి అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందం చెల్లదనీ, కుటుంబ సమస్యగా చర్చించుకుని ఉభయతారకంగా పరిష్కరించుకోమని చెప్పింది. RIL అందించిన తప్పుడు లెక్కల ఆధారంగా మంత్రుల బృందం యునిట్ రేటును 4.2 డాలర్లు గా నిర్ణయించింది.
సుప్రీం కోర్టు తీర్పు రాగానే 4.2 డాలర్ల రేటుకు RILనుండి 181 లక్షల యూనిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వరంగ సంస్థ అయిన NTPC కొత్త ఒప్పందాన్ని చేసుకుంది. అప్పటివరకూ ప్రభుత్వరంగ సంస్థలైన ONGC, INDIAN OIL LTDలు ప్రభుత్వం నిర్ణయించిన 1.8 డాలర్ల రేటు చొప్పున వినియోగదారులకు గ్యాసును సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నాయి.. పై నిర్ణయం ప్రకారం వారికి కూడా 4.2 డాలర్ల రేటుతో అమ్ముకోవడానికి అనుమతి యిచ్చింది. వాస్తవంగా కేజి బేసిన్ లో గ్యాసు ఉత్పత్తి ఖర్చు యూనిట్ కు 1.28 డాలర్లు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ తెలిపాడు. ఈ లెక్కన ఎంతలేదన్నా యూనిట్టుకు 2 డాలర్ల లాభం రిలయన్సుకి వస్తుంది. ఇది ఉత్పుత్తి ఖర్చు రెట్టింపుకన్నా ఎక్కువే.
బిజినెస్ స్టాండర్డ పత్రిక అంచనా ప్రకారం (21-5-2010) గ్యాసు ధర పెంచినందువల్ల ఓ.యన్.జి.సి. కి ఆదాయం 6000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఆయిల్ ఇండియా ఆదాయం 350-800 వరకూ పెరుగుతుంది. పైపులైను ద్వారా గ్యాసుని భారత దేశానికి తరలించి యూనిట్ 3 డాలర్లకు ఇస్తామని ఇరాన్ ప్రతిపాదిస్తే ఐదేళ్ళు సాగలాగి తిరస్కరించారు. దానిని సమర్ధించిన నాయకుడిని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించారు. దేశంలో లభిస్తున్న గ్యాసుకు 4.2 డాలర్ల రేటును ఉదారంగా ఇచ్చారు. ఇదంతా రిలయన్సు కంపెనీకి బాగా లాభాలు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతిచ్చింది.
గ్యాసు ధర పెంచడానికి ప్రభుత్వం అనుమతించిందిగనుక వినియోగదారులకు ఇప్పుడు కేజి 21 రూపాయలకు అమ్ముతున్న గ్యాసును ఇకపై బహుశా 28 రూపాయలుగా పెంచవచ్చు .రవాణా రంగానికి అమ్ముతున్న గ్యాసును కెజి 35 రూపాయలకు విజయవాడలో అమ్ముతున్నారు. ఈలెక్కన అది 50 రూపాయలు పెంచవచ్చు. రవాణా చార్జీలు పెంచడం ద్వారా ఇది ప్రజలపై పడే భారమే.

Wednesday, April 7, 2010

Blogger Buzz: Blogger integrates with Amazon Associates

Blogger Buzz: Blogger integrates with Amazon Associates

కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదు: జస్వంతరావు

విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆన్‌లైన్): నక్సల్బరీ ఉద్యమ నాయకుడు కానూ సన్యాల్‌ది ఆత్యహత్య కాదని సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు పి.జస్వంతరావు ప్రకటించారు. బుధవారం విశాఖ వీజెఎఫ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కానూ సన్యాస్ మరణానికి దారితీసిన పరిస్థితులను బేరీజు వేసుకుని త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఉద్యమంపై నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఇటువంటి నిరాధారమైన వదంతులను పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చిందని తెలిపారు.

ఇదంతా అసత్య ప్రచారంగా అభివర్ణించిందన్నారు. దేశంలో విప్లవ ఉద్యమాలను ఊపిరిలూదిన కానూ సన్యాల్ ఎప్పటికీ ఒంటరివాడు కానీ, నిరాశావాది అంతకంటే కాదని జస్వంతరావు పేర్కొన్నారు. ఆయన నమ్మిన ప్రజాపంథాకు అనుకూలంగా ప్రస్తుతం ఎనిమిది ర్రాష్టాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. కానూ సన్యాల్ నిరాశ చెందేలా విప్లవోద్యమాలు ఎక్కడా నష్టపోలేదని ఆయన వివరించారు. ఆయన తాను చేపట్టిన ఉద్యమాన్ని విస్తతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరేవారన్నారు. నక్సల్బరీ రైతాంగ పోరాటంలో చోటుచేసుకున్న అతివాద,అరాచకలకు వ్యతిరేకంగా సూత్రబద్ధ పోరాటాలు చేశారని తెలిపారు.

మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచన విధానాలతో విప్లవ ప్రజాయుద్ధం పంథాను అచరించడం ద్వారానే శ్రామిక వర్గానికి రాజ్యాధికారం సిద్ధిస్తుందని అభిప్రాయానికి వచ్చిన వ్యక్తి కానూ సన్యాల్ అని పేర్కొన్నారు. డార్జిలింగ్ పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీల హక్కుల కోసం కానూ సన్యాల్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఆయన మతి పార్టీకి తీరనిలోటని, కానూ సన్యాల్ చేపట్టిన ఉద్యమాలను ముందుకు తీసుకువెళతామని తెలిపారు. విప్లవోద్యమాలలో పాల్గొన్న కానూ సన్యాల్ 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారన్నారు. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో భాగంగానే పార్వతీపురం కుట్ర కేసులో ముద్దాయిగా ఏడేళ్లు విశాఖ జైలులో వున్నారన్నారు.

ఆయన మతితో కళ్లు ఒత్తుకుంటూనే కానూ సన్యాల్ లేని లోటు పూరించడానికి నాయకత్వాన్ని పటిష్టం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా విశ్వంను ఎన్నుకున్నట్టు ప్రకటించారు. కొత్త నాయకత్వంలో వర్గపోరుకు మరింత పదునెక్కిస్తామని జస్వంతరావు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి ఆడారి అప్పారావు, రైతు కూలీ సంఘం విజయనగరం జిల్లా కార్యదర్శి డి.వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, April 6, 2010

ప్రజా విప్లవ పంధా యోధుడు కామ్రెడ్ కానూ సన్యాల్

షహీద్, భగత్ సింగ్, సుఖదేవ్ లు అమరులైన 79వ వర్ధంతి రోజునే నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రెడ్. కానూ సన్యాల్ మనల్ని వీడిపోయారు. 65 యేళ్ళ సుదీర్ఘ కమ్యూనిష్టు ఉద్యమ చరిత్ర ఉన్న కామ్రెడ్ సన్యాల్ 1928లో మధ్యతరగతి ఉద్యోగి కుటుంబంలో జన్మించారు.ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు.తెలంగాణా, తెభాగా పోరాటాల ప్రభావంతో వామపక్ష భావాలవైపు ఆకర్షితుడై సన్యాల్ విద్యార్ధి ఉద్యమ నేతగా ఎదిగి కమ్యూనిష్టు పార్టీ నిర్మాణంలోనికి 1950 ఆరంభంలో వచ్చారు.కార్మిక సంఘాల కార్యకలాపాలతో పార్టీలో కొనసాగారు. 1959 నుండి ఉమ్మడి కమ్యూనిష్టు పార్టీలో ఆదివాసీ రైతు సంఘనాయకుడిగా పనిచేశాడు. 1963లో సిపిఐ (ఎం) వైపు ఉన్నారు.1967 మే 25 న ఉధ్భవించిన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్. తెలంగాణా సాయుధ పోరాటంలో విడిచిపెట్టిన - భూమికోసం, భుక్తికోసం, విముక్తికోసం అనే ప్రజాయుధ్ధపంధాలో నడిచాడు.1969 ఏప్రియల్ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్) ను ప్రకటించాడు.పార్వతీపురం హత్య కేసులో ముద్దాయిగా అరెష్టయి 6 సంవత్సరాలు జైలులో ఉన్నాడు. తన మొత్తం రాజకీయ జీవితంలో 14 ఏండ్లకుపైగా జైలు జీవితాన్ని, 7సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని గడిపి 13సంవత్సరాల క్రితం గుండెనొప్పితో అనారోగ్యంపాలయ్యాడు.2సంవత్సరాల క్రితం పక్షవాతంలో బాధపడుతూ 6 నెలలకు పైగా సిలిగురి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
కామ్రెడ్.కానూ సన్యాల్ మరణం భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి, మిత అతి వాదాలకు వ్యతిరేకమైన ప్రజా విప్లవ పంధా కు తీరని నష్టం. ఆయన విడిచివెళ్ళిన కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి కృషి చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.