Thursday, June 12, 2008

జాతి వైషమ్య రాజకీయాల అసలు రూపం

తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన సామ్రాజ్యవాదులు సంక్షోభ భారాన్ని ప్రజలపై మోపేందుకు ( కార్మికులను పనిలోనుండి తొలగించడం, పన్నుల పెంపు, సంక్షేమ చర్యలలో కోత మొదలగునవి ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూనే అసలు సమస్యల నుండి ప్రజల చూపు మళ్ళించేందుకు జాతి వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. జాతివైషమ్యాలను సాకుగాచూపి ప్రజలను అణిచివేసే నిరంకుశాధికారాలను పొందుతున్నారు. యూరపు దేశాలలో పెరుగుతున్న నిరుద్యోగానికి బయటినుండి వస్తున్న కార్మికులను కారణంగా చూపుతున్నారు. దక్షిణాసియానుండి వలస వచ్చిన వారిపై జాతి వివక్షతను రుద్దుతూ , వారిపట్ల బ్రిటన్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు.జర్మనీలో పాలకుల అండదండలతో నయా నాజీశక్తులు ఆసియా నుండి వలస వచ్చిన శ్రామికులపై దాడులు సాగిస్తున్నాయి. మూడవ ప్రపంచదేశాల శ్రామిక శక్తిని చౌకగా వినియోగించుకొని అమెరికా లాభాలు గడిస్తుండగా, తాము దానితో పోటీ పడలేకపోతున్నామంటూ యూరోపియన్ యూనియన్ వలసలను ప్రోత్సహిస్తున్నది. దీనిని దాచిపెట్టి నిరుద్యోగానికి వలస శ్రామికులనే కారణంగా చూపుతూ యూరపు ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు. ఇటలీలో ఇటీవలి పరిణామాలు సామ్రాజ్యవాదపాలకుల దివాలాకోరు విధానాలను బయటపెడుతున్నాయి.
సోషలిష్టు శిబిరంగా వున్న దేశాలలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, పశ్చిమ యూరపులోని పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటూ ప్రచారం సాగించారు. కాగా రష్యాశిబిరం కూలిపోయి తూర్పు యూరపు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఆయా దేశాలనుండి ప్రజలు పని వెతుక్కుంటూ పశ్చిమ యూరపు దేశాలకు వలస వచ్చారు.అల్బేనియా, యుగోస్లావియా, రుమేనియా దేశాలనుండి వేలాదిమంది పడవలలో మధ్యధరా సముద్రంలో పయనించి ఇటలీ చేరుకున్నారు. వలసలు జరుగుతున్నాయని తెలిసికూడా చూసీచూడనట్లు ఉండి ఇటలీ పాలకులు వీటిని ప్రోత్సహించారు. కరెంటు, మంచినీరు సరఫరా లేని మురికివాడల్లో నివశిస్తూ అత్యంత హీనంగా జీవితాలు సాగిస్తూ అత్యంత నికృష్ట దోపిడీకి ఈ వలస శ్రామికులను ఇటలీ పాలకులు గురిచేసారు.
ఐరోపా ఖండం లోని ప్రజలంతా స్వేచ్ఛగా ప్రయాణించేలాగా చేయబడిన యూరోపియను చట్టానికి వ్యతిరేకంగా 2007 నుండి శ్రామికులపై భౌతిక దాడులకు పూనుకున్నారు. ఒక రుమేనియా వలస పౌరుడు ఒక ఇటలీ మహిళపై దాడి చేశాడన్న వదంతిని మీడియా ఎడతెగకుండా ప్రచారం చేసింది. అప్పటి ప్రతిపక్షంలోని ‘బెర్లుస్కోనీ ‘ అనే నాయకుడు విదేశీయులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా రుమేనియన్లకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. అతని పత్రిక కూడా “ సంచారుల దురాక్రమణ “ అనే శీర్షికతో ప్రచారం చేసింది. వీరి ప్రచారంతో రోమునగరమేయరు వాల్టరు వెల్ట్రోనీ గొంతు కలిపాడు.నగరంలోని నేరాలలో 75 శాతానికి రోమా ( రుమేనియా నుండి వచ్చినవారు ) లే కారణమని ప్రకటించాడు.వీరిని దేశం నుండి బహిష్కరించేందుకు చట్టం చేయమని పాండీ ప్రభుత్వాన్ని కోరాడు. ప్రభుత్వం 181 సంఖ్య డిక్రీని చేసింది. 5000 మంది లిష్టును తయారు చేసింది. తదనంతర ఎన్నికల్లో బెర్లుస్కోనీ ఎన్నికయ్యాడు. విదేశీయులని అరెష్టు చేసి కేసులు పెట్టారు.మాఫియా ముఠాలు ఆసిడ్ బాంబులతో దాడులు చేసింది. నేపుల్సు నగరంలోని చెత్త సమస్యకు వలనకారణమని, కనుక మురికివాడలను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. “ ఈ జిప్సీలను నిర్మూలించడంకంటే ఎలుకలను నిర్మూలించడం సులభం ” అని ప్రకటించారు.

No comments: