Sunday, August 16, 2009

హిల్లరీ క్లింటన్ పర్యటన : సాస్టాంగపడ్డ భారతప్రభుత్వం

అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ ఐదురోజుల భారత పర్యటన సందర్భంగా సంతకాలు చేసిన అనేక ఒప్పందాలు –వ్యూహాత్మక భాగస్వామ్యమంటే- భారతదేశం అమెరికా ప్రయోజనాలకు సహకరించడమే అన్నట్లుగా ఉంది.
రాగల 5 సంవత్సరాలలో 3000 కోట్ల డాలర్ల ఆయుధ సామాగ్రిని కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 45 వేల కోట్ల రూపాయల ఖరీదు చేసే 127 యుద్ధవిమానాలున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయవసినంత అవసరం ఇప్పుడేమొచ్చిందో మనకు అంతుబట్టని విషయం. మరో విషయం ఏమిటంటే మన దేశానికి ఏదైనా కారణంచేత ఇతర దేశంతో యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే తన సైనిక, ఆయుధ పాటవాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ మనకుండాలిగదా. ఆయుధాలు కొనేది అవసరమొచ్చినప్పుడు వాడటానికేగదా. అలా అవసరపడ్డప్పుడు తన వద్దనుండి కొనుగోలు చేసిన ఆయుధాలు వాడవచ్చునో లేదో నిర్ణయించే అధికారం అమెరికాకే ఉన్నదట. కొనుగోలు చేసిన ఆయుధాలు అమెరికా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారట. కనుక మనం ఎవరిమీద యుద్ధం చెయ్యాలో అమెరికా నిర్ణయిస్తుందన్నమాట. –అంతిమ వినియోగ పర్యవేక్షణ ఒప్పందం – అనే పేరు గల ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం కిమ్మన కుండా సంతకం పెట్టింది. ఇటువంటి చర్యలు భారత సార్వభౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టినట్లుగా భావించాలి.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పరిశోధనలను పౌర అవసరాలకు వినియోగిస్తున్నారా లేక సైనిక అవసరాలకు వాడుతున్నారా అనేది తేల్చిచెప్పడం సాధ్యంకాదు. ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపే రాకెట్టూ , ఇతర దేశాలపై బాంబులు వేసే క్షిపణీ ఒక్కటే. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపగల రాకెట్టు భారత అంతరిక్షపరిశోధనా సంస్థ వద్ద ఉందంటే అర్ధం ఉపగ్రహం బదులు బాంబును పెట్టి ఏ దేశం పైన అయినా వేయగల ఖండాంతర క్షిపణి భారత సైన్యానికున్నట్లే. అంతరిక్ష వాణిజ్యేతర వినియోగం పై కూడా – అంతిమ వినియోగ పర్యవేక్షణ- వంటి ఒప్పందం జరిగింది. దీని ప్రకారం అమెరికా అందజేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుతున్నారో పర్యవేక్షించి ఆంక్షలు పెట్టే అధికారం అమెరికాకు ఏర్పడింది. మన సైన్యం ఏపని చెయ్యాలన్నా అమెరికా అనుమతి కావాలి. దీనితో భారత అంతరిక్ష పరిశోధనలను అడ్డుకునేందుకు అమెరికా చేతిలో ఒక బెత్తాన్ని పెట్టి వొంగున్నట్లయింది. ఇది భారత దేశ శాస్త సాంకేతికాభివృద్ధిని సామ్రాజ్యవాద ఆధిపత్య బలిపీఠం పై నిలపడమౌతుంది.

Monday, August 10, 2009

కరవు కోరలు సాచుతున్నా పట్టించుకోని పాలకులు:

పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్,బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్తితులేర్పడ్డాయి. అల్పపీడనంతో పడ్డ చెదురుమదురు వర్షాలతో రాయలసీమ రైతులు వేరుశనగ వేసి బిందెలతో నీళ్ళు తెచ్చి పోసినా పంట ఎండిపోతుంది. గుండెపగిలి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కరవు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. పరిస్థితి ఆందోళన కరంగా లేదని కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ లోక్సభలో ప్రకటించారు. మాయవతి మాత్రం ఉత్తరప్రదేశ్ లో 47జిల్లాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి, కేంద్రం నుండి 80వేల కోట్ల రూపాయల సహాయాన్ని కోరింది. ప్రతి ఏడాదీ వరదలూ, వర్షాభావ పరిస్ధితులు ఏర్పడుతున్నా, తక్షణ సహాయచర్యలందించే బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు పూనుకుంటుంది. కనుక కరవుతో కుదేలైన రైతాంగాన్ని ప్రభుత్వం కొత్త ఆశలు కల్పించి కాంట్రాక్టు సాగు వైపు , బడా బూర్జువాల పరిశ్రమలకు ముడిసరుకుగా వాణిజ్య పంటలవైపుకు మళ్ళించబూనుకునే ప్రయత్నంఉందన్న అనుమానం కలుగుతుంది.