Tuesday, March 17, 2009

సృష్టివాదం – పరిణామవాదం -2

స్వర్గాన్ని గురించిన విమర్శనాత్మక పరిశీలన:
మార్క్స్ యూదు – లూథరన్ . దేముడున్నాడు కానీ అందుకు శృతి ప్రమాణం అక్కరలేదనే డీయిస్టు మత విశ్వాస వారసత్వం గలవాడు. అతని మాతా, పితాహులిద్దరూ ట్రయల్ పట్టణ శాఖకు చెందిన యూదు మత పండితులు , పురోహితులు. అతడి తండ్రి హెన్రిక్ మార్క్స్ 1817లో మార్క్స్ పుట్టటానికి ముందు కాలంలో లూథరన్ మతం లోకి మారాడు. ఆరకంగా లూథరన్ మతం లోకి మారకపోతే ఆయన ఆనాడు తన న్యాయవాద వృత్తి కొనసాగించడానికి వీలు లేకుండ ప్రష్యన్ ప్రభుత్వం నిషేధించి వుండేది. కార్ల్ మార్క్స్ యొక్క కాబోయే బావగారు అయిన ఎడ్గార్ వాన్ వెస్ట్ ఫాలెన్ మార్క్స్ తండ్రి హెన్రీ మార్క్స్ ను ‘ లెస్సింగ్ తరహా ప్రొటెస్టెంట్ ’ అని , మిక్కిలి భక్తి భావం గల డీయిస్టు గా మార బోతున్నాడనీ వివరించాడు. హెన్రీ మార్క్స్ జ్ఞానాన్ని పొందే వైఖరిని ఆశ్రయించాడనీ , వోల్టర్ రూసోల రచనలను కంఠతా పట్టి అప్పగించ గలిగే వాడనీ, తన కుమారుడైన కారల్ మార్క్సును “ సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడ్ని ప్రార్ధించవలసింది ” గానూ “ న్యూటన్ , లోకే, లీబ్నిజ్ ల విశ్వాసాలను అనుసరించమనీ ” కోరాడని తెలియజేశాడు. మార్క్సు తల్లి హెన్రిట్టా మతవిశ్వాసాలను గురించి వివరంగా తెలియదు. ఆమె ఎక్కువ మేరకు యూదు మత విశ్వాసాల పట్ల మొగ్గు చూపించింది. ఇందుకు కారణం ఆమెకు తల్లిదండ్రుల పట్ల నమ్రతాభావం. తన తండ్రి మరణించిన అనంతరం, కార్ల్ మార్క్స్ పుట్టిన ఒక సంవత్సరం అనంతరం ఆమె 1825 లో లూథరన్ క్రైస్తవ మతంలోకి మారి బాప్తీసాన్ని పొందింది. కార్ల్ మార్క్స్ తనకు భవిష్యత్తులో మామగారు కాబోయే బేరన్ లుడ్విగ్ వాన్ వెస్ట్ ఫాలెన్ సంరక్షణలోకి వెళ్ళాడు. ఆయనే మార్క్ కు చిన్నతనంలోనే ఊహాజనిత సోషలిస్టు అయిన సెయింట్ సైమన్ యొక్క భావాలను పరిచయం చేశాడు.
మార్క్స్ ‘ ఫెడరిక్ విల్హెమ్ జిమ్నాషియం ’ ట్రైర్ అనే పట్టణం లో గల హైస్కూలులో చదువుకున్నాడు. అది ఒక ‘ జేసూట్ ’ అనే క్రైస్తవ మత శాఖ కు చెందిన పాఠశాల. ఇందులో ఐదింట నాలుగు వంతుల మంది విద్యార్ధులు కేథలిక్కులే. మార్క్స్ తన 17 వ ఏట అంటే 1835లో ఉన్నత పాఠశాలలో చదువు పూర్తి చేసే పరీక్షలో భాగంగా 3 వ్యాసాలు రాయాల్సి వచ్చింది. అందులో ఒక వ్యాసం మత విషయాలకు సంబంధించినది. ఆయన “ జాన్ 15: 1 -14 ప్రకారం క్రీస్తులో మత విశ్వాసులు సంలీనమవటం – అందుకు గల ప్రాతిపదిక – సారాంశం , దాని పరిపూర్ణ ఆవస్యకత , ప్రభావాలు “ అన్న అంశం పై వ్యాసం రాశాడు. ఈ వ్యాసంలో ఆయన లూథరన్ శాఖ యొక్క త్రిమూర్తులకు చెందిన – క్రీస్తుతో సంలీనం కావాల్సిన ఆవస్యకతను గురించి చెబుతూ , అది చరిత్ర యొక్క లక్ష్యం అన్న వాదనను చేపట్టాడు. ఆయన తన వ్యాసాన్ని “ క్రీస్తుతో సంలీనం అన్నది ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి ఆనందాన్నే ఎపికురస్ వాదనా విధానం తనయొక్క అల్పమైన తత్వశాస్త్రం నుండి లేదా మరింత దాగిఉన్న లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని ఆలోచించే వారి జ్ఞానం నుండి పొందటం కోసం నిస్ఫలమైన వృధా ప్రయాస చేస్తోంది ” అంటూ ముగించాడు. అంతకు ముందుగానే ఆయన క్రీస్తుకు విరుద్ధంగా ఎపిక్యూరస్ వాదులను నిలబెట్టి తన వాదనను కేంద్రీకరించడాన్ని బట్టి చూస్తే, తన యవ్వన దశలోనే మార్క్స్ ఎపకరస్ యొక్క భౌతిక వాదం పైన, పథకం ప్రకారం సృష్టి అన్న విషయం యొక్క విమర్సనాయుత పరిశీలన పైన ఆసక్తి పెంచుకొన్నాడనీ , అందువల్లనే ఆయన 6 సంవత్సరాల అనంతరం డాక్టరేటు కోసం రాసిన వివరణాత్మక చర్చా వ్యాసంలో గతంలో తాను ఎపిక్యూరస్ పట్ల తీసుకున్న వైఖరికి పూర్తి ప్యతిరేకమైన వైఖరి తీనుకొని “ పధకం ప్రకారం సృష్టి ” అన్న విషయంపై విమర్శనాయుత పరిశీలనా వైఖరి చేపట్టాడని మనకు అర్ధమౌతుంది. మార్క్స్ తన పాఠశాల వ్యాసం ( మతం గురించి ) రాసిన కాలంలోనే ‘ డేవిడ్ స్ట్రాస్ ’ తన క్రీస్తు జీవితేం అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ గ్రంథం వల్లనే మార్క్స్ మతాన్ని హెగేలియన్ పథ్థతిలో విమర్శనాయుతంగా పరిశీలన ప్రారంభించడానికి కారణమైంది. ( సరీగ్గా ఇదే కాలంలో జర్మనీలో రైల్వేలు ప్రవేశపెట్టబడ్డాయి. )

No comments: