Thursday, August 14, 2008

పార్లమెంటరీ ప్రహసనం

వామపక్ష కూటమి యూపీఏ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న జులై 7వ తేదీ నుండి పార్లమెంటు విశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగిన జులై 22వ తేదీ వరకూ సాగిన ఘటనల క్రమమంతా భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందో తేటతెల్లం చేసింది.బడా పరిశ్రమాధినేతలు నడుంబిగించి బరిలోకిదిగారు.హత్యలూ, కిడ్నాపులవంటి తీవ్ర నేరారోపణలతో జైలులో వున్న ఎంపీలు విడుదలై వచ్చి, సగౌరవంగా పార్లమెంటులో ప్రవేశించి మైనారిటీ ప్రభుత్వాన్ని బలపరచారు. ఇతర దేశాల రాయబారులు రాజకీయ పార్టీల నేతలను కలసి మంతనాలాడారు. అరుపులూ, నోట్ల కట్టల ప్రదర్శనల మధ్య అసలు మీద ఏ చర్చా జరగకుండానే విశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ తర్వాత పార్టీ నిర్ణయాన్ని మీరారంటూ దాదాపు అన్ని పార్టీలూ తమ సభ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టబోవడం గమనిస్తే , ఈ బేరసారాలు లేకపోతే ప్రభుత్వం ఓడిపోయి వుండేదన్నది అందరికీ అర్ధమైన విషయమే.

Tuesday, August 12, 2008

ఆగష్టు 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చెయ్యండి

అధిక ధరలను, ఇతర కార్మిక సమస్యలనూ వ్యతిరేకిస్తూ , ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గం అంతా ఆగష్టు 20 న సార్వత్రిక సమ్మె జరపాలని , దేశంలోని వివిధ కార్మిక సంఘాలూ, ఫెడరేషన్లూ, అసోసియేషన్లతో కూడిన స్పాన్సరింగ్ కమిటీ మే 13 వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ట్రేడ్ యూనియన్ల జాతీయ సదస్సులో నిర్ణయించడం జరిగింది.
తిరిగి జులై 8 న 800 మంది ప్రతినిధులతో జరిగిన జాతీయ సదస్సు సమావేశం ఆగష్టు 20వ తేదీన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఒక రోజు సమ్మె జరపాలన్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ. సమ్మెకు ఘనవిజయం చేకూర్చాలన్న ధృడ సంకల్పాన్ని ప్రకటించింది.
సత్వరమే ధరల పెరుగుదలను అదుపు చేయాలని,
కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలనీ,
కాంట్రాక్టీకరణ- ఔట్ సోర్సింగులను నిలుపుదల చెయ్యాలనీ,
అసంఘటితరంగ కార్మికులందరికీ సామాజిక భద్రతాబిల్లు పరిధిని విస్తరింప చేయాలనీ,
రైతులకు ప్రయివేటు వ్యాపారస్తులనుండి తీసుకున్న రుణాలను కూడా రద్దు చేయాలనీ,
రైతులకు తక్కువ వడ్డీ రేటుపై జాతీయ బ్యాంకులు తేలిక రుణాలు ఆందించాలనీ,
ప్రభుత్వ రిక్రూట్మెంటుపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయాలనీ,
కాంట్రాక్టు కార్మికులతోసహా , అన్నిరకాల కార్మికులకు నూతన వేతన ఒప్పందాలు జరుపాలనీ
ఈ స్పాన్సరింగు కమిటీ డిమాండ్ చేస్తుంది.

ఆగష్టు 20న సమ్మె జరపడమేకాక కుదిరిన చోట్ల బందులు కూడా జరపాలనీ , ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడం కోసం ముమ్మరంగా ప్రచారకార్యక్రమాల్ని నిర్వహించాలనీ కూడా ఈ స్పాన్సరింగ్ కమిటీ కోరుతుంది.

కార్మికులారా పోరాడండి.
మీకు పోయేదేంలేదు, బానిస సంకెళ్ళు తప్ప.