Monday, November 10, 2008

భైంసా, వటోలి ఘటనలు

ఆదిలాబాద్ జిల్లా భైంసా, వటోలి తదితర గ్రామాలలో 10.10.2008 నుండి జరిగిన మతఘర్షణలు , పోలీసు కాల్పులు, సజీవదహనాలు, సమాధుల కూల్చివేతలు, తదితర పరిస్థితులను రాష్ట్రనాయకులు కోటయ్యగారి నాయకత్వాన ఒక పరిశీలనాబృందం 16.102008న వెళ్ళి పరిశీలించింది. కర్ఫ్యూ నీడలోనే వివిధరకాల ప్రజలను కలిసింది. భైంసాకి దగ్గరలోని వాలేగాం అనే గ్రామంలో కూల్చివేయబడిన మసీదులను పరిశీలించింది. వటోలి అనే గ్రామంలో అమానుషంగా హత్య చేయబడి సజీవదహనం చేయబడిన మహబూబ్ ఖాన్ ఇంటిని పరిశీలించి గ్రామపెద్దలతో చర్చించింది.

భైంసా ప్రాంతం 1992-96 మతఘర్షణలు రీత్యా సున్నితమైన ప్రాంతం . 10-10-2008, ఆతర్వాత జరిగిన ఘటనల క్రమం ఇలావుంది.

10-10-08 మధ్యాహ్నం 2.45ని. లకు భైంసా పట్టణంలోని పంజేషహ జమా మసీదు ముందు నుండి వెళ్ళే రోడ్డు గుండా దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు సాగుతుంది. ఊరేగింపులో ముందుభాగంలో 30,40 మంది 20,25 సంవత్సరాల యువకులు మసీదు ప్రాంతం వచ్చేసరికి డప్పులూ, బ్యాండు వాయించడమేగాక మసీదుపై పసుపు చల్లారనీ దీనితో ఉద్రిక్తత ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కవ్వింపు చర్యలతో మసీదులో అప్పటికే ప్రార్ధన ముగించుకొని ఉన్న ముస్లిం యువకులు స్పందించడం, మసీదుపై రాళ్ళు పడడం, మసీదునుండి కూడా రాళ్ళు విసరడం జరిగింది. ఈ మొత్తం ఊరేగింపులో కేవలం నలుగురు పోలీసులు కేవలం ఊరేగింపు వెనుక నడుస్తూ వచ్చారు. 10వ తేదీ సా.2.45 నుండి 5 గంటలవరకూ వేగంగా జరిగిన పరిణామాలలో గృహదహనాలు, కత్తిపోట్లు, పోలీసు కాల్పులు జరిగాయి. మసీదు నుండి బస్టాండ్ వైపు సుమారు 127 దుకాణాలు తగలబడ్డాయి. మసీదు వెనుకగల ముస్లీముల ఇండ్లకు నిప్పుఅంటించబడింది. తగలబడుతున్న ఒక ఇంటిలోని ముస్లీం కుటుంబం వెనుకనున్న మట్టిగోడను పగులగొట్టుకొని బయటికి రావడానికి సహాయపడి వారిని కాపాడింది కూడా హిందూ కుటుంబాలే. ప్రజలు మతత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇదోఉదాహరణ.

ఇళ్ళూ,దుకాణాలూ తగలబెడుతున్న గుంపు వైపు కాక దీనికి వ్యతిరేకంగా సమీకృతమౌతున్న ముస్లీముల వైపు పోలీసులు తుపాకులు కాల్చారని ముస్లీం పెద్దలు చెపుతున్నారు. ఈ కాల్పుల్లో మొదటి గుండుకి అబ్దుల్ ఖయ్యాం అనే 19 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. మరొక గుండుకి అబ్దుల్ సమీ అనే మరో యువకుడు మరణించాడు. (దుర్గామాత విగ్రహం పెట్టడంలో ముఖ్యపాత్ర వహించిన భైంసాలోని రాజీవ్ నగర్ కు చెందిన బూటాసింగ్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడు. ఈ విధంగా ఆరోజు జరిగిన ఘర్షణలో 25 మంది వరకూ గాయపడ్డారు.


భైంసా ఘటనలు జరిగాక భైంసా మండలంలోని వటోలి అనే గ్రామంలో 11వ తేదీ రాత్రి ఆగ్రామంలో వున్న ఒకే ఒక ముస్లీం కుటుంబం మహబూబ్ ఖాన్ ఇంటికి నిప్పు అంటుకుంది. మంటలు మండే సమయానికి ఇంటి వెనుక ఉన్న అమ్మవారి గుడివద్ద భజనలు జరుగుతున్నాయి. మంటలు కనబడగానే గ్రామ ఉపసర్పంచ్ జాదవ్ జగత్ రావు “ ఫైర్ సర్వీసుకి ఫోను చేశామనీ, వాళ్ళు వచ్చాక మంటలు ఆర్పారనీ, కరెంటూ, గ్యాసు స్టవ్వూ ఉంది కనుక ఎవరినీ మంటలు ఆర్పడానికి వెళ్ళవద్దని చెప్పామనీ, తెల్లవారి మహబూబ్ ఖాన్ బంధువులు వచ్చి చూస్తే ఇంటిలో మహబూబ్ ఖాన్, ఆయన భార్య, కూతురు రిజ్వానా , మరో ముగ్గురు చిన్నారులు మంటలలో కాలిపోయారని “ చెప్పాడు. వాస్తవానికి మహబూబ్ ఖాన్ కాలును కుక్కలు గ్రామం ప్రక్కన పొలాల్లోకి లాక్కొని వెళ్ళినట్లుగా పడి వుందని ఇంటివద్దనున్న పోలీసులు చెప్పారు. ఎత్తు తక్కువతో కేవలం మూడు గదులు , ముందు గది ఒక దుకాణంలాగా ఉండే చిన్న ఇల్లు మహబూబ్ ఖాన్ ది . మంచి దర్జీ అని అందువల్లనే గ్రామస్తులు పూర్వం ఆయన్ని ఆ గ్రామంలోకి పిలిపించుకొని నివసించమని కోరారట. మహారాష్ట్రకి చెందిన సైలేన్ బాబాన్ మహబూబ్ ఖాన్ భక్తుడు. గ్రామంలో ఎవరికి దడుపుజ్వరం వచ్చినా ఆయన వద్ద తాయత్తులు తీసుకుంటారు. ఆయన పెద్ద కొడుకు మిలిటరీలో ఉండి , చిన్న కొడుకు , ఇంకో కూతురు చదువుల నిమిత్తం దూరంగా ఉండటం వలన ఆకుటుంబంలో ముగ్గురే మిగిలారు. దేశభక్తి గురించి గొప్పగా చెప్పుకునే వారు, వారి అర్ధంలో దేశరక్షణ బాధ్యతల్లో ఉండి మిలిటరీలో ఉన్న ఒక మైనారిటీ మతానికి చెందిన కుటుంబం పట్ల ప్రదర్శించిన ‘ఔదార్యం’ ఇది. ఇపుడు మీడియాలో 1996 నాటి ఘర్షణల్లో మహబూబ్ ఖాన్ నిందితుడు అని ప్రచారం జరుగుతుంది. నిజంగానే మహబూబ్ ఖాన్ నిందితుడే అయితే అప్పటికి పుట్టని ఈ చిన్నారులు , మహిళలు ఏం నేరం చేశారు? మహబూబ్ ఖాన్ ఇంటి ముందూ వెనుకా ఇళ్ళున్నాయి. ఎవరికీ చిన్నపిల్లల అరుపులు సైతం వినబడలేదని అంటున్నారు.

అదే విధంగా భైంసా నుండి బాసర వెళ్ళే దారిలోని దేవాం గ్రామం ప్రక్కనే గల వాలేగాం గ్రామం – కేవలం 5-6 ముస్లీం కుటుంబాలు నివసిస్తున్న గ్రామం – మొత్తం 200 కుటుంబాల పైనే ఉండే గ్రామం – భైంసా ఘటనల అనంతరం ఆ గ్రామం లోని మసీదు ఒక అర్ధరాత్రి దాడికి గురైంది. మసీదు ప్రహరీగోడ , పైభాగం గోడలు పొడిచి కూల్చివేయబడ్డాయి. తలుపులు కాలబెట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలోని 6 ముస్లీం కుటుంబాలు భయంతో గ్రామం విడిచి పారిపొయ్యారు. అలాగే తానూరు మండలంలోని ఎవ్వి అనే గ్రామంలో ఇదే విధంగా మసీదు కూల్చివేయబడింది. ఈ విధంగా మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాలో , ఆదిలాబాద్ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయి. ధర్మాబాద్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శనను మసీదు ముందు నుండి తీసుకొని వెళ్ళేలా ప్రదర్శన దారిని మళ్ళించాలని ప్రయత్నించి నప్పుడు హిందూ, ముస్లీం పెద్దలు సమష్టిగా వ్యవహరించి నిరోధించారు. ఈవిధంగా 10వ తేదీనుండి వరుసగా కనబడుతున్న సంఘటనలు కాకతాళీయమైనవికావు. దీని వెనుక లోతైన వేళ్ళను తన్నుకొనజూస్తున్న ఒక విషవృక్షం ఉంది.

No comments: