పాకీస్తానీ నియంతలకు పక్కలో బల్లెమై నిలచిన పాకీస్తానీ ప్రజాతంత్ర కవి అబ్దుల్ ఫరాజ్
“నిరంకుశత్వ మేదియైన నిలువలేదు జగతిపై
దురాత్ములైన హిట్లరాదు లొరిగిపోయి రుర్విపై
ప్రజావిరోధి ఎవ్వడైన బ్రతుకలేడు నిశ్చయం
ప్రజాబలాల ధాటినాప ఎవరితరము కాదుపో “
అని మన తెలుగు ప్రజాకవి సుంకర సత్యనారాయణ తన మార్చింగ్ సాంగ్ లో నియంతలనూ, ప్రజా వ్యతిరేకులను ప్రతిఘటిస్తూ వ్రాశారు. పాకిస్తాన్ లోని సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటిస్తూ రచనలు సాగించిన కవుల్లో ప్రముఖుడు అబ్దుల్ ఫరాజ్ . ఆయన కోహట్ సమీపాన గల ఒక గ్రామంలో 1931 జనవరి 14 న జన్మించారు. తన 77 వ ఏట మొన్న 2008 ఆగష్టు 25వ తేదీన ఇస్లామాబాద్ లో మూత్రపిండాల వ్యాధితో మరణించారు. ఉర్దూ సాహితీ ప్రపంచంలో ఫరాజ్ నియంతల ప్రజా వ్యతిరేకతను సూటిగా , నిష్కర్షగా తన కవితలలో , గజల్లలో ఎండగట్టాడు. ఉదాహరణకు “ పెషావర్ ఖతి” లో “ తుమ్ సిపాహీ నహీం” అనే పాదంతో ప్రారంభమయ్యే కవిత ఇలా సాగుతుంది. తూర్పు పాకీస్తాన్ ( ఇప్పుడు బాంగ్లాదేశ్ ) లో , బెలూచీస్తాన్ లో పాకీస్తానీ సైన్యం సృష్టించిన దారుణ మారణ కాండను ఖండిస్తూ ఈ కవిత వ్రాశాడు.
“ మీరు వృత్తి హంతకులు, సైనికులు కారు
ఇప్పటి వరకు మీ కోసం విషాద గీతికలు
రచించాను
అవి రాసినందుకీనాడు సిగ్గుతో చితికి
పోతున్నాను
ఆ తూర్పున ఉన్నవాళ్ళు - మన రక్తసంబంధీకులే
వాళ్ళు మనవాళ్ళే ...మీరేమో వారి రక్తంతో హోలీ
చేసుకుంటున్నారు.
.................
వారి అదృష్టాలను మరల్చడానికి వెళ్ళారక్కడికి
మీరు చేసినదాని ఫలితం చూడండిప్పుడు
మీ లైంగిక అత్యాచారాల ఫలితం ఈనాటి
వారి పిల్లలు.
.........................
బెంగాల్ లో రక్తస్నానం పూర్తిచేసి
ఇక బయలుదేరారు బోలన్ పౌరుల
గొంతులు కోయడానికి “
ఫరాజ్ అసలు పేరు సయ్యద్ మహమ్మద్ షా . ఫరాజ్ అనేది ఆయన కలం పేరు. తండ్రి ఆగా సయ్యద్ మహమ్మద్ షా బార్క్ కోహట్ సంప్రదాయ కవిత్వరచనలో పేరు గడించినవాడు.
ఫరాజ్ పెషావర్ విశ్వవిద్యాలయంలో ఉర్దు, పర్షియన్ భాషలలో ఎం.ఏ. పట్టా పొంది ఆ విశ్వవిద్యాలయం లోనే అధ్యాపకునిగా పని చేశాడు. 1976 లో పాకీస్తాన్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అనే సాహిత్య అకాడమీకి సంస్థాపక డైరెక్టర్ జనరల్ గానూ, ఆ తర్వాత చైర్మన్ గానూ పనిచేశాడు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక కవి సమ్మేళనంలో తాను వ్రాసి, చదివిన కవితల కారణంగా అరెష్టు అయ్యాడు. భుట్టో నాయకత్వంలోని పాకీస్తాన్ పీపుల్స్ పార్టీలో పనిచేశాడు. 2004లో ప్రభుత్వ అత్యున్నత పురస్కారం అయిన హిలాల్ -ఇ-ఇమితియాజ్ ను పొందాడు.
అయితే ఇటీవల న్యాయమూర్తులను పదవులనుండి తొలగించడం, అమెరికాకు తొత్తుగా మారడం వంటి ముషారాఫ్ చర్యలకు నిరసన తెలియజేస్తూ 2006 లో ఆ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు. 2007 నవంబరులో ఢిల్లీలో రెండు దేశాల మధ్య సంబంధాల గురించి, రెండు దేశాలలోని ఉర్దూ సాహిత్యం గురించి గొప్ప ఉపన్యాసము ఇచ్చారు. ఆయన మరణం ఇరు దేశాల సాంస్కృతిక ఉద్యమానికి ఒక లోటుగా పరిగణించక తప్పదు.
Showing posts with label సంస్మరణ. Show all posts
Showing posts with label సంస్మరణ. Show all posts
Tuesday, September 23, 2008
Subscribe to:
Posts (Atom)