Wednesday, July 11, 2007

ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగుల మెరుపు సమ్మె

ఇండియన్ విమాన సంస్థ పేరిట ప్రభుత్వరంగ విమాన సంస్థగా వున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన 12,700 మంది ఉద్యోగులు జూన్ 13వ తేదీన హఠాత్తుగా మెరుపు సమ్మెకు దిగారు.
1997 నుండి తమకు చెల్లించకుండా బకాయిపడ్డ ఎరియర్స చెల్లింవుకోసం, వేతన సవరణలకోసం, ఎయిర్ ఇండియా విమానసంస్థ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రమోషన్లు యివ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్ లైన్సు సంస్థలు రెండింటిని విలీనం చేసే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించడం వలన తమ ప్రమోషన్ అవకాశాలు పోతాయని ఇండియన్ విమాన సంస్థ ఉద్యోగులు సమ్మె చేశారు.
ఉద్యోగుల సమ్మె పట్ల ప్రభుత్వం తీవ్రంగా స్పందిచింది. సమ్మె నిలుపుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి 27 మందిని సస్పెండు చేసింది. గతంలో ఇచ్చిన హామీల గురించి పునరాలోచించాలని ప్రకటించింది. లాకవుట్ చేయడానికి ప్రయత్నించింది. వివిధ కోర్టులనుండి సమ్మె చెయ్యకుండా ఉత్తర్వులు ఇప్పించడానికి ప్రయత్నించింది.
అయినా ఉద్యోగులు ఆ బెదిరింపులకు లొంగక తమ సమ్మెను కొనసాగించారు.
3 రోజుల తర్వాత ప్రభుత్వము ఉద్యోగ సంఘాలతో చర్చించి సమ్మె ఉపసంహరణకు ఒప్పించుకుంది. ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఇవ్వవలసిన పాత బకాయి 267 కోట్లు 2008 లోపు చెల్లించుటకు ఒప్పుకుంది. ప్రమోషను విషయంలో 9వ గ్రేడు ఉద్యోగులకు 6 సం. సర్వీసు వుంటే 12వ గ్రేడు కూ, 3 సం. సర్వీసు వుంటే 9 ఎ గ్రేడుకు ఉద్యోగులు ఎటువంటి పరీక్ష రాయకపోయినా ఇవ్వడానికి అంగీకరించింది. సస్పెండ్ చేసిన 27 మందిని తిరిగి పనిలోకితీసుకోవడానికి అంగీకరించింది.
సమ్మెకు నాయకత్వం వహించిన ఎయిర్ కార్పోరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ CITU అనుబంధసంస్థ కావడంవల్ల CPM నాయకులు కారత్ , ఏచూరి లు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి సమ్మె పరిష్కారానికి కృషి చేశారని పత్రికలు తెలియ జేస్తున్నాయి.
అయితే కార్మికులకు గత 10 సంవత్సరాలుగా రావలసిల బకాయిలు మొత్తం ఇప్పించలేకపోవడం వారి బలహీనత.