Sunday, September 26, 2010

కాశ్మీర్ సమస్య

మరోసారి కాశ్మీరులో అల్లర్లు చెలరేగాయి. 7,8 సంవత్సరాల వయసు పిల్లలు కూడా పోలీసుల బులెట్లకు పిట్టల్లా రాలిపోతున్నారు. శ్రీనగర్, కుప్పారా, బారాముల్లా, పుల్వామా, అనంతనాగ్ పట్టణాలలోని వీధులన్నీ నిరసన తెలుపుతున్న ప్రజల రక్తంతో ఎరుపెక్కాయి.
2010 ఏప్రిల్ లో షోపియాన్ గ్రామంలోని ఇద్దరు మహిళల మృతదేహాలు నదిలో తేలుతూ కనిపించడంతో కాశ్మీర్ లో ఈ నిరసన వెల్లువ మొదలైంది. సాయుధ పోలీసులు ఆ మహిళలపై అత్యాచారం చేసి , చంపి, ఆశవాలను నదిలో పారవేశారని తెలుసుకున్న ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమాయకులైన యువకులను పోలీసులు చంపడం, దానికి నిరసనగా ప్రజలు వీధులలోకి రావడం, పోలీసులు మరికొంతమందిని కాల్చివేయడం , ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వీధులలోకిరావడం అనేది అంతులేకుండా సాగుతుంది. కొన్ని నిర్ధిష్ఠ నేరాలపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు క్రమంగా కాశ్మీర్ అంతటా వ్యాపించి , సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను రద్దు చేయవలసినదిగానూ, సి.ఆర్.పి.ఎఫ్. దళాలను కాశ్మీరునుండి పంపి వేయాలని డిమాండ్ కొనసాగుతుంది. ఈ ఉద్యమం కాశ్మీరు ప్రజల స్వాతంత్ర్య పిపాసను తెలియజేస్తుంది.
మొదటగా ఇది ప్రజలలోని అన్ని వయసులవారినీ ఆకర్షించింది. యువకులు కీలకపాత్ర వహిస్తున్నారు. ఈ నిరసనలు రాజకీయ ఉద్యమ రూపంలో ఉంటున్నాయి. కర్ఫ్యూలను, బులెట్లను, నిర్భంధాలను ఎదిరిస్తూ ప్రజలు పోరాడుతున్నారు. ఇది తిరుగుబాటు స్వభావంతో ఉంది. గతంలో పోలీసులు ప్రజల ఇళ్ళపై దాడిచేసి , యువకులను తీసుకెళ్ళి కాల్చి చంపి, టెర్రరిష్టులు ఎన్ కౌంటర్ లో మరణంచారని ప్రకటించేవారు. కాని ఇప్పుడు ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా వేలసంఖ్యలో వీధులలోకి వస్తుండడం వల్ల పాత పధ్థ్ధతిలో కాల్చివేయడం పోలీసులకు సాధ్యపడడంలేదు.