Sunday, June 15, 2008

మానవీయ సహాయం పేరిట ఆధిపత్య రాజకీయం

2008 మే 3వ తేదీన తుఫాను నర్గీన్ మయాన్మార్ పై విరుచుకపడింది.-28458 మంది మృతి చెందారని , 33416 మంది జాడ తెలియడంలేదని అధికార ప్రకటన తెలుపుతుండగా అనధికారిక అంచనా ప్రకారం 20 లక్షలమంది నిర్వాసితులయ్యారు. కూడూ,గూడూ,మంచినీరు, ఔషధాలు లేక అల్లాడుతున్నారు. కాగా ఐక్యరాజ్యసమితి మానవవ్యవహారాల సమితి మృతుల సంఖ్య 64వేల నుండి లక్ష మధ్యన వుండవచ్చనీ, 2 లక్షల 20 వేల మంది జాడ తెలియడం లేదని తెలుపుతూ, ఆహారం, నీటి కొరతవల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తి హింసాకాండ చెలరేగవచ్చని భయాన్ని వ్యక్తం చేసింది.
తుఫానుకు తీవ్రంగా గురైన ఐరావతి నది డెల్టా పల్లపు ప్రాంతమే కాక, ఉపనదులూ, కాలవలతో కూడివుంది. రోడ్డు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పడవలు, హెలీకాఫ్టర్లు మాత్రమే ఆప్రాంతానికి చేరగలుగుతున్నాయి. ఆహారాన్ని చేరవేస్తున్న రెడ్ క్రాస్ వారి పడవ ఒకటి నదిలో మునిగిపోయిందంటే సహాయ కార్యక్రమాల నిర్వహణ ఎంత కష్టతరంగా ఉందో అర్ధమౌతుంది. చాలా పరిమితంగా సహాయం అందుతుంది. లబుట్టా పట్టణంలో 117 శిబిరాలలో, 150000 మంది శరణార్ధులుగా ఉన్నారు. వీరికి మాత్రం సహాయం అందజేయగలిగారు.
బర్మాలోని సైనిక పాలకులు తగిన విధంగా సహాయం అందించలేక పొయ్యారు. పేదదేశం, వనరులకొరత వంటి కారణాలతోపాటు సహాయ చర్యలు తీసుకోవడంలో సైన్యం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించింది. దీనినానరాగా తీసుకొని అమెరికా నిందాప్రచారం ప్రారంభించింది. అంతర్జాతీయ సమాచార వ్యవస్థ మన్మయార్లో జరిగిన భీభత్సాన్ని పదే పదే ప్రచారం చేశాయి. లక్షలాది ప్రజలు ఏదిక్కూలేకుండా పోతున్నారని కన్నీరు కార్చింది. మన్మయార్ పాలకులు సహాయమందించరనీ, ప్రపంచ మానవాళే మన్మయార్ ప్రజలను ఆదుకోకుంటే ఒక మానవ సంక్షోభం ఏర్పడుతుందనీ ప్రచారం చేసింది.’టైమ్స్ ’ పత్రికయితే ‘ బర్మా ఆక్రమణకు సమయమిదేనా ? ’ అని ప్రశ్నించి మానవీయ సహాయమందించడానికి ఆక్రమణే సరైన చర్య అని తేల్చింది. అయితే ప్రపంచ దేశాలు దీనిపై ఒక నిర్ణయానికి రావాలి. అలా వచ్చేసరికి సమయం మించిపోతుంది అంటూ కలరా వచ్చాక జనం చనిపోతే సైనిక జోక్యం చేసుకోవడానికి కారణం దొరుకుతుందంటూ వ్యాసాన్ని ముగించింది.
అమెరికా మంత్రిణి కండోలెస్సారైస్ “ప్రపంచ దేశాలు సహాయ మందించడాన్ని బర్మా ప్రభుత్వం అంగీకరించాలి. ఇవి రాజకీయాలు కావు. మానవ సంక్షోభ సమస్య ” అంది. 35 లక్షల డాలర్లను సహాయంగా ప్రకటించింది. అయితే ప్రకటించకుండా విధించిన షరతులేమంటే అమెరికా నావికా సైన్యం తన స్వంత యుధ్ద నౌకలతో , సైనికులతో మన్మయారుకు వెళ్ళి తానే స్వయంగా సహాయమందించడానికి మన్మయార్ ప్రభుత్వం అంగీకరించాలట. సహజంగానే మన్మయార్ ప్రభుత్వం దీనిని తిరస్కరించింది. వస్తురూపంలో సహాయమందజేస్తే తాను తన దేశ ప్రజలకు ఆందజేస్తానని , ఐ.రా.స. గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలను అనుమతిస్థానని, విదేశీ సైనికులను అనుమతించనని స్పష్టం చేసింది.
గతంలో సునామీకి గురైన దేశాలన్నీ మన్మయార్ లాగా పేదదేశాలే. బాధితులకు సహాయమందించడంలో చాలా లోపాలు జరిగాయి. బాధితులకు సహాయమందించే, సహాయసంస్థలు వేటినీ ఇండోనేషియా సైన్యం ఆ ప్రాంతంలోకి రానివ్వలేదు. తమ ద్వీపానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడుతున్న అసెసిస్ తిరుగుబాటుదారులను ( సునామీకి గురై కష్టాలలో ఉన్నవారిని ) నిర్మూలించేందుకు అవకాశంగా వాడుకుంది. అయినా ఇండోనేషియా ప్రభుత్వం అమెరికా కనుసన్నలలో నడుస్తోందిగనుక ఆనాడు “ మానవ సంక్షోభం ” అనేది అమెరికాకు కన్పించలేదు.
అలాగే సునామీకి గురైన తమిళ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను కలిసి నిర్వహిద్దామని శ్రీలంక ప్రభుత్వానికి ఎల్టీటీఈ ప్రతిపాదించింది. అలా చేస్తే ఎల్టీటీఈని అధికారికంగా గుర్తించినట్లవుతుందని శ్రీలంక ప్రభుత్వం నిరాకరించడమేగాక , ఆ ప్రాంతంలో సహాయకార్యక్రమాలు నిర్వహించలేదు. అయినా అమెరికాకు “ మానవ సంక్షోభం ” కన్పించలేదు.
సునామీకి గురైన అండమాన్ నికోబార్ దీవులలో సహాయ కార్యక్రమాలను తానే నిర్వహించుకుంటానని, విదేశీ సైన్యాల సహాయమవసరంలేదని భారత ప్రభుత్వం అన్నా అమెరికా పాలకులకు కోపం రాలేదు. భారత సార్వభౌమత్వాధికారాన్ని కాదని అమెరికా సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న ప్రతిపాదనేదీ ఆనాడు ఎవ్వరూ చేయలేదు. కానీ ఇండోనేషియా, శ్రీలంకల మీద తీవ్ర వత్తిడితెచ్చి, అమెరికా సైన్యం ప్రవేశానికి ఆమోదం పొందారు. ఆయా దేశాల సైన్యాలతో కలసి అక్కడి తిరుగుబాటుదారులను అణచడంలో సహాయపడే లక్ష్యంతో ఇది జరిగింది.
ప్రాన్సు,బ్రిటన్లు అమెరికాతో కలిసాయి. ఐరాస తన అధికారాలను వినియోగించుకొని బర్మా ప్రభుత్వం అంగీకరించినా లేక తిరస్కరించినా మాసైన్యాలు బర్మాలో సహాయమందిచేలా తీర్మానం చెయ్యాలని భద్రతామండలిని ప్రెంచి విదేశాంగశాఖామంత్రి కోరాడు.బర్మాకు వచ్చే విదేశీసహాయాన్నంతా ఒక పధ్దతిగా అందించేందుకు ఆగ్నేయాసియా దేశాధినేతలు సమావేశమై , ఒక అంగీకారానికి వచ్చి తగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసారు. మానవీయ సహాయం , జోక్యం పేరిట అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని అమలు చేస్తుంది. తూర్పు తైమూరులోనూ, కొసావోలోసూ మానవీయ సహాయం పేరిట అది తీసుకున్న సైనిక చర్యలు లక్షలాది ప్రజలను మృత్యుజ్వాలలకు ఆహుతి చేసాయి. “ మేమింకా ఏకపక్ష సైనిక జోక్యాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వ్రజలకు మేమే సహాయం అందించాలని కోరుకొంటున్నాం ” అని ఫ్రెంచి విదేశాంగమంత్రి అన్నాడు. తమ మాట వినకుండా చైనాతో సంబంధాలు బలపర్చుకొంటున్న మన్మయార్ సైనిక పాలకులను తొలగించాలన్న లక్ష్యమే అమెరికా సామ్రాజ్య వాదులది. అంతే తప్ప మన్మయార్ ప్రజల కడగండ్లు గాని, ఆ ప్రజల ప్రజాస్వామ్య హక్కులపట్ల ప్రేమగాని సామ్రాజ్యవాదులకు లేదని, తుఫాను భీభత్సాన్నికూడా ఆధిపత్య ప్రయోజనాలకు వినియోగించుకోజూస్తున్న సామ్రాజ్యవాదుల వైఖరి తెల్పుతుంది.

3 comments:

Kathi Mahesh Kumar said...

చాలా సీరియస్ టాపిక్ కదిపారు. అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, కానీ అమెరికన్ల యావ జగద్విదితమే కదా!

vakumar07 said...

ఈ వ్యాసాన్ని జనశక్తి అనే పత్రిక నుండి కాపీ చేసాను సార్.
ఈ పత్రిక కమ్యూనిష్టులది. కనుక అమెరికా అంటే వ్యతిరేకంగా
వ్యాఖ్యానించి వుండవచ్చు. మీరు ఈ వ్యాసంలోని అభిప్రాయంతో
ఏకీభవిస్తున్నట్లుగా అనుకుంటున్నాను. మరి అమెరికా వారు
ఇలా ఎందుకు తప్పుపనులు చేస్తున్నారంటారు?

Kathi Mahesh Kumar said...

అమెరికన్లు చేస్తున్నది "తప్పు" కాదు. కేవలం ప్రపంచ నేతగా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది.అంతే!