Tuesday, April 24, 2007

దళితులకు పంగనామాలు పెట్టబూనుకొంటున్న దళిత గోవింద

కర్నూలు జిల్లా ఫాపిలిలో గణేశ నిమజ్జనం సందర్భంగా అగ్రవర్ణాలవారు దళిత యువకులను హత్య చేయూటం , ఖైర్లాంజీ (మహారాష్ట్ర)లో దళిత కుటుంబంపై అగ్రవర్ణాలవారు దాడిచేసి ముగ్గురు కుటుంబ సభ్యులను నానా చిత్ర హింసలు పెట్టి, వారిలో ఇద్దరు స్త్రీలను పాశవికంగా లైంగిక హింసకు - బలాత్కారానికి గురిచేసి ఆనక వారిని హత్యచేయడం, తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగానే గ్రామ సర్పంచులుగా ఎన్నికైన దళితులను ప్రమాణ స్వీకారం చేయకుండానే హతమార్చటం, కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని బసవనజాగెవాది సమీపం లోని కడా కోల కుగ్రామంలోని చలువాది కులానికి చెందిన దళితులను చెరువులో నీరు వాదుకుంటున్నారన్న కారణంగా అగ్రవర్ణాలు వెలివేయడం, హర్యానా లోని కర్నాల్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో గ్రామ పంచాయితీ అనుమతి పొందిన దళితులు తమ స్వంత రవిదాస్ ఆలయాన్ని నిర్మించుకోబోగా , బ్రాహ్మలు దాన్ని అడ్డుకొని, విద్వంసం చేసి, రవిదాస్ విగ్రహాన్ని విరగ్గొట్టటమేకాక, దళితులను వెలివేయడం అన్నవి నిన్నటి వార్తలు కాగా ;
ఆంధ్ర ప్రదేశ్ వికారాబాద్ జిల్లాలోని ద్యాచారం గ్రామంలో, అనారోగ్యంపాలై రెండు రోజులు పనికి వెళ్ళలేనందుకు ఆగ్రహించిన బలిజ దొరలు దళిత పాలేరుల్ని చంపటం (21-12-06), దళిత మహిళల మరుగు దొడ్డి ఎదుట గల ప్రభుత్వ పోరంబోకులొ అగ్ర వర్ణాలవారు ఇల్లు కట్టుకోవడానికి అభ్యంతరం చెప్పి, కోర్టు ఇంజక్షను తెచ్చుకొన్న దళితుడు మచ్చుమర్రి.ధైన్యుడిని, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం లొని, బాచేపల్లి గ్రామంలో అగ్ర వర్ణాలకు చెందినవారు జీపుతో తొక్కించి హత్యచేయడం (25-12-06), బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో తినటానికి తిండిలేక రైలుపట్టాల వెంబడి పెరిగిన ఆకులూ అలములూ తెచ్చుకుంటూ అదేసందర్భంలో ఒక అగ్రకులానికి చెందినవారింట్లో బచ్చలి కూర తుంచుకొని ఇంటికిపోయి ఇంటిల్లిపాదికీ ఆపూటఆహారం సమకూర్చే ప్రయత్నంలో ఉన్న పదేళ్ళ దళిత బాలిక ఖుష్బూను, అగ్ర వర్ణానికి చెందిన యజమాని పట్టుకొని కుడిచేతి ఐదు వేళ్ళనూ దారుణంగా నరికివేయడం (26-12-06), షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక మహిళ వంట వండిందనే కారణం చేత, మంచీర్యాల సమీపం లోని భీమిలి మండలం లోని క్రొత్తపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలోని బి.సి. విద్యార్ధులే 10 రోజులపాటు అన్నం ముట్టుకోకుండా వుండటం (2-1-2007), మెదక్ జిల్లా గజ్వేల్ తాలూకా లోని దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో, మధ్యాహ్న భోజన పథకంలో దళిత స్త్రీలు వంట వండిన కారణంగా, ప్రాధమిక పాఠశాలలోని దళితేతరులు ఆభోజనాన్ని ముట్టకపోవడం (6-2-2007), మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చెర్ల మండలం ఆలోని పల్లెలో పీర్ల పండుగ సందర్భంగా డప్పుకొడుతున్న మాదిగల్లోని వకరికీ, గొల్ల ఎల్లయ్య అనే వ్యక్తికీ చిన్న వివాడం వచ్చి, అందుకు నిరసనగా డప్పులు చాలించి ఇంటికి వెళ్ళిన మాదిగలపై, అవమానంగా భావించిన పెత్తందార్లు దళిత వాడపై దాడి చేసి స్త్రీలతో సహా తీవ్రంగా కొట్టటం , దాడికి భయపడిన దళితులు వాడ వదిలిపెట్టి పారిపోవటం (30-1-2007), హర్యానాలోని కర్నాల్ జిల్లాలోగల సాల్వాన్ గ్రామంలో పోలీసుల సమక్షంలోనే రాజపుత్ యువకులు దళితవాడ పై దాడిచేసి నిప్పంటించి 24 ఇళ్ళను బూడిదపాలు చెయ్యటం (1-3-2007), ప్రకాశం జిల్లా గుడ్లూరు మందలంలోని అడివిరాజుపల్లె గ్రామంలో అరుగుపై కూర్చున్నారనే కారణంతో పెత్తందార్లు దళిత దంపతులను బండబూతులు తిట్టి, కొట్టటం (9-4-2007), మహారాష్ట్ర భంధరా జిల్లాలో వంచగాన్ గ్రామములో అప్పు ఇవ్వటానికి నిరాకరించిందని, ఇందూబాయి అనే దళిత మహిళను మరో కులానికి చెందిన వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనానికి పాల్పడటం (10-4-2007), కర్ణాటకలోని మాండ్ల జిల్లాలోని కె.షేట్టహల్లి గ్రామంలో లోకపావని నదిలో ఒక దళిత యువకుడు ఈత కొట్టాడన్న కారణంచేత ఆగ్రహించిన అగ్రవర్ణస్తులైన వొక్కలిగ కులస్థులు దళితులపై దాడి చేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడానికి దళిత వాడకు వొచ్చిన పోలీసులు సహితం దళితులపైనే హింసకు పాల్పడటం (13-4-07) అన్నవి నేటి వార్తలు. అమానవీయమైన ఈ అంటరానితనాన్ని సమాజం నుండి రూపు మాపాలని సంఘాన్ని సంస్కరించాలని అనాది కాలం నుండి ఎందరో సంఘసంస్క్ర్తలు కృషిసల్పుతూనేవున్నారు. ఆదిశంకరులు, రామానుజులు,బసవేశ్వరుల కాలం నుండి , చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆలయ ప్రవేశం చేయించిన బ్రహ్మనాయుదు నుండి, గాంధీ,రఘుపతి వెంకట రత్నం నాయుడు, గోరా లాంటి ఎందరో కృషి చేశారు. కానీ అరికట్టలేక పోయారు. ప్రపంచీకరణ సాగుతున్న ఈ అధునాతన 21వ శతాబ్దంలో సైతం ,మానవ విజ్ఞానం ఎంత సాంకేతికంగా పెంపొందినా , హైందవ ధర్మానికి మూలస్థంభంగావున్న ఈ కులాచార మూఢత్వం తగ్గకపోగా పలు రూపాల్లో వెర్రితలలు వేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొరటుగా సూటిగా దర్శనమిచ్చే ఈ అంటరానితనపు కుల జాడ్యం పట్టణాల్లో , నగరాల్లో సున్నితమైన పరోక్షరూపాల్లో కొనసాగుతుంది. దక్షిణ భారత దేశంలో అతి పెద్దదైన, ఇబ్బడి ముబ్బడి ఆదాయ వనరులుగల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కరుణాకరరెడ్డి నేతృత్వంలో 'దళిత గోవిందం' అనే 'హిందూ సమాజ సంస్కరణోద్యమం' అనే ఒక తతంగం ప్రారంభమైంది.ఇది తనసారధ్యంలో నిర్వహించ బడుతున్న 'హైందవ ధర్మ పరిరక్షణ ఉద్యమమని ' తామొక చారిత్రక అవసర కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామని, హిందూ మతంలో కొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా,ఆధ్యాత్మిక రంగంలో కులతత్వాన్ని పెకలించడానికి తాము ఈ దళిత గోవిందాన్ని చేపట్టామని కరుణాకరరెడ్డి చెప్పుకుంటున్నాడు. అంటేకాక దళితులను ఆర్ధికంగా ఆదుకొనుటకు వందకోట్ల రూపాయలను వెచ్చించి దళితులపిల్లలకు కాన్శెప్టు స్కూళ్ళూ, 10 కోట్ల రూపాయలతో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. నిరంతర అవమానాలను అనుభవిస్తూ ,అత్యాచారాలకు గురౌతూ వాటిని భరించలేక తమను సాటిమనిషిగా కూడా చూడలేని 'హైందవ ధర్మ వ్యవస్థను ' ఈసడించుకుంటున్న దళితులు కొందరు అన్యమతాల్లోకి మారుతున్నారు. తమను అక్కున చేర్చుకుంటున్న ఇతర మతాల్లోకి మారుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలివేసిన విద్య, వైద్యం మొదలగునవి ఉచితంగా అందించే క్రైస్తవ మతంలోకి ఎక్కువగా చేరుతున్నారు. ఈ పరిణామం హిందూ మతనాయకత్వానికి పెద్ద నష్టంగా పరిణమించింది. ఈ ప్రమాదాన్ని గమనించి కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వారికి వైద్యం విద్య సౌకర్యాలు కల్పించి దళితులను అన్య మతాల్లోకి పోకుండానిలిపే ప్రయత్నాలు చేస్తూ, ఇతరులు కూడా అలాచేయాలని సూచించాడు. నేడు పేదలైనా , దళితులు ఎక్కువమంది ఉండతంవల్ల ,వారు హిందువులుగా వుంటే , వారినుండి మతసంస్థలకు వచ్చే ఆదాయం కూడా ఎక్కువగావుంతుందని అనగా హైందవధర్మ పరిరక్షణా, ఆదాయవనరుల పరిరక్షణా , ఒక్క దెబ్బకు రెందుపిట్టలు కొట్టాలనే ఎత్తుగడతో కరుణాకరరెడ్డి ఈ దళిత గోవిందాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తలకెత్తాడు.
దళిత గొవిందం పేరిట ,వేమూరు(గతంలో ఈ గ్రామం లోని రామాలయం లోకి దళితుల ప్రవేశాన్ని అగ్రవణస్తులు అడ్డుకొని,నిషేధించారు.)గ్రామంలోని దళిత వాడలోకి శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తీసుకు వెళ్ళి , అర్చకులతోసహా దళితవాడలోనే సహపంక్తి భోజనం చేసి , దళితవాడలోనే ఆ రాత్రికి విశ్రమించి, శ్రీనివాస కళ్యాణ తతంగాన్ని దళితవాడలోనే జరిపించటంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇంతటి అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాల్లోని ఆచరణలోని లోపాలు ఈ దళిత గోవిందం అసలు స్వభావాన్ని దాచిపెట్టలేకపోతున్నాయి.
వేమూరు గ్రామంలో అగ్రవర్ణాలు వారు నివసించే వీధులను ఘనంగా అలంకరించుకున్నారు. దళితవాడలను కనీసంగా కూడా అలంకరించలేదు.వారు వేసుకున్న ముగ్గులతో సరిపెట్టారు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో అగ్రవర్ణాలవారి ప్రతి ఇంటిముందూ ఆపి, హారతులు ఇవ్వటం --దళితవాడలో దళిత కుటుంబాల వారి వద్ద నుండి అర్చకులు హారతి ,పూజా ద్రవ్యాలను స్వీకరించకపోవడం. దళితుల ఇళ్ళలో చేసిన వంటకాలుకాకుండా బయటినుండి ఇతరులచేత వండించుకొని దళిత వాడలో తినటం.కరుణాకరరెడ్డి ఆ దళిత వాడలో ఎంతగా తిరిగినా కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళయినా ముట్టకపోవడం. ముళ్ళమీద నిల్చినట్లు ఆ దళిత వాడలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు గడిపి ఆనక ఇంటికి పోయాక తమనూ, తమ కొంపలనూ శుద్ధిచేసుకోవడం అన్న వైనాలు గమనిస్తే ఈ దళిత గోవిందంలోని బండారం ఆర్ధమవుతుంది.హిందూ ధర్మ పరిరక్షణ పేరిట , దళితులను భ్రమల్లో ముంచి దళితులను తమ వెనక ఉంచుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే పన్నాగమే ఈ దళిత గోవిందం తప్ప ,ఇది ఎంతమాత్రమూ హిందూ ధర్మము లోని ,మతములోని దురాచారాలను రూపుమాపే సంస్కరణోద్యమం కాదు.

1 comment:

Nrahamthulla said...

డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన కోరారు.బౌద్దమతాన్ని స్వీకరించారు.హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు.భారత ప్రభుత్వం లౌకికవాదాన్ని కాపాడుతున్నది.అగ్రవర్ణ తీవ్రవాదులు మన దేశ లౌకిక నాగరికతను, సమగ్రతను దెబ్బతీస్తున్నారు.సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి. మనమంతాలౌకికవాదులం,శాంతినిప్రేమించేవాళ్ళం, అహింసావాదులం. కానీ మనకి ఏమి సరిపోతాయో వాటినే స్వీకరించాలి.కులవివక్ష అనేది తప్పు మరియు క్రూరమయినది. అధర్మాన్ని ఎదిరించకపోవటం మరింత అధర్మాన్ని ప్రొత్సహించడమే అవుతుంది. అది మరీ పాపకార్యం. మన సమస్యలను పట్టించుకోకుండా గుడ్డివాడిలాగా బూకరిస్తే మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి.
హిందూ సమాజం క్రమేణా దానిలోని వైరుధ్యాలను నియంత్రించుకుంటుంది. హిందూత్వాన్ని ఒక మతంలా చూడకుండా ఒక జాతిగా చూడాలని హిందూనాయకులు కొందరు కోరుతున్నారు. కులవివక్ష నిర్మూలించి అందరు హిందువులు సాంఘికంగా ఆధ్యాత్మికంగా సమానులేనని చెప్పటమే ఈ కార్యక్రమ ఉద్దేశమా? ఇన్నాళ్ళూ దళితులను దేవాలయాల్ని దర్శించటానికి, పూజారులవటానికి, వేదాలు నేర్చుకోవడానికి అనుమతించలేదు,నాలుగు వర్ణాలను వందలాది కులాలను నిర్మూలించటం,అవసరం.కులవివక్ష వర్ణవివక్ష అనేది మనిషి సృష్టించిన ఘోర పాపం. అప్పుడే పుట్టిన బిడ్డకు కులం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము, ఎంత నీచమైన పద్దతి? ఎవరైనా తప్పు చేస్తే దాని ఆధారంగా కొన్ని తరాల తరువాత వారి వారసులను శిక్షించొచ్చా? అది ఎంత వరకు న్యాయం? గొర్రెపిల్ల, తోడేలు కధ మనకు గుర్తు రావడంలేదా?
మన ధ్యాసంతా తప్పుడు పనులమీద ఉంది.మన ఆలోచనలు ఇతరులకు శక్తినివ్వాలి. అవి ఇతరుల్ని మానసికంగా అణచివెయకూడదు. అవి తిరోగమనంగా, వక్రంగా ఉండకూడదు. అవి ఇతరుల బుద్దిని హరించి అశక్తుల్నిగా చేయకూడదు. అనుత్పాదకంగా ఉండకూడదు. అణగారిన వర్గాలలో ప్రతి మనిషికీ అంతులేని తెలివి ఉంటుంది. మనం బలంగా తయారవటానికి ఇతరులపై పడి దోచుకోవడం మానుకుందాం. మరొకరి చాకిరినీ, మేధాశక్తినీ ఉపయోగించుకొని బలంగా, మందంగా, కావరంగా తయారవ్వకూడదు. ఇతరుల శక్తియుక్తులను పిండుకుని బలంగా అహంకారులుగా తయారవ్వటం అభివృద్ధి యొక్క ప్రామాణిక న్యాయ సూత్రాలను అతిక్రమించినట్లే. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఒక్కరికీ తెలిసుండాలి."మీరు పెరగాలంటే ఇంకొకరు తగ్గాలా? మీరు ఇష్టులుకావాలంటే, ఇతరులు అంటరానివాళ్ళు కావాలా? ఇతరులు మాత్రం అల్పులుగా, స్వల్పులుగా ఉండాలా?" ఇదే మీలో ఉన్న వినాశకర శక్తి. మర్యాదస్తుడు మరొకరికి మర్యాదనిస్తాడు తనతో సమానగౌరవం ఇస్తాడు. ఓ వ్యక్తి అభివ్రుద్ది అతనిలో దాగి ఉన్న నిపుణత మీద ఆధారపడి ఉన్నాయి. అతన్ని శత్రువుగా భావించి అణగదొక్కకూడదు.ఇతరులని పీడించి నాశనం చేయటానికి సమయాన్ని, ఆలోచనని, శక్తిని వృదాచేయవద్దు.ఉపయోగకరమైన గొప్ప పనులకోసం శక్తిని వెచ్చించండి.అంటరాని తలంపుల్ని వదులుకోండి. అందర్నీ రానివ్వండి.అందరితో కలవండి. స్వేచ్చ సృజనాత్మక శక్తికి జీవాన్నిస్తుంది. దళిత గోవిందం ఈ ఆధ్యాత్మికమైన స్వేచ్చను ఇచ్చేఆశాకిరణమేనా?ఈ దళిత గోవిందం సాంఘిక, ఆధ్యాత్మిక సమానత్వం వైపు దారి చూపాలి. దైర్యమిచ్చిఅడుగులు వేయిస్తూ ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి.కులవివక్ష పోయేదాకా అన్ని దేవాలయాల వాళ్ళూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.