Tuesday, June 8, 2010

కె.జి. బేసిన్ గ్యాసు ధర

ప్రజల పై భారం మోపి ఉన్నత వర్గాలకు లాభం
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు కేజి బేసిన్ నండి ఉత్పత్తి అవుతున్న సహజ వాయువుపై అంబానీ సోదరుల తగవును సుప్రిం కోర్టు తీర్చింది. జాతీయ అన్వేషణ ,లైసెన్సు విధానం పత్రాల ఆధారంగా గ్యాసు కేటాయింపు, ధర నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే నని తీర్పు ఇచ్చింది. గ్యాసు సరఫరా ధరకు సంబంధించి అన్నదమ్ములు చేసుకున్న ఒప్పందం చెల్లదనీ, కుటుంబ సమస్యగా చర్చించుకుని ఉభయతారకంగా పరిష్కరించుకోమని చెప్పింది. RIL అందించిన తప్పుడు లెక్కల ఆధారంగా మంత్రుల బృందం యునిట్ రేటును 4.2 డాలర్లు గా నిర్ణయించింది.
సుప్రీం కోర్టు తీర్పు రాగానే 4.2 డాలర్ల రేటుకు RILనుండి 181 లక్షల యూనిట్లను కొనుగోలు చేయడానికి ప్రభుత్వరంగ సంస్థ అయిన NTPC కొత్త ఒప్పందాన్ని చేసుకుంది. అప్పటివరకూ ప్రభుత్వరంగ సంస్థలైన ONGC, INDIAN OIL LTDలు ప్రభుత్వం నిర్ణయించిన 1.8 డాలర్ల రేటు చొప్పున వినియోగదారులకు గ్యాసును సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నాయి.. పై నిర్ణయం ప్రకారం వారికి కూడా 4.2 డాలర్ల రేటుతో అమ్ముకోవడానికి అనుమతి యిచ్చింది. వాస్తవంగా కేజి బేసిన్ లో గ్యాసు ఉత్పత్తి ఖర్చు యూనిట్ కు 1.28 డాలర్లు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ తెలిపాడు. ఈ లెక్కన ఎంతలేదన్నా యూనిట్టుకు 2 డాలర్ల లాభం రిలయన్సుకి వస్తుంది. ఇది ఉత్పుత్తి ఖర్చు రెట్టింపుకన్నా ఎక్కువే.
బిజినెస్ స్టాండర్డ పత్రిక అంచనా ప్రకారం (21-5-2010) గ్యాసు ధర పెంచినందువల్ల ఓ.యన్.జి.సి. కి ఆదాయం 6000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఆయిల్ ఇండియా ఆదాయం 350-800 వరకూ పెరుగుతుంది. పైపులైను ద్వారా గ్యాసుని భారత దేశానికి తరలించి యూనిట్ 3 డాలర్లకు ఇస్తామని ఇరాన్ ప్రతిపాదిస్తే ఐదేళ్ళు సాగలాగి తిరస్కరించారు. దానిని సమర్ధించిన నాయకుడిని కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించారు. దేశంలో లభిస్తున్న గ్యాసుకు 4.2 డాలర్ల రేటును ఉదారంగా ఇచ్చారు. ఇదంతా రిలయన్సు కంపెనీకి బాగా లాభాలు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతిచ్చింది.
గ్యాసు ధర పెంచడానికి ప్రభుత్వం అనుమతించిందిగనుక వినియోగదారులకు ఇప్పుడు కేజి 21 రూపాయలకు అమ్ముతున్న గ్యాసును ఇకపై బహుశా 28 రూపాయలుగా పెంచవచ్చు .రవాణా రంగానికి అమ్ముతున్న గ్యాసును కెజి 35 రూపాయలకు విజయవాడలో అమ్ముతున్నారు. ఈలెక్కన అది 50 రూపాయలు పెంచవచ్చు. రవాణా చార్జీలు పెంచడం ద్వారా ఇది ప్రజలపై పడే భారమే.