Wednesday, September 10, 2008

గుడ్డీగ

మంచోడి బుధ్ది మాంసం కాడ బయటపడ్డట్టు
బుద్ధదేవ్ ఎవరి పక్షమో నందిగ్రామ్ లో తెలిసిపోయింది
నీరు పల్లానికే ప్రవహించినట్టు
పాలక కమ్యూనిష్టుపార్టీ
టాటాలు , సలీంల వైపుకు పరుగెత్తుతున్నాయి
పోరాడితే పోయేదేమీలేదని చెప్పేవాళ్ళు
పోరాడే ప్రజల్ని
పిట్టల్లా కాల్చి చంపుతున్నారు
నీడనివ్వాల్సిన చెట్టు నిప్పులు కురిపించిందిక్కడ
కట్టుకున్న చీరే కామంతో శీలం దోచిందిక్కడ
కాపాడాల్సిన కమ్యూనిష్టే కసాయిగా మారి
మరతుపాకులెత్తి మట్టి మనుషుల మానప్రాణాలు తీశాడిక్కడ
దేవాలయాల మెట్ల వద్ద
మంచినీళ్ళ బావుల దగ్గర
సవర్ణులు దళితుల్ని తరిమి కొట్టినట్టు
పచ్చటి పంట పొలాల్లో
పారిశ్రమిక పెంటదిబ్బల్ని వొద్దన్నందుకు
మనిషి వాసన తగిలితేనే బుసలు కొట్టే క్రూరజంతువులా
పీడితులపై బులెట్ల వర్షం కురిపించాడు అభినవ డయ్యరిష్టు
శ్రమైక జీవన సౌందర్యానికి
పట్టాభిషేకం చెయ్యాల్సినవాడు
శ్రమజీవుల పొట్టలుగొట్టి
బూర్జువాలకు పట్టంగడుతున్నాడు
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వుద్యమించాల్సిన కార్మికరాజ్యం
తలుపులు బార్లా తెరిచి పెట్టుబడిదారులకు స్వాగతం
పలుకుతుంది
రైతు కూలీలు జిందాబాద్
రైతురాజ్యం సాధిస్తామ్ అని నినదించే వామపక్షీయులు
లాఠీలై , తూటాలై
ప్రజాపోరాటాల్ని నెత్తురుటేరుల్లో ముంచెత్తుతున్నారు
పేదలకు భూములు పంచాలంటు
దున్నేవాడికే భూమి దక్కాలంటూ
వ్యవసాయిక విప్లవం వర్ధిల్లాలంటూ
రైతు సంఘాలై వ్యవసాయ కార్మిక మహాసభలై
భూమికోసం భుక్తికోసం ఈ దేశ విముక్తికోసం
పోరుచేసే కమ్యూనిష్టు పార్టీ
పంటభూముల్లో రసాయనిక పరిశ్రమలు ఎందుకన్న నేరానికి
పచ్చటి నేలంతా నెత్తుటిమయం చేసింది
ఇల్లలికి ముగ్గు పెట్టుకొని
తన పేరు తానే మరచిపోయిన గుడ్డీగలా
వర్గాన్ని, వర్గపోరాటాన్ని మరచిపోయారు
“ భారతీయ కమ్యూనిష్టులు “
అధికారపు మత్తులో కూరుకుపోయి
ప్రజల్ని మరచిన
ప్రభుత్వ కమ్యూనిష్టులారా !
నందిగ్రామ్ లో ఉవ్వెత్తున లేచిన నెత్తుటి కెరటం
అణగారిన ప్రజల గుండెల్లో రగిలే తఫానుకు సూచన.
ఇక మీ పతనం తప్పదు
-----
మల్లిఖార్జున పిల్లి

No comments: