Friday, March 13, 2009

సృష్టివాదం – పరిణామవాదం -1

ఇటీవలికాలంలో సృష్టివాద ( భగవత్ సృష్టివాద ) సమర్ధకులు , ‘ తెలివైన సృష్టి ‘ వాద ఉద్యమపు ముసుగులో పరిణామవాద సిద్ధాంతాన్ని అమెరికన్ పబ్లిక్ స్కూళ్ళలో బోధించడానికి వ్యతిరేకంగా తమ దాడిని ముమ్మరం చేశారు. వీరు ‘వెడ్జ్ స్ట్రాటజీ ‘ అనబడే ‘వేరుపరచే వ్యూహం ‘ ద్వారా సమాజమంతటా విజ్ఞానశాస్త్రాన్ని, సంస్కృతినీ మార్చివేసే లక్ష్యంతో ఉన్నారు. క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి భగవత్ సృష్టివాదానికీ – భౌతికవాదానికీ మధ్యా, విజ్ఞానశాస్త్రానికీ – తెలివైన సృష్టికీ మధ్యా చర్చ సాగుతూనేవుంది. ఒక పధకం ప్రకారం ప్రకృతి సృష్టించబడిందనటానికి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయనీ, అందువలన ఒక సృష్టికర్త ఉన్నాడనే వాదన క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నాటి , సోక్రటీసు కాలం నుండీ వాదించబడుతుంది. అందుకు వ్యతిరేకమైన భౌతికవాదన అంటే ప్రపంచాన్ని దానియొక్క స్వలక్షణాల పైననే – భౌతిక పరిస్తితుల, సహజసూత్రాల, అనిశ్చితత్వం, అత్యావశ్యకమైన దృగ్విషయాలపై ఆధారపడి సాగుతుంది తప్ప – అతీత శక్తి వలన ఏర్పడి సాగటల్లేదు అనే వాదన కూడా క్రీస్తు పూర్వపు 5వ శతాబ్దం నుండీ వాదించబడుతోంది. అణువాదులైన ల్యూపిప్పస్, డెమోక్రటస్ ల రచనల్లో ఈ భౌతికవాదం మొదలైంది. తర్వాతి కాలంలో క్రీస్తు పూర్వపు 3వ శతాబ్దంలో కోపిర్నకస్ ఈ భౌతికవాదాన్ని తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టివాదంపై పూర్తిస్తాయి తాత్విక విమర్శనాత్మక పరిశీలనను అభివృద్ధి పరచాడు. ఆధునిక కాలంలో డార్విన్, మార్క్స్, ఫ్రాయిడ్ లు ‘ తెలివైన సృష్టి లేదా పథకం ప్రకారం సృష్టి ‘ అన్న వాదాన్ని భౌతికవాదంతో వ్యతిరేకించి ఖండించారు. అందువల్లనే నేటి ఆధునిక కాలపు ‘ తెలివైన సృష్టి వాద ‘ ఉద్యమకారులకు వీరు ప్రధాన శతృవులయ్యారు.
బయోమెడికల్ పరిశోధనా రంగంలో విశిష్టమైన సంస్థలు వున్న , బయో టెక్నాలజీ పరిశ్రమలు వర్ధిల్లుతున్న అమెరికాలో , ఆధునిక శాస్త్ర విజ్ఞానము జన్యు నిర్మాణ రహస్యాలను ఛేదించి డార్విన్ పరిణామవాద దృక్పధాన్ని బలపరుస్తున్న ఈరోజుల్లో అమెరికా దేశంలోనూ, బ్రిటన్ లోనూ డార్విన్ పరిణామవాదానికి వ్యతిరేకత మరింతగా పుంజుకుంటూ ఈ శాస్త్రీయమైన పరిణామ వాదాన్ని పాఠశాలల్లో బోధించరాదనే ధోరణులు ప్రబలుతూ , పరిణామవాద శాస్త్ర విజ్ఞాన బోధనలపై పలు ఆంక్షలను విధించే చట్టాలు చేయబడుతున్నాయి. 1925 అనంతర కాలం లోనే అమెరికా సుప్రీంకోర్టు “ పబ్లిక్ స్కూళ్ళ వ్యవస్థలో సృష్టి వాదాన్ని బోధించడమన్నది రాజ్యాంగ విరుద్ధం ” అంటూ తిరస్కరించినా మూడేళ్ళ క్రితమే పెనిసిల్వేనియా రాష్ట్రంలో ఒక ఫెడరల్ కోర్టు జడ్జి ‘తెలివైన సృష్టి ‘ వాదాన్ని , దానిని స్కూళ్ళలో బోధించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కొట్టివేస్తూ “ ఈ తెలివైన సృష్టి వాదం అన్నది సృష్టివాదం యొక్క బిడ్డే తప్ప వేరొకటి కాదు ” అని వ్యాఖ్యానించినా, అమెరికాలోని పబ్లిక స్కూళ్ళలో సృష్టివాదాన్న బోధించడానికీ పరిణామవాదానికి వక్రభాష్యం చెప్పడానికీ వివిధ రాష్ట్రాలలో చట్టాలు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.
బ్రిటన్ దేశంలోని రాయల్ సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో డైరెక్టర్ గా ఉన్న ప్రొఫెసర్ రీస్ – పబ్లిక్ స్కూళ్ళలో సృష్టివాదం బోధించాన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడడాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేయడమే కాక – ఒకవేళ క్లాసులో సృష్టివాదం గురించి ఉపాధ్యాయులు లేవనెత్తదలుచుకుంటే వారు ‘సృష్టివాదం‘ ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రం‘ కాదో .. ‘పరిణామవాదం‘ ఏవిధంగా ‘విజ్ఞానశాస్త్రమో‘ విద్యార్ధులకు వివరించాలి – అంటూ ప్రతిపాదించాడు.
2009, ఫిబ్రవరి 12 నాటికి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ కు 200 సంవత్సరాలు నిండుతాయి. ఆయన రాసిన ‘జీవుల పుట్టుక ‘ రచనకు కొద్ది నెలల్లోనే 150 సంవత్సరాలు నిండుతుంది. ఇవి విజ్ఞానాన్వేషుల్లో ఉద్వేగం నింపే సందర్భాలు.
ప్రస్తుత తరుణంలో సృష్టివాదం – పరిణామవాదముల గురించి కారల్ మార్క్స్ చేసిన విమర్సనాత్మక పరిశీలన గురించి తెలుసుకోవడం అన్నది విజ్ఞాన అన్వేషకులకు ఉపయుక్తంగా ఉంటుంది.

No comments: