Tuesday, April 7, 2009

సృష్టివాదం – పరిణామవాదం ల గురించి కారల్ మార్క్స్ విశ్లేషణ – 6

హెగెల్ యొక్క సక్రమ ధర్మతత్వం పై మార్క్స్ రాసిన విమర్శనాయుత పరిశీలన 1844 లో ప్యారిస్ లో ప్రచురింపబడింది. ‘ మతంపై మార్క్సిస్టు విమర్శనాయుత పరిశీలనకు మగ్నాకార్టా ( హక్కుల పత్రం ) ’ గా ఈ రచనను పిలుస్తారు. ఇందులో మార్క్స్ ‘ మనిషి మతాన్ని తయారు చేస్తాడు. మతం మానవుడ్ని తయారు చేయదు. మతం అంటే తన యొక్క తనం నుండి తాను ఇంకా విజయం పొందని మనిషి లేదా అప్పటికే తనయొక్క తనాన్ని తాను మరోసారి పోగొట్టుకున్న మనిషి యొక్క ఆత్మ చైతన్యం మరియు ఆత్మ గౌరవం. అయితే మనిషి ప్రపంచానికి బయట గొంతు కూర్చొని ఉన్న నైరూప్యమైన జీవి కాదు. మనిషి, మానవుని యొక్క , రాజ్యం యొక్క సమాజం యొక్క ప్రపంచానికి చెందిన వాడు. ఈ రాజ్యమూ , సమాజమూ మతాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మతం ప్రపంచము యొక్క విలోమ చైతన్యం. ఎందుకంటే అవి ఒక విలోమ ప్రపంచం....... మతం మానవ సారాంశం యొక్క వింతైన ( అసహజ ) వాస్తవికత. ఎందుకంటే మానవ సారాంశం ఏవిధమైన నిజ వాస్తవికతనూ సముపార్జించలేదు గనుక. అందువలన మతానికి వ్యతిరేకంగా పోరాటం అంటే పరోక్షంగా మత సుగంధం గల ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వ్యతిరేక పోరాటం.
మతపరమైన వ్యధ అంటే వాస్తవమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ. అదే సమయంలో నిజమైన వ్యధకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేయడం. మతం అణచబడ్డ జీవియొక్క నిట్టూర్పు; హృదయం లేని ప్రపంచం యొక్క హృదయం. ఆత్మ లేని పరిస్తితుల యొక్క ఆత్మ. ఇది ప్రజల యొక్క నల్లమందు ‘ అంటూ ప్రకటించాడు.
ఆ రకంగా ఇక్కడ మతాన్ని ‘ నిజమైన వ్యధ యొక్క వ్యక్తీకరణ ’ అంటూ ‘ అణచిపెట్టబడిన వారికి ఒక అవసరమైన దు:ఖోపశమనం ’ అంటూ మార్క్స్ మతం పట్ల ఒక నిజమైన సానుభూతిని చూపించాడు. అణచిపెట్టబడిన వారిని , సంపన్నుల మాదిరిగా నల్లమందు లాంటి దు:ఖోపశమనాలు అందుబాటులో ఉండవు. విలోమంగా ఉన్న ప్రపంచానికి విలోమంగా ఉన్న ప్రపంచానికి వింతైన ( అద్భుతావహమైన ) వ్యక్తీకరణగా ఉన్న మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడాన్ని అణచిపెట్టబడ్డవారు ఇంకా నేర్చుకోలేదు. స్కూలు పరీక్ష కోసం రాసిన ‘ క్రీస్తుతో విశ్వాసం గలవారి సంలీనం ’ అన్న తన వ్యాసంలో తాను తీసుకున్న వైఖరికి పూర్తిగా వ్యతిరేకమైన వైఖరిని తీసుకున్న కార్ల్ మార్క్స్ ‘ భ్రమాపూర్వకమైన ఆనందాన్ని ప్రజలకు ఇచ్చి మతాన్ని రద్దు చెయ్యాలన్నది , ప్రజల యొక్క వాస్తవమైన ( పాదార్ధిక ) ఆనందం కోసం చేసే డిమాండ్ ’ అంటూ వాదించాడు.
ఈ రకంగా వాదించిన కార్ల్‌ మార్క్స్ ‘ క్రైస్తవ మతానికి హేతువుతో సఖ్యపడడం కుదరదు. ఎందుకంటే ‘ లౌకికతత్వం ’, ’ ఆధ్యాత్మికతలు ’ ఒకదానిని మరొకటి పూర్తిగా వ్యతిరేకించుకుంటాయి ’ అంటూ ఆయన తన మత ధర్మశాస్త్రపు , సృష్టి పథకం యొక్క వాదాలను నిశితంగా విమర్శించాడు.
‘ విలోమ ప్రపంచానికి ’ సాధారణ సిద్ధాంతం గానూ, విజ్ఞాన సర్వస్వ సారాంశం గానూ ఉన్న మతాన్ని విమర్శనాయుతంగా పరిశీలించటమన్నది, ఆ విలోమ ప్రపంచాన్ని విస్తృతంగా విమర్శనాయుత పరిశీలన జరపడానికి మొదటి మెట్టు అవుతుందని మార్క్స్ భావించాడు.
‘ స్వర్గం పై చేసిన విమర్శ , భూమియొక్క విమర్శ పైకి మళ్ళుతుంది. మత ధర్మశాస్త్రం పై విమర్శ రాజకీయ శాస్త్ర విమర్శకు మళ్ళుతుంది. అందువలన మతంపై విమర్శనాత్మక పరిశీలనే తత్వశాస్త్రాన్ని, విజ్ఞానశాస్త్రాన్నిసాధ్యం చేసింది ’ అని మార్క్స్ తెలియజేశాడు.
ఈరకంగా ఆయన స్వర్గంపై చేసిన విమర్శ , భూమిపై విమర్శకు మళ్ళింది.

No comments: