Wednesday, September 24, 2008

పరాన్నజీవిగా అమెరికా సామ్రాజ్యవాదం

తనఖా ద్రవ్య సంస్థలైన ఫాన్నీమే , ఫెడ్డీమాక్ కంపెనీలను అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థలూ కలిపి 5 లక్షల 30 వేల కోట్ల డాలర్ల అప్పుల్లో మునిగిపోయాయి. అమెరికా గృహ రుణాలలో 80 శాతాన్ని ఈ రెండు కంపెనీలే తనఖా పెట్టుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ అప్పులు తీరుస్తానని హామీ పడింది. ప్రజలనుండి వసూలు చేసిన పన్నుల నుండే ఈ అప్పులు తీరుస్తుంది. దీని అర్ధమేమిటి? గుత్తపెట్టుబడదారులకు వచ్చిన నష్టాలను సమాజపరం చేస్తారు. లాభాలను ప్రవేటు పరం చేస్తారు.
రెండు కంపెనీలను రక్షించడానికి ఖర్చుపడుతున్న ఈ సొమ్ము ప్రజలకోసం వెచ్చించే సొమ్ముతో పోల్చి చూస్తే అమెరికా ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో తెలుస్తుంది. విద్యకు 6 వేలకోట్ల డాలర్లు, నిరుద్యోగ భృతికి 3 వేలకోట్లు, రహదారులకోసం 5 వేలకోట్లు, గృహవసతి కల్పనకు 7000 కోట్లు మాత్రమే. కంపెనీలు తమ పెట్టుబడితో జూదమాడుతాయి. లాభాలొస్తే తమ బొక్కసాలు నింపుకుంటాయి.నష్టాలు వస్తే ప్రజలు భరించాలి. ఇది సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థ దివాళాకోరు తనాన్ని తెలుపుతుంది.

3 comments:

రవి వైజాసత్య said...

మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం మరచిపోయారు..ఆ రెండు కంపెనీలకు బాకీ పడింది ఎవరూ? (ప్రభుత్వం కాదండీ) ప్రజలే కదా..కాకపోతే తాహతుకు మించి రుణాలు తీసుకున్న ప్రజలు. అంటే ప్రజల డబ్బే ప్రజలకు వెళుతుంది. కానీ, సంపాదించే వాళ్ళ డబ్బు తెలివితక్కువ వాళ్ళకు వెళుతుంది. government incentivizing stupidity.

Anonymous said...

రవి గారు,

మంచి పాయింట్.

Anil Dasari said...

ఇదే విషయం గురించి దేవన అనంతం గారి బ్లాగులో నేను రాసిన వ్యాఖ్య:

Federal National Mortgage Association a.k.a Fannie Mae (Estd: 1938), మరియు Federal Home Mortgage Corporation a.k.a Freddie Mac (Estd: 1970) రెండూ స్థాపించబడినప్పటినుండీ ప్రభుత్వరంగ సంస్థలే (Government Sponsored Enterprises - GSEs). స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉన్నప్పటికీ వాటికి నిధులు సమకూర్చే బాధ్యత మొదటినుండీ ఫెడరల్ గవర్నమెంటుదే. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ చేసిన పని సబ్-ప్రైమ్ దెబ్బకి కుదేలయిన ఈ రెండు సంస్థలనీ కేంద్ర ప్రభుత్వ ఖజానా నుండి నిధులిచ్చి రోడ్డున పడకుండా ఆదుకోవటమే తప్ప జాతీయం చెయ్యటం కాదు. అసలు జాతీయం చెయ్యటానికి అవి ప్రైవేటు సంస్థలయితే కదా!

దానికి దేవన గారి ప్రతిస్పందన:

ఫ్యాన్ని మరియు ఫ్రేడ్డి లు జి.ఎస్.ఎ లు అని తెలుసు. కాని అందులో ప్రైవేటు మదుపుదార్లు కూడా వుంటారు. నష్టం వస్తే ప్రభుత్వం బరించాలి, లాభం వస్తే ఈ మదుపుదార్లు అనుభవిస్తారు అలాగా వుంది ఆ సంస్థల పని తీరు. అలాంటప్పుడు పన్ను కట్టే సామన్యుని పైన భారం వేయడం ఎందుకు అనేదే నా ప్రశ్న?

దానికి నా వివరణ:

ఎనభయ్యేళ్లుగా ఫానీ, నలభయ్యేళ్లుగా ఫ్రెడ్డీ అమెరికన్ సమాజం అభివృద్ధిలో పోషించిన పాత్ర సరిగా అర్ధం చేసుకోకుండా మీరు చాలా తేలికగా 'వాటి నష్టాలని పన్ను కట్టే ప్రజలపై వేయటం ఏమి న్యాయం' అని అడుగుతున్నారు. ఇన్ని దశాబ్దాలుగా ఈ రెండు సంస్థల కారణంగానే అమెరికన్ ప్రజలకి తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాల మంజూరీ జరిగింది. అలా ఇళ్లు సమకూర్చుకున్న సాధారణ ప్రజలంతా పన్ను చెల్లింపుదారులే; ఈ సంస్థల వల్ల ప్రయోజనం పొందినవారే. సబ్ ప్రైం సంక్షోభం కారణంగా మొట్టమొదటి సారిగా ఇవి నష్టాల్లో పడ్డాయి, ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. కొన్ని తరాలుగా ఈ సంస్థల సౌజన్యంతో లాభం పొందిన పన్ను చెల్లింపుదారులు ఒక సారి వాటి నష్టాల్లో భాగం పంచుకుంటే తప్పేమిటి?

ఆ టపాకి లంకె: http://devanahariprasadreddy.blogspot.com/2008/09/blog-post_10.html