Sunday, June 10, 2007

నీవు టెర్రరిష్టువా? మతోన్మాదివా?

మక్కామసీదుపై బాంబుదాడి నీచమైన చర్య

మక్కామసీదుపై శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనా సమయంలో బాంబు పేలింది. మరొక బాంబు పేలకుండా ఉండిపోయింది. బాంబు పేలుడులో ఐదుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. మసీదులో ప్రార్ధనాసమయంలో పేలేలా బాంబును పెట్టటం నీచమైన చర్య . ప్రజలపట్లా, ప్రజాజీవితం పట్లా ఏమాత్రం బాధ్యత ఉన్నవారైతే ఇలాంటి నీచ చర్యలకు పాల్పడరు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది టెర్రరిష్టుల పనే అయితే అది ముస్లిములకు తీవ్ర క్షోభను కలిగించే చర్య అవటమేకాక ముస్లిములను రెండవశ్రేణి పౌరులుగా చిత్రిస్తున్న హిందూ మతోన్మాదశక్తులకూ, వారిని అనేక వేధింపులకూ బుజ్జగింపులకూ లోను చేస్తున్న దోపిడీ పాలకవర్గ శక్తులకూ తోడ్పడేదిగా వుంటుంది. ప్రజల ప్రాణాలకు హానికలిగించే ఈ పిరికి చర్యను జనశక్తి తీవ్రంగా ఖండిస్తుంది.
ఈ నీచ చర్యకు పాల్పడినవారు ఆశించినది నెరవేరలేదనే చెప్పాలి. ఇది ఎలాంటి కలహాలకూ దారితీయలేదు. గతంలో గుంటూరులో మసీదు వద్ద బాంబు పేలినప్పుడుకూడా ఎలాంటి కలహాలకూ దారితీయలేదు.యువకులు కొంత ఆవేశం చెందినప్పటికీ పెద్దలు సర్దిచెప్పటంతో వెంటనే తగ్గారు. కాని ఇప్పుడు నిగ్రహం పాటించడంలో ప్రభుత్వ యంత్రాంగమే విఫలమైందని చెప్పవచ్చు. బాంబు ప్రేలుడుకంటే ఎక్కువమంది అమాయకులు కాల్పులలో మరణించడం, గాయపడటమే దీనికి తార్కాణం. అదే సమయంలో ఎం.ఆర్.పి.ఎస్. కార్యకర్తలపట్ల నిగ్రహం చూపిన ప్రభుత్వం ఆవేశపడిన ముస్లిం యువకుల పట్ల ఎందుకు నిగ్రహం చూపలేదన్నదే సమాధానం రాని ప్రశ్న.
24 గంటల్లో దోషులను పట్టుకుంటామన్న ప్రభుత్వం కోర్టులో నిరూపించగల సాక్షాలేమీ చూపకుండానే , నిఘావర్గాల కథనమంటూ ముస్లిం టెర్రరిష్టులు , ఐ ఎస్ ఐ ఏజంట్లు షాహెద్ దీనికి కారణమంటూ ప్రచారం చేస్తున్నది. టెర్రరిష్టులకు హైదరాబాదు అడ్డాగా మారినట్లు , ముస్లిం యువకులందరూ ఐ.ఎస్. ఐ. ఏజంట్లుగా మారినట్లు కథనాలు ప్రచారంలో పెడుతున్నది. పాకిస్తాన్ గూఢచారి సంస్ధకు బంగ్లాదేశ్ శిక్షణా స్తావరం ఎలా అయ్యిందో వివరించదు. అదే నిజమైతే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి నిరసన తెలిపి . దౌత్యపర చర్యలెందుకు తీసుకోరో తెలియదు.
ఈ చర్య ఎవరు చేసినా , దాని పర్యావసానంగా ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని , మానసిక స్ధితిని వినియోగించుకోవటానికే పాలకులు పూనుకున్నారన్నది నిర్వివాదాంశం. ఆకుకు అందని పోకకు పొందని రకపు ప్రచారంతో ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచడం ద్వారా వారిని వంటరి చేయటం, ఇతర ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచటం ను దోపిడీ పాలకవర్గాలు కోరుకొంటున్నాయి. ఇన్నాళ్ళూ అదే చేస్తూ వస్తున్నాయి. బాంబు పేలుడు వంటి ఘటనలను ఈ విధంగానే ఉపయోగించుకుంటున్నాయి.మక్కామసీదు ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి దీనినే తెలుపుతుంది. ఈ దృక్కోణం నుంచే ఈ రకపు చర్యలు దోపిడీ వర్గాలకే తోడ్పడతాయని చెప్పాము.
ఇంతే కాదు. ఇలాంటి ఘటనలను అటు ముస్లింలలోనూ , ఇటు హిందువులూ, క్రైస్తవులూ ఇతర మతస్తులలోనూ ప్రజాస్వామిక శక్తుల గొంతు నొక్కడానికే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను విమర్శిస్తే టెర్రరిష్టులకు మద్దతిస్తున్నారంటూనూ, టెర్రరిష్టు చర్యలను విమర్శిస్తే మతోన్మాదులకు వత్తాసు అంటూనూ ప్రజాతంత్ర శక్తులను నిరంతరం వత్తిడికి లోను చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం వైపునో , మతోన్మాదంవైపునో తప్ప మరో పక్షంవైపు, ప్రజాస్వామిక విలువలూ, ఆచరణవైపు పోరాదన్న నిరంకుశ అణచివేత దీనిలో ఇమిడివుంది.