Thursday, October 30, 2008

కోస్టల్ కారిడార్

నిర్వాసితులను మోసపుచ్చే వాదనలు :
వాన్ పిక్ పేరిట రైతాంగం భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం పూనుకుంది. గ్రామసభలు జరిపి ప్రజల ఆమోదం పొందిన తరువాత మాత్రమే ప్రాజక్టుల నిర్మాణం చేపట్టాలన్న రాజ్యాంగ చట్టాన్ని ప్రభుత్వమే ఉల్లంఘించి , భూములు వదులుకోవడానికి నిరాకరిస్తున్న రైతులపై నిర్భంధాన్ని ప్రయోగించడానికి పూనుకుంటుంది.
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి తులసిరెడ్డి వాన్ పిక్ ను వ్యతిరేకించేవాళ్ళు అభివృద్ధి నిరోధకులని , ప్రతిపక్షాలు రైతులను,మత్స్యకారులనూ రెచ్చగొడుతున్నాయని ఆరోపించాడు. ప్రభుత్వం 2008 మార్చి నెలలో 'రస్ ఆల్ ఖైమా' అనే సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం మూడు నెలల్లో ఆర్ధికంగా లాభసాటి అవునా కాదా అనే (ఫీజిబిలిటి) రిపోర్టు అందజేయాలి. వాన్ పిక్ కోసం అవసరమైన సాంకేతికత, ఆర్ధిక స్థోమత వున్న ఏ విదేశీ సంస్థనైనా భాగస్వామిగా చేసుకునేందుకు రస్ ఆల్ ఖైమా కు అవకాశం ఇచ్చారు. మాట్రిక్స్ ఎన్ పోర్ట్ అన్న కంపెనీ ఇందులో భారత్ భాగస్వామి. విశాఖలో ప్రైవేటు కంపెనీల బాక్సైటు త్రవ్వకాలు చెల్లవన్న సుప్రీం కోర్టు తీర్పును వమ్ము చేయడానికి , ప్రభుత్వరంగ సంస్థే తవ్వుతున్నట్లు చూపి , రస్ ఆల్ ఖైమాకు ఇచ్చారు. బాక్సైట్, అల్యూమినియం రంగంలో రస్ ఆల్ ఖైమా లేదు. దీనిని శిఖండిగా పెట్టుకొని స్టెరిలైట్ కంపెనీ తవ్వకాలను చేపట్టింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలు మన దేశ వనరులను ( విద్యుత్తు,నీరు, ద్రవ్యం, ఖనిజాలు ) ఉపయోగించుకొని ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తాయి. ప్రదానంగా రసాయన పరిశ్రమలు. దేశీయ వనరులు విదేశీకంపెనీల లాభాలకు వాడబడతాయి. మనకు మిగిలేది ప్రమాదకర కాలుష్యము, జీవనోపాధి మృగ్యమైన జీవనాలు.

పారిశ్రామికీకరణ జరగరాదని ఎవరూ అనరు, ఇది ఎవరికోసం ఏవిధంగా జరగాలన్నది చర్చ. సామ్రాజ్యవాదులు సహాయం పేరిట రుణాలనిచ్చి, పారిశ్రామిక విధానాన్ని నిర్దేశిస్తున్నారు. ఈ ఋణాల ఉచ్చులో కూరుకుపోయిన భారత పాలకులు ఋణాలను తిరిగి తీర్చాలంటే ఎగుమతులను పెంచి విదేశీమారక ద్రవ్యాన్నఆర్జించాలన్న ప్రపంచ బ్యాంకు సూత్రాలు అమలు జరుపు తున్నారు.దీనినే ఎగుమతి ఆధారిత అభివృద్ధి వ్యూహంగా పిలుస్తున్నారు.
కనుక ఇక్కడ దేశ ప్రజల అవసరాలను తీర్చే పరిశ్రమలు నిర్మించరు . విదేశీ మార్కెట్టులో అమ్ముడయ్యే సరుకుల ఉత్పత్తి కోసమే పరిశ్రమలు పెడతారు. అదీకూడా విదేశీ కంపెనీలే పెడతాయి. ప్రజల అవసరాలు తీర్చకపోయినా , రాయితీల పేరుతో ప్రజాధనాన్ని వారికి ధారపోస్తారు. నూతన ఆర్ధిక విధానాల సారాంశమంతా ఇదే.

No comments: