Wednesday, April 25, 2007

కోతి గుండెకాయ

నానాటికీ విపరీతమౌతున్న ధరల పెరుగుదల తాత్కాలికమేనని కొద్దిరోజులలో సాధారణ స్థాయికి వస్తాయని కొన్ని నెలల క్రితం ఆర్ధిక మంత్రి హామీ యిచ్చారు. కానీ ధరల పెరుగుదల అదుపులోకి రాలేదు. దీనితో ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసే చర్యలు తీసుకుంటామని చెప్పాడు. అయితే ఆచర్యలేమిటో చెప్పలేదు. ద్రవ్యోల్బణానికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి అమెరికా డాలర్లను రిజర్వుబ్యాంకు కొనటం, రెండవది నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యం అనుమతించటం.
భారత దేశపు విదేశీ మారక నిల్వలను పెంచేందుకు దేశంలో డాలర్లను పెట్టుబడిగా తెస్తున్న వారి నుండి రిజర్వు బ్యాంకు డాలర్లను కొని వారికి రూపాయలు ఇస్తున్నది. ఇలా కొన్న డాలర్లను దేశంలో అమ్మితే దిగుమతులు చేసుకొనేవారు రూపాయలను ఇచ్చి డాలర్లను కొనుక్కుంటారు. అయితే విదేశీ మారక నిల్వలను పెంచాలి గనుక రిజర్వు బ్యాంకు డాలర్లను అమ్మటంలేదు. డాలర్లు కొనడానికి రూపాయలను ముద్రిస్తుంది. దీనితో దేశంలో సంపదల ఉత్పత్తి పెరగకుండానే రూపాయల చలామణీ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుంది. ఇదే ద్రవ్యోల్బణం. ఇది ధరల పెరుగుదలగా కనిపిస్తుంది.
ఈ ప్రాధమిక సూత్రం భారత ప్రభుత్వానికి తెలియంది కాదు. కానీ అమలు చేసేందుకు వారు సిద్ధంగా లేరు. దేశంలో ఉన్న డాలర్లను అమ్మితే చలామణిలో ఉన్న డాలర్లు పెరిగి డాలరు విలువ తగ్గుతుంది. అంటే డాలరు విలువ 44 రూపాయలనుండి 40 రూపాయలకు తగ్గుతుంది. విదేశాలకు సరుకులు ఎగుమతి చేసిన వ్యాపారులకు తక్కువ రూపాయలు వస్తాయి. వారికి లాభాలు తగ్గుతాయి. అందుకే ఇటీవల రూపాయి మారకపు విలువ కొద్దిగా పెరగ్గానే రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకోవాలంటూ వారు గగ్గోలు పెట్టారు. కనుక ఆ వ్యాపారుల లాభాల కోసం రిజర్వు బ్యాంకు రూపాయలు ముద్రిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి చలామణిలోవున్న రూపాయలను తగ్గించటానికి ఇతర మార్గాలను రిజర్వు బ్యాంకు వెతికింది. దానికి వున్న మార్గం ఒక్కటే కాష్ రిజర్వు నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచింది. దీనివల్ల బ్యాంకులు తాము ఇచ్చే రుణాలను తగ్గిస్తాయి . దీని ద్వారా 15500 కోట్ల రూపాయలను చలామణి నుంచి వెలుపలకు తీయబూనుకుంది.దీనితో ష్టాక్ మార్కెట్టులోని షేర్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే రిజర్వు బ్యాంకు ఈ విధానం కొంత కాలం సాగితే డిమాండు తగ్గి ధరలు తగ్గుతాయని అంటుంది. తన చర్యల ద్వారా రూపాయల చలామణీ తగ్గించిన రిజర్వు బాంకు కూలిన షేరు మార్కెట్టును నిలబెట్టేందుకు తీసుకున్న చర్యలకు ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా తెలియదు. ఏతావాతా ఆశించిన మేరకు ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు.
టోకుధరల సూచి మార్చి నాటికి 6.5 శాతం కాగా చిల్లర ధరల సూచి 8 - 10 శాతం మథ్య పెరుగుతూ వస్తుంది. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణను వదిలేశారు. వీటి రవాణాపై ఆంక్షలు ఎత్తివేశారు. మార్కేట్టు యార్డులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేస్తున్నారు. రైతుల సంక్షేమం పేరిట తీసుకుంటున్న శీతల గిడ్డంగులు, అడ్వాన్సులు , రుణాలు, మొదలగు అవకాశాలన్నీ దోపిడీ వర్గాలకే అందజేస్తున్నారు. వీటికి పరాకాష్టగా నిత్యావసర సరుకులలో భవిష్య వాణిజ్యాన్ని అనుమతించారు.ఈ చర్యల ఫలితంగా నిత్యావసర సరుకులన్నీ చట్టా వ్యాపారుల పరమయ్యాయి. నిల్వలు పెంచివేసి కృత్రిమంగా ధరలు పెంచివేస్తున్నారు. భవిష్య వాణిజ్యం వల్ల రేట్లు పెరిగి బడా వాణిజ్య వర్గాలు లాభ పడుతున్నాయే తప్ప రైతులకూ ,వినియోగదారులకూ వొరిగిందేమీ లేదు. ప్రదర్శనాత్మకంగా గోదాములపై దాడులు నిర్వహించటం వంటి చర్యల ద్వారా మధ్య తరహా వ్యాపారులను వేధించి - వారిని రంగం నుండి తప్పించే పనులు బడా వర్గాలకు తోడ్పడుతుందితప్ప సామాన్యుడి భారాన్ని తగ్గించదు.
నిత్యావసర వస్తువులు ప్రధానంగా వ్యవసాయ రంగం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి రేట్లు పెరిగితే వినియోగదారుదైన సామాన్యుడు నష్టపోతాడు; రేట్లు తగ్గితే ఉత్పత్తిదారుదైన రైతు నష్టపోతాడు. కనుక డిమాండు సప్లైల సమతుల్యత దెబ్బతినకుండా చూడడానికని చెప్పి ప్రభుత్వం తన నిష్క్రియతను సమర్ధించుకుంటున్నది.ప్రభుత్వం ఆర్ధిక సూత్రాలు వల్లెవేసి వాస్తవాన్ని దాచిపెట్ట జూస్తున్నది. కర్నూలులో టమోటాలకు అర్ధ రూపాయి కూడా రాక రైతులు అల్లాడుతున్నారు; కాగా విశాఖలో కేజీ 12 రూపాయలకు అమ్ముతున్నారు.ధాన్యం ,నూనె గింజలు, కూరగాయలు వంటి రైతు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.కాగా ధాన్యం ,పప్పులు, వంటనూనెలు,కూరగాయల రేట్లు మార్కెట్లో చుక్కలంటు తున్నాయి. ధరల పెరుగుదలకు సంస్కరణలనే ఆర్ధిక విధానాలే కారణం. రైతుల ,వినియోగదారుల సంక్షేమం గురించి ప్రభుత్వ వాదనలన్నీ మొసలి కన్నీరేనని పై వాస్తవాలు తెలియజేస్తున్నాయి . భార్య కోసం కోతి గుండెకాయను కొరిన మొసలిలాగే దోపిడీ వర్గాలకు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం సామాన్యుని సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఇలాంటి ప్రభుత్వం నుండి ప్రజలకు ధరల తగ్గింపు వంటి ఉపశమన చర్యకూడా అందదనీ, ఈ దోపిడీ విధానాలను మార్చివేయగల ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప ఈ సమస్యల వలనుండి బయటపడలేము. అందుకోసం సంఘటిత పోరాటాలు సాగిద్దాం రండి.