Sunday, June 22, 2008

గ్యాసుకు 50 రూపాయలివ్వడం ఉత్త గ్యాసేనా?

పెట్రోలును లీటరుకు 5 రూపాయలూ, డీజిలు 3 రూపాయలూ, గ్యాసు సిలెండరును 50 రూపాయలు పెంచింది. పెట్రోలు, డీజిలు పై ఎక్సైజు సుంకాన్ని 1 రూపాయి , దిగుమతులపై కష్టమ్స్ సుంకాన్ని 5 శాతానికి తగ్గించింది. ప్రజలపై 45,000 కోట్ల రూపాయల భారం మోపింది. ఫలితంగా ద్రవ్యోల్బణం 11 శాతానికి పెరిగింది , అంటే ధరలు బాగా పెరిగాయి.
ధరలు తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ అమ్మకం పన్నును తగ్గించుకోవాలని కేంద్రం కోరింది. పెంచిన ధరలు తామే భరించి , పాత ధరలకే అమ్ముతామంటూ ప్రకటించారు. ఇది అసలు విషయాన్ని తిరగేసి చెప్పటమే. పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాల అమ్మకం పన్ను 20-30 శాతం వరకూ ఉంది. దినివల్ల రాష్ట్రాలకు 37,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నే తీసుకుంటే కేంద్రం పన్ను తగ్గించినందువల్ల 600 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. అంతకు ముందు 1800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కాగా ధరలు పెరిగినందున పన్నురేటు తగ్గించినా , అమ్మకం పన్ను నుండి ఆదాయం 425 కోట్ల రూపాయలు పెరుగుతుంది. అంటే ఆదాయంలో తగ్గుదల 175 కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి - పెంచిన గ్యాసు ధర 50 రూపాయలూ పెంచకుండా , పాతధరకే అమ్ముతానని - ప్రకటించాడు. దీనివల్ల అదనంగా రావలసిన అమ్మకం పన్ను ఆదాయాన్ని మాత్రం కోల్పోతాడు తప్ప, తాను నష్టపోయేదో, తాను భరించేదో ఏమీలేదు. ప్రజలంటే మరీ అంత అమాయకంగా కన్పిస్తారా పాలకులకు ?

Sunday, June 15, 2008

మానవీయ సహాయం పేరిట ఆధిపత్య రాజకీయం

2008 మే 3వ తేదీన తుఫాను నర్గీన్ మయాన్మార్ పై విరుచుకపడింది.-28458 మంది మృతి చెందారని , 33416 మంది జాడ తెలియడంలేదని అధికార ప్రకటన తెలుపుతుండగా అనధికారిక అంచనా ప్రకారం 20 లక్షలమంది నిర్వాసితులయ్యారు. కూడూ,గూడూ,మంచినీరు, ఔషధాలు లేక అల్లాడుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి మానవవ్యవహారాల సమితి మృతుల సంఖ్య 64వేల నుండి లక్ష మధ్యన వుండవచ్చనీ, 2 లక్షల 20 వేల మంది జాడ తెలియడం లేదని తెలుపుతూ, ఆహారం, నీటి కొరతవల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి హింసాకాండ చెలరేగవచ్చని భయాన్ని వ్యక్తం చేసింది.
తుఫానుకు తీవ్రంగా గురైన ఐరావతి నది డెల్టా పల్లపు ప్రాంతమే కాక, ఉపనదులూ, కాలవలతో కూడివుంది. రోడ్డు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పడవలు, హెలీకాఫ్టర్లు మాత్రమే ఆప్రాంతానికి చేరగలుగుతున్నాయి. ఆహారాన్ని చేరవేస్తున్న రెడ్ క్రాస్ వారి పడవ ఒకటి నదిలో మునిగిపోయిందంటే సహాయ కార్యక్రమాల నిర్వహణ ఎంత కష్టతరంగా ఉందో అర్ధమౌతుంది. చాలా పరిమితంగా సహాయం అందుతుంది. లబుట్టా పట్టణంలో 117 శిబిరాలలో, 150000 మంది శరణార్ధులుగా ఉన్నారు. వీరికి మాత్రం సహాయం అందజేయగలిగారు.
బర్మాలోని సైనిక పాలకులు తగిన విధంగా సహాయం అందించలేక పొయ్యారు. పేదదేశం, వనరులకొరత వంటి కారణాలతోపాటు సహాయ చర్యలు తీసుకోవడంలో సైన్యం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. దీనినానరాగా తీసుకొని అమెరికా నిందాప్రచారం ప్రారంభించింది. అంతర్జాతీయ సమాచార వ్యవస్థ మన్మయార్లో జరిగిన భీభత్సాన్ని పదే పదే ప్రచారం చేశాయి. లక్షలాది ప్రజలు ఏదిక్కూలేకుండా పోతున్నారని కన్నీరు కార్చింది. మన్మయార్ పాలకులు సహాయమందించరనీ, ప్రపంచ మానవాళే మన్మయార్ ప్రజలను ఆదుకోకుంటే ఒక మానవ సంక్షోభం ఏర్పడుతుందనీ ప్రచారం చేసింది.’టైమ్స్ ’ పత్రికయితే ‘ బర్మా ఆక్రమణకు సమయమిదేనా ? ’ అని ప్రశ్నించి మానవీయ సహాయమందించడానికి ఆక్రమణే సరైన చర్య అని తేల్చింది. అయితే ప్రపంచ దేశాలు దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. అలా వచ్చేసరికి సమయం మించిపోతుంది అంటూ కలరా వచ్చాక జనం చనిపోతే సైనిక జోక్యం చేసుకోవడానికి కారణం దొరుకుతుందంటూ వ్యాసాన్ని ముగించింది.
అమెరికా మంత్రిణి కండోలెస్సారైస్ “ప్రపంచ దేశాలు సహాయ మందించడాన్ని బర్మా ప్రభుత్వం అంగీకరించాలి. ఇవి రాజకీయాలు కావు. మానవ సంక్షోభ సమస్య ” అంది. 35 లక్షల డాలర్లను సహాయంగా ప్రకటించింది. అయితే ప్రకటించకుండా విధించిన షరతులేమంటే అమెరికా నావికా సైన్యం తన స్వంత యుధ్ద నౌకలతో , సైనికులతో మన్మయారుకు వెళ్ళి తానే స్వయంగా సహాయమందించడానికి మన్మయార్ ప్రభుత్వం అంగీకరించాలట. సహజంగానే మన్మయార్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. వస్తురూపంలో సహాయమందజేస్తే తాను తన దేశ ప్రజలకు ఆందజేస్తానని , ఐ.రా.స. గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలను అనుమతిస్థానని, విదేశీ సైనికులను అనుమతించనని స్పష్టం చేసింది.
గతంలో సునామీకి గురైన దేశాలన్నీ మన్మయార్ లాగా పేదదేశాలే. బాధితులకు సహాయమందించడంలో చాలా లోపాలు జరిగాయి. బాధితులకు సహాయమందించే, సహాయసంస్థలు వేటినీ ఇండోనేషియా సైన్యం ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. తమ ద్వీపానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్న అసెసిస్ తిరుగుబాటుదారులను ( సునామీకి గురై కష్టాలలో ఉన్నవారిని ) నిర్మూలించేందుకు అవకాశంగా వాడుకుంది. అయినా ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా కనుసన్నలలో నడుస్తోందిగనుక ఆనాడు “ మానవ సంక్షోభం ” అనేది అమెరికాకు కన్పించలేదు.
అలాగే సునామీకి గురైన తమిళ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను కలిసి నిర్వహిద్దామని శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈ ప్రతిపాదించింది. అలా చేస్తే ఎల్టీటీఈని అధికారికంగా గుర్తించినట్లవుతుందని శ్రీలంక ప్రభుత్వం నిరాకరించడమేగాక , ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు నిర్వహించలేదు. అయినా అమెరికాకు “ మానవ సంక్షోభం ” కన్పించలేదు.
సునామీకి గురైన అండమాన్ నికోబార్ దీవులలో సహాయ కార్యక్రమాలను తానే నిర్వహించుకుంటానని, విదేశీ సైన్యాల సహాయమవసరంలేదని భారత ప్రభుత్వం అన్నా అమెరికా పాలకులకు కోపం రాలేదు. భారత సార్వభౌమత్వాధికారాన్ని కాదని అమెరికా సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రతిపాదనేదీ ఆనాడు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇండోనేషియా, శ్రీలంకల మీద తీవ్ర వత్తిడితెచ్చి, అమెరికా సైన్యం ప్రవేశానికి ఆమోదం పొందారు. ఆయా దేశాల సైన్యాలతో కలసి అక్కడి తిరుగుబాటుదారులను అణచడంలో సహాయపడే లక్ష్యంతో ఇది జరిగింది.
ప్రాన్సు,బ్రిటన్లు అమెరికాతో కలిసాయి. ఐరాస తన అధికారాలను వినియోగించుకొని బర్మా ప్రభుత్వం అంగీకరించినా లేక తిరస్కరించినా మాసైన్యాలు బర్మాలో సహాయమందిచేలా తీర్మానం చెయ్యాలని భద్రతామండలిని ప్రెంచి విదేశాంగశాఖామంత్రి కోరాడు.బర్మాకు వచ్చే విదేశీసహాయాన్నంతా ఒక పధ్దతిగా అందించేందుకు ఆగ్నేయాసియా దేశాధినేతలు సమావేశమై , ఒక అంగీకారానికి వచ్చి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసారు. మానవీయ సహాయం , జోక్యం పేరిట అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని అమలు చేస్తుంది. తూర్పు తైమూరులోనూ, కొసావోలోసూ మానవీయ సహాయం పేరిట అది తీసుకున్న సైనిక చర్యలు లక్షలాది ప్రజలను మృత్యుజ్వాలలకు ఆహుతి చేసాయి. “ మేమింకా ఏకపక్ష సైనిక జోక్యాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వ్రజలకు మేమే సహాయం అందించాలని కోరుకొంటున్నాం ” అని ఫ్రెంచి విదేశాంగమంత్రి అన్నాడు. తమ మాట వినకుండా చైనాతో సంబంధాలు బలపర్చుకొంటున్న మన్మయార్ సైనిక పాలకులను తొలగించాలన్న లక్ష్యమే అమెరికా సామ్రాజ్య వాదులది. అంతే తప్ప మన్మయార్ ప్రజల కడగండ్లు గాని, ఆ ప్రజల ప్రజాస్వామ్య హక్కులపట్ల ప్రేమగాని సామ్రాజ్యవాదులకు లేదని, తుఫాను భీభత్సాన్నికూడా ఆధిపత్య ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్న సామ్రాజ్యవాదుల వైఖరి తెల్పుతుంది.

Thursday, June 12, 2008

జాతి వైషమ్య రాజకీయాల అసలు రూపం

తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాదులు సంక్షోభ భారాన్ని ప్రజలపై మోపేందుకు ( కార్మికులను పనిలోనుండి తొలగించడం, పన్నుల పెంపు, సంక్షేమ చర్యలలో కోత మొదలగునవి ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూనే అసలు సమస్యల నుండి ప్రజల చూపు మళ్ళించేందుకు జాతి వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. జాతివైషమ్యాలను సాకుగాచూపి ప్రజలను అణిచివేసే నిరంకుశాధికారాలను పొందుతున్నారు. యూరపు దేశాలలో పెరుగుతున్న నిరుద్యోగానికి బయటినుండి వస్తున్న కార్మికులను కారణంగా చూపుతున్నారు. దక్షిణాసియానుండి వలస వచ్చిన వారిపై జాతి వివక్షతను రుద్దుతూ , వారిపట్ల బ్రిటన్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.జర్మనీలో పాలకుల అండదండలతో నయా నాజీశక్తులు ఆసియా నుండి వలస వచ్చిన శ్రామికులపై దాడులు సాగిస్తున్నాయి. మూడవ ప్రపంచదేశాల శ్రామిక శక్తిని చౌకగా వినియోగించుకొని అమెరికా లాభాలు గడిస్తుండగా, తాము దానితో పోటీ పడలేకపోతున్నామంటూ యూరోపియన్ యూనియన్ వలసలను ప్రోత్సహిస్తున్నది. దీనిని దాచిపెట్టి నిరుద్యోగానికి వలస శ్రామికులనే కారణంగా చూపుతూ యూరపు ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. ఇటలీలో ఇటీవలి పరిణామాలు సామ్రాజ్యవాదపాలకుల దివాలాకోరు విధానాలను బయటపెడుతున్నాయి.
సోషలిష్టు శిబిరంగా వున్న దేశాలలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, పశ్చిమ యూరపులోని పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటూ ప్రచారం సాగించారు. కాగా రష్యాశిబిరం కూలిపోయి తూర్పు యూరపు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఆయా దేశాలనుండి ప్రజలు పని వెతుక్కుంటూ పశ్చిమ యూరపు దేశాలకు వలస వచ్చారు.అల్బేనియా, యుగోస్లావియా, రుమేనియా దేశాలనుండి వేలాదిమంది పడవలలో మధ్యధరా సముద్రంలో పయనించి ఇటలీ చేరుకున్నారు. వలసలు జరుగుతున్నాయని తెలిసికూడా చూసీచూడనట్లు ఉండి ఇటలీ పాలకులు వీటిని ప్రోత్సహించారు. కరెంటు, మంచినీరు సరఫరా లేని మురికివాడల్లో నివశిస్తూ అత్యంత హీనంగా జీవితాలు సాగిస్తూ అత్యంత నికృష్ట దోపిడీకి ఈ వలస శ్రామికులను ఇటలీ పాలకులు గురిచేసారు.
ఐరోపా ఖండం లోని ప్రజలంతా స్వేచ్ఛగా ప్రయాణించేలాగా చేయబడిన యూరోపియను చట్టానికి వ్యతిరేకంగా 2007 నుండి శ్రామికులపై భౌతిక దాడులకు పూనుకున్నారు. ఒక రుమేనియా వలస పౌరుడు ఒక ఇటలీ మహిళపై దాడి చేశాడన్న వదంతిని మీడియా ఎడతెగకుండా ప్రచారం చేసింది. అప్పటి ప్రతిపక్షంలోని ‘బెర్లుస్కోనీ ‘ అనే నాయకుడు విదేశీయులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా రుమేనియన్లకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. అతని పత్రిక కూడా “ సంచారుల దురాక్రమణ “ అనే శీర్షికతో ప్రచారం చేసింది. వీరి ప్రచారంతో రోమునగరమేయరు వాల్టరు వెల్ట్రోనీ గొంతు కలిపాడు.నగరంలోని నేరాలలో 75 శాతానికి రోమా ( రుమేనియా నుండి వచ్చినవారు ) లే కారణమని ప్రకటించాడు.వీరిని దేశం నుండి బహిష్కరించేందుకు చట్టం చేయమని పాండీ ప్రభుత్వాన్ని కోరాడు. ప్రభుత్వం 181 సంఖ్య డిక్రీని చేసింది. 5000 మంది లిష్టును తయారు చేసింది. తదనంతర ఎన్నికల్లో బెర్లుస్కోనీ ఎన్నికయ్యాడు. విదేశీయులని అరెష్టు చేసి కేసులు పెట్టారు.మాఫియా ముఠాలు ఆసిడ్ బాంబులతో దాడులు చేసింది. నేపుల్సు నగరంలోని చెత్త సమస్యకు వలనకారణమని, కనుక మురికివాడలను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. “ ఈ జిప్సీలను నిర్మూలించడంకంటే ఎలుకలను నిర్మూలించడం సులభం ” అని ప్రకటించారు.

Monday, June 9, 2008

నేపాల్ ప్రజలకు అభినందనలు

2008 మే 28 నుండి రాచరికాన్ని కూలద్రోసి , స్వతంత్ర , లౌకిక , ఫెడరల్ రిపబ్లిక్కుగా నేపాలు ఏర్పడడాన్ని సి.పి.ఐ. (ఎం.ఎల్.) కేంద్ర కమిటీ స్వాగతిస్తున్నది. ఈ పరిణామంతో ఫ్యూడలిజానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నేపాలు ప్రజలు సాగిస్తున్న పోరాటం ఒక నూతన దశకు చేరింది. ఈ పోరాటం కొనసాగుతుందని ఆకాంక్షిద్దాం.