Wednesday, November 19, 2008

మెట్రోరైలు ప్రాజక్టును రద్దు చేయాలి

హైదరాబాదు నగర ట్రాఫిక్కు నరకలోకానికి మరోపేరు.ట్రాఫిక్ జామ్ లలో చిక్కుకుపోయి ప్రయాణం సాగకపోవడం వాహనదారుల సమస్య. పాదచారులూ, సైకిలిష్టులూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సిన స్థితి. ఒక పెద్ద ప్రమాదం జరగ్గానే హడావుడిగా క్రమబద్ధం చేసేపేరిట కొత్త నియమాలు ప్రకటించడం, మరోవైపు రోడ్లు వెడల్పుచేసి కార్లు బాగా పరుగులు తీసే ఏర్పాట్లుచెయ్యడం వంటి ప్రదర్శనాత్మకమైన పనులు చేపడతారు.వెడల్పుచేసిన రోడ్లలోకూడా పుట్ పాత్ లుండవు. ఎక్కడా సరైన బస్టాపులుండవు.

1965లో పాకీస్తాన్ తో యుద్ధం తరువాత కొన్ని కీలక పరిశ్రమలను సరిహద్దులకు దూరంగా దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది. దానిలో భాగంగానే డి.ఆర్.ఎల్. , బి.హెచ్. ఇ.ఎల్. ,ఇ.సి.ఐ.ఎల్. , ఎన్. ఎఫ్.సి. వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధలు హైదరాబాదులో ఏర్పడ్డాయి. నగరం నుండి బయటకు వెలుపలకు వెళ్ళే రైల్వే మార్గాలు ప్రక్కనే ఈ పరిశ్రమలను ఏర్పాటు చేశారు.అంతేగాక నగరం గుండా వెళ్తున్న జాతీయ రహదారుల నెంటే లేఅవుట్కు రాజకీయ, ఆర్ధిక ప్రాతిపదికలతో అనుమతులివ్వడంతో నగరం ఒక నక్షత్రంలా విస్తరించుకు పోయింది. ట్రాఫిక్ అంటే మోటారు వాహనాలే. మోటారులేని వాహనాలు, పాదచారులూ ట్రాఫిక్ క్రిందకు రాకపోగా, రోడ్డును ఆక్రమించేవారుగా పరిగణించబడుతున్నారు.జెఎన్ యు ఆర్ ఎం పధకాలంటూ ఇటీనల విజయవాడ, విశాఖలకు రూపొందిస్తున్న BRTSను చూస్తే పాలకుల ప్రజా వ్యతిరేక వైఖరి అర్ధం అవుతుంది. 20 కి.మీ. దూరం ఉండే BRTC మార్గంలో మిగిలిన ట్రాఫిక్ కోసం 17 ఫ్లైవోవర్లు కడతారట. అంటే పరోక్షంగా మోటారులేనివాహనాలు ప్రధాన రహదారిపైకి రాకుండా చేస్తున్నారు. బస్సులు రోడ్డు మధ్యభాగాన ఆగుతాయి. బస్సు ఎక్కాలంటే ఫుట్ ఓవరు బ్రిడ్జీ ఎక్కి దిగాలి. ముసలివారికి, పిల్లల్తోవెళుతున్నవారి బాధలు చెప్పనలవికాదు. దీని కోసం ఎడమవైపు స్టీరింగు, కుడివైపు ద్వారాలున్న ప్రత్యేక బస్సులు కావాలి. అవికూడా A.C. బస్సులు. ప్రపంచబ్యాంకు ఇచ్చే డబ్బుల్లో 80% ఈ బస్సుల కొనుగోలు రూపంలో ప్రపంచబ్యాంకు ఎంపిక చేసిన కంపెనీకే చేరతాయి. కనుక ఇందులో ప్రజాప్రయోజనాలు ఏమీ లేవు.

మెట్రోరైలు ప్రాజక్టు మొత్తం 71 కి.మీ. దూరం, నేలకు నాలుగంతస్తుల ఎత్తున ఉంటుంది. దీనికయ్యే ఖర్చు రు.12000 కోట్లు. అంటే కి.మీ.కు 169 కోట్ల రూపాయలు . ఈ అంచనాలు కనీసం 30-50 శాతం పెరుగుతాయి. దీనికోసం 5000 వాణిజ్య భవనాలు, 2000 నివాస భవనాలు కూలగొట్టాలి. 12 మీటర్ల ఎత్తున 33 స్టేషన్లు నిర్మించాలి. ఇంతా చేస్తే 2021 నాటికి 25 లక్షల ప్రయాణీకుల్ని చేరవేస్తుందట. అంటే ఇప్పుడు R.T.C.చేస్తున్నంత కూడా చెయ్యదు.

ప్రభత్వం ఈ ప్రాజక్టును ఆదర్శప్రాయం అంటుంది. ఈ ప్రాజక్టుకు 12000 కోట్లు ఖర్చయితే, ప్రభత్వంనుండి సహాయం వద్దనటమేకాక, ఎదురు 30000 కోట్లు ప్రభుత్వానికిస్తానని కాంట్రాక్టు పొందిన మైటాన్ కన్సార్టియం అంగీకరించింది. కాంట్రాక్టు 34 సంవత్సరాలు. ప్రయాణీకుల సంఖ్య తగ్గితే ప్రతివొక్కశాతం తగ్గుదలకూ ఒక ఏడాది లీజు పెంచాలి. ప్రభత్వం 269 ఎకరాలు ఇస్తుంది. ప్రాజక్టు అవసరం కోసం కంపెనీ స్వంతంగా భూసేకరణచేసుకోవచ్చు.దీనిని రియల్ ఎస్టేటుగా అమ్ముకోవచ్చ. స్టేషన్లన్నిటినీ వాణిజ్యభవనాలుగా చేసి అమ్ముకోవచ్చు. 2009 మార్చినాటికి ప్రభత్వానికి 240 కోట్లు చెల్లిస్తుంది.అక్కడనుండి 60 రోజుల్లోగా స్థలాలను ప్రభుత్వం కంపెనీకి ప్పగించాలి. ( భూసేకరణ చట్టం ప్రకారం 90 రోజులు పడుతుంది) ఆలస్యమైతే ప్రతిరోజుకు 24 లక్షల రూపాయల చొప్పన కంపెనీకి ప్రభుత్వం చెల్లించాలి. మెట్రో మార్గంలో R.T.C. బస్సులు నడపకూడదు. రద్దీ సమయంలో అదనపు చార్జీ వసూలు చేస్తారు. ఇవి కొన్ని మాత్రమే. మిగిలిన రాయితీల విషయం దాచివుంచారనీ వాటినికూడా బయటపెట్టాలనీ ప్రొ.సి.రామచంద్రయ్య కోరుతున్నారు. ఇది మెట్రో రైలు ప్రాజక్టు కాదనీ, మెట్రో రియలు ఎస్టేటు ప్రాజక్టుగా మారిందని ఆయన అన్నారు.

అధిక ఖర్చూ, ప్రయాణీకులపై అధిక భారం వేస్తూ ప్రజారవాణాకు తోడ్పడని మెట్రోరైల్వేప్రాజక్టును రద్దుచేయాలి.

No comments: